వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్, బ్రెజిల్ వ్యాపార చర్చల్లో ప్రసంగించిన బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్క్‌మిన్, రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మాంటెరో ఫిల్హో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వ్యవసాయం, ప్రపంచ ఆహార భద్రతలో భారత్, బ్రెజిల్ భాగస్వామ్యాన్ని ప్రముఖంగా వివరించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్
మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న భారత్: శ్రీ పీయూష్ గోయల్
భారతదేశ ఆర్థిక వృద్ధికి బలమైన స్థూల ఆర్థికాంశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలను మూడు మూల స్తంభాలుగా పేర్కొన్న శ్రీ పీయూష్ గోయల్
Posted On:
16 OCT 2025 3:20PM by PIB Hyderabad
భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధిని, బ్రెజిల్‌తో మరింతగా బలపడుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన భారత్, బ్రెజిల్ వ్యాపార సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సమావేశంలో పాల్గొన్నందుకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్క్‌మిన్, రక్షణ మంత్రి, జోస్ ముసియో మాంటెరో ఫిల్హోలకు శ్రీ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ, రెండు ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తి దేశాలైన భారత్, బ్రెజిల్ ప్రపంచ ఆహార భద్రతకు గణనీయంగా దోహదపడుతున్నాయని శ్రీ గోయల్ అన్నారు. ఈ చర్చల ద్వారా వ్యవసాయ వ్యాపారం, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉటంకిస్తూ... “భారత్, బ్రెజిల్ సంబంధాలు కార్నివాల్ అంత రంగులమయంగా, ఫుట్‌బాల్ అంత ఉత్సాహభరితంగా" ఉండాలని శ్రీ గోయల్ అన్నారు. బ్రెజిల్ తమ ఆరోగ్య వ్యవస్థల్లో యోగాను, ఆయుర్వేదాన్ని భాగంగా చేర్చినందుకు ఆయన అభినందించారు. సంప్రదాయ విజ్ఞానం, ఆరోగ్య సంరక్షణ పద్ధతులు రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆరోగ్య సహకారాన్ని మరింత బలపరచగలవని ఆయన పేర్కొన్నారు.
భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించిందని, గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ వేగం కనీసం వచ్చే రెండు దశాబ్దాల పాటు కొనసాగుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి గాథ మూడు బలమైన స్తంభాలపై ఆధారపడి ఉందని శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదులను అభివృద్ధి చేయడం మొదటి మూలస్తంభమని, ప్రభుత్వం తక్కువ ద్రవ్యోల్బణాన్ని కొనసాగిస్తూ, స్థిరమైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసిందని, ప్రపంచంలోనే అత్యంత బలమైన విదేశీ మారక నిల్వలను కలిగి ఉందని చెప్పారు. 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలతో, ఫారెక్స్ పటిష్టతలో ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో భారత్ ఒకటిగా ఉందని అన్నారు. ఈ బలమైన స్థూల ఆర్థిక పునాదులు దేశం తన ప్రతిష్ఠాత్మక వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, తన అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఒక ఆధారాన్ని అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
రెండో స్తంభం, ఆధునిక, నాణ్యమైన మౌలిక సదుపాయాలను దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టిందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు పోటీతత్వానికి పునాది అని, భారతదేశం అంతటా సమానమైన వృద్ధికి చోదక శక్తిగా ఉంటాయని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు కనెక్టివిటీని మెరుగుపరచడం, రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, వ్యాపారాలను విస్తరించే సామర్థ్యాన్ని, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులు యువతీ యువకులకు దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి, వ్యాపారాలకు, ఆవిష్కరణలకు కొత్త మార్గాలను తెరవడానికి అవకాశాలను అందిస్తాయని తెలిపారు. గత దశాబ్ద కాలంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యాలలో ఒకటిగా ఉందని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
భారత వృద్ధి గాధలో మూడవ స్తంభం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మధ్యతరగతిపై ఆదాయ పన్ను భారాన్ని తగ్గించిందని, వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)వ్యవస్థను సరళీకృతం చేసిందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న అమలులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలు పన్ను రేట్లను గణనీయంగా తగ్గించాయని, వాటిని పాటించడం మెరుగుపడిందని తెలిపారు. ఈ చర్యలు పౌరులకు అధిక వ్యయ సామర్థ్యాన్ని, వారి కుటుంబాలకు మెరుగైన జీవన నాణ్యతను అందిస్తాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాలు ప్రతి ఒక్కరూ ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు పొందేలా, అభివృద్ధి సమ్మిళితంగా, విస్తృతంగా ఉండేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.
భారత సాహసోపేతమైన సంస్కరణలను ప్రశంసిస్తూ ఐఎంఎఫ్ అధిపతి ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, 2025 సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.4 శాతం నుంచి 6.6 శాతానికి సవరించిందని శ్రీ గోయల్ తెలిపారు. గత 12 ఏళ్లలో 250 మిలియన్లమంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఇప్పుడు దేశ వినియోగం, వృద్ధి గాథను నడిపించే బలమైన, ఆకాంక్షపూరిత కొత్త మధ్యతరగతిని సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పౌరుడికి ఆహారం, గృహవసతి, విద్య, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా, మరింత సమగ్రమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి భారతదేశ సంక్షేమ, మౌలిక సదుపాయాల పెట్టుబడులను సమన్వయపరచినట్టు మంత్రి చెప్పారు.
నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం, షరతుల భారాలను తగ్గించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను శ్రీ గోయల్ పునరుద్ఘాటించారు. ఈ ప్రయత్నాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని, సమీప భవిష్యత్తులో భారత్ ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు సన్నద్ధం చేస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే భారత్ లక్ష్యం 140 కోట్ల మంది పౌరుల సామూహిక సంకల్పంతో ముందుకు సాగుతోందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధి, ప్రపంచ సహకారం, అభివృద్ధి చెందిన, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
శ్రీ గోయల్ తన ప్రసంగాన్ని ముగిస్తూ, "చెట్లను నాటకుండా ఎవరూ ఫలాలను పొందలేరు" అని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా చెప్పిన మాటలను ఉటంకించారు. దీర్ఘకాలిక వృద్ధి, భాగస్వామ్యానికి భారత్ బీజాలు వేసిందని, భారత్, బ్రెజిల్ మధ్య స్నేహం ఇరు దేశాలకు సుస్థిర సౌభాగ్యాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2180104)
Visitor Counter : 8