ఉప రాష్ట్రపతి సచివాలయం
దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
Posted On:
19 OCT 2025 5:39PM by PIB Hyderabad
దీపావళి శుభ సందర్భంగా ప్రజలకు ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపైన మంచి, అజ్ఞానంపైన జ్ఞానం విజయం సాధించడాన్ని పండుగగా చేసుకోవడమే దీపావళి పరమార్థమని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మన నాగరికతలో, మన సభ్యతలో జీర్ణించుకుపోయిన ఉదారత్వం, దాన గుణం, అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోవడం.. ఈ విలువలు సమాజంలోని ఆర్తులనూ, ఆదరణకు నోచుకోకుండా దూరంగా ఉండిపోయిన వర్గాల వారినీ మనం చేరదీసి, వారికి అండగా నిలబడే వేళ మరింత ఉజ్వలంగా వెలుగులీనే ఘట్టమే దీపావళి పండుగ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
మనం దీపావళి పండుగను పాటించుకొనే క్రమంలో, మన సొంత హితం కోసమే కాకుండా, దేశ ప్రజలందరి సమష్టి పురోగతి కోసం ప్రతికూల తత్వాన్నీ, అధర్మాన్ని తప్పక విడిచిపెట్టి అనుకూల తత్వాన్నీ, ధర్మాన్నీ అనుసరిద్దామని కూడా ఉపరాష్ట్రపతి ఉద్బోధించారు.
ఈ పండుగ రోజు, ప్రతి ఇంటా వెలిగించే దీపాలు రాత్రిపూట ఆకాశంలో తళుకులను విరజిమ్మినట్లుగానే మన అంకిత భావం, మన నిబద్ధత కలిసికట్టుగా మన దేశానికి ఉమ్మడి అభివృద్ధిని సాధించిపెట్టాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అభిలాషించారు.
లక్ష్మీ అమ్మవారు శాంతినీ, సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ తన ఆశీస్సులుగా ప్రతి ఒక్కరికీ అందించాలని దేవీ మాతను ఆయన ప్రార్థిస్తూ, అందరికీ తన స్నేహపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి సందేశం పాఠం ఇలా ఉంది.. :
దీపావళి శుభ సందర్భంగా, దేశ విదేశాల్లోని సాటి భారతీయులకూ, భారతదేశ మిత్రులకూ నేను నా స్నేహపూర్వక శుభాకాంక్షలతో పాటు శుభకామనలను కూడా తెలియజేస్తున్నాను.
దీపావళి అంటేనే చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం గెలవడాన్ని పండుగ చేసుకోవడం. మన నాగరికతలో, మన సభ్యతలో జీర్ణించుకుపోయిన ఉదారత్వం, దాన గుణం, అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోవడం.. ఈ విలువలు, సమాజంలో ఆర్తులనూ ఆదరణకు నోచుకోకుండా దూరంగా నిలబడిపోయిన వర్గాల వారినీ మనం చేరదీసి, వారికి అండగా నిలబడే వేళ.. మరింత ఉజ్వలంగా వెలుగులీనే ఘట్టమే దీపావళి పండుగ.
ఈ ఏడాది, మనం దీపావళి పండుగను చేసుకొనే వేళ, ప్రతికూల ఆలోచనలనూ, అధర్మాన్నీ విడిచిపెడదాం.. అనుకూల లక్షణాలనూ, ధర్మాన్నీ అనుసరిద్దాం.. కేవలం మన సొంత మేలు కోసం కాకుండా, దేశంలో ప్రజలందరి సమగ్ర పురోభివృద్ధిని కోరి ఈ పనిని చేద్దాం, రండి.
ప్రతి ఇంటా వెలిగించే దీపాల వెలుగులన్నీ కలిసి రాత్రి పూట నింగిని దీప్తిమంతం చేసినట్లుగానే, మనందరి అంకిత భావం, నిబద్ధత భారత్‌కు సమష్టి అభివృద్ధిని ప్రసాదించు గాక.
లక్ష్మీ అమ్మవారు శాంతి, సమృద్ధిలతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందరికీ తన ఆశీస్సుల రూపంలో, మీలో ప్రతి ఒక్కరికీ అందించాలని ఆ దేవీమాతను ప్రార్థిస్తున్నాను.
శుభ దీపావళి.
***
(Release ID: 2181044)
Visitor Counter : 6