యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 31 నుంచి రెండు సైక్లింగ్ యాత్రలను (కాశ్మీర్ టు కన్యాకుమారి, పెడల్ టు ప్లాంట్) నిర్వహించనున్న ఫిట్ ఇండియా
ఐరన్ వీల్స్ ఆఫ్ యూనిటీ సైక్లింగ్ యాత్రల్లో పాల్గొనే వారికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
17 OCT 2025 1:47PM by PIB Hyderabad
ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ‘ఐరన్ వీల్స్ ఆఫ్ యూనిటీ’ పేరుతో దేశవ్యాప్తంగా రెండు సైక్లింగ్ యాత్రలను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ యాత్రలు సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2025 అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశం అంతటా ప్రయాణిస్తూ జాతీయ ఐక్యత, ఆరోగ్యవంతమైన, ధైర్యవంతమైన దేశ స్పూర్తిని ప్రదర్శించడమే ఈ యాత్రల ముఖ్య లక్ష్యం.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి (కే2కే) సైక్లింగ్ యాత్ర అక్టోబర్ 31న జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా మొత్తం 4,480 కిలోమీటర్ల ప్రయాణం చేసి నవంబర్ 16, 2025న తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుంది. ఆ సైక్లింగ్ యాత్రలో 150 మంది పోటీదారులు పాల్గొననున్నారు. ఇది సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత్వానికి అంకితంగా నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం.
2023 మే 17న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు నిషా కుమారి.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి యాత్రకు నేతృత్వం వహించనున్నారు. ఆమె గతంలో ‘వాతావరణం మారే ముందు మనం మారుదాం’ అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ భారత్ నుంచి లండన్ వరకు సైకిల్ ప్రయాణం చేశారు.
ఇంకో ప్రత్యేకమైన యాత్రగా "పెడల్ టు ప్లాంట్" అనే సైకిల్ యాత్ర ప్రారంభమవుతోంది. ఈ యాత్రలో సైక్లిస్టులు 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాంగ్సౌ నుంచి ప్రారంభమై.. ఈ యాత్ర అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. చివరకు గుజరాత్లోని ముండ్రా వద్ద 2025 డిసెంబరు 31న ముగుస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా సైక్లిస్టులు 1,00,000 మొక్కలు నాటనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో వాతావరణ మార్పులు. ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘‘ఫిట్ ఇండియా ఐరన్ వీల్స్ ఆఫ్ యూనిటీ’’ ప్రచారంలో పాల్గొంటున్న సైక్లిస్టులకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు.. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమాన్ని మన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారికి ఘన నివాళిగా నిర్వహిస్తున్నారు. మన దేశ ప్రజలు ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ కోరుకుంటారు. ఈ కార్యక్రమం ఆయన దృక్పథాన్ని మరింత బలపరిచే దిశగా ఒక గొప్ప అడుగు. ఇది చురుకైన జీవనశైలిని అవలంబించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. నేను ముందుగా చెప్పినట్లుగా సైక్లింగ్ అనేది శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఉత్తమ మార్గం. కాలుష్యానికి పరిష్కారం కూడా. ప్రతి భారతీయుడు సైక్లింగ్ను తన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని, రోజుకు కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు తమ సొంత ఆరోగ్య దృఢత్వానికి అంకితం చేయాలని నేను కోరుతున్నాను.’’
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించిన 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' ఉద్యమానికి విస్తరణగా.. ‘‘ఐరన్ వీల్స్ ఆఫ్ యూనిటీ’’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ప్రధానంగా స్థిరమైన ఆరోగ్య విధానాలను ప్రోత్సహించడం, పర్యావరణంపై అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సైకిల్ యాత్రల ద్వారా 1,00,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని భావిస్తున్నారు.. ఇది మన దేశాన్ని ఆరోగ్యంగా మార్చడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణపై ఫిట్ ఇండియా ఉద్యమం తీసుకుంటున్న నిబద్ధతను కూడా చాటుతోంది.
***
(Release ID: 2180435)
Visitor Counter : 8