రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైల్వేలు’ ఇతివృత్తంతో న్యూఢిల్లీలో 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన-2025ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్


2047 నాటికి 7,000 కిలోమీటర్ల ప్రత్యేక ప్యాసింజర్ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళిక చేస్తున్న రైల్వేలు-వికసిత్ భారత్ దార్శనికత కింద గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన

ఐఆర్ఈఈ-2025లో వందే భారత్ 4.0, అమృత్ భారత్ 4.0, తదుపరి తరం రైల్వే తయారీ ప్రమాణాల దార్శనికతను వివరించిన కేంద్ర మంత్రి

Posted On: 15 OCT 2025 6:10PM by PIB Hyderabad

ఆసియాలో అతిపెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే ప్రదర్శన అయిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన-2025ను కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు.

గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో, గంటకు 320 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగంతో ప్రయాణించేలా రూపొందించే ప్రత్యేక ప్యాసింజర్ కారిడార్‌ల అభివృద్ధి ప్రణాళికలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకటించారు. 2047 నాటికి దాదాపు 7,000 కిలోమీటర్ల ప్రత్యేక మార్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా.. ప్రభుత్వ వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా దేశవ్యాప్తంగా ఇటువంటి అనేక కారిడార్‌లను నిర్మిస్తామని ఆయన అన్నారు. ఈ కారిడార్లలో దేశీయంగా అభివృద్ధి చేసిన సిగ్నలింగ్ వ్యవస్థలు, ఆధునిక ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్లు (ఓసీసీలు) ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

వందే భారత్ భారీ విజయాన్ని సాధించిందని కేంద్ర మంత్రి అన్నారు. సాంకేతిక పారామితుల పరంగా ఇది ప్రపంచంలోని అత్యుత్తమ రైళ్లకు తగినదిగా ఉందన్నారు. భారత్ తదుపరి తరం హై-స్పీడ్ రైళ్లపై పని చేస్తూనే, ఎగుమతి మార్కెట్‌పైనా ప్రధానంగా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత్ ప్రస్తుతం వందే భారత్ 3.0ని నడుపుతోందని, ఇది దాని మునుపటి వెర్షన్‌లతో పోలిస్తే గణనీయమైన మెరుగుదలను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ 3.0 ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకుంటోందనీ.. జపాన్, యూరప్‌లోని అనేక రైళ్ల కంటే వేగంగా కేవలం 52 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి ఇది చేరగలదని.. తక్కువ శబ్దం, వైబ్రేషన్ స్థాయిలనూ ఇది కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పనితీరు, ప్రయాణికుల అనుభవానికి సంబంధించి ప్రతి అంశంలోనూ ప్రపంచస్థాయి ప్రమాణాలను నిర్దేశించే లక్ష్యంతో రాబోయే 18 నెలల్లో వందే భారత్ 4.0ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త వెర్షన్‌లో టాయిలెట్లను, సీట్లను, కోచ్‌ల మొత్తం పనితీరును మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి రైలును కోరుకునేలా.. నాణ్యత, సౌకర్యాల్లో చాలా అధునాతనమైన విధానాలతో వందే భారత్ 4.0ని ప్రపంచస్థాయి ప్రమాణంగా రూపొందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

అమృత్ భారత్ రైళ్ల పురోగతినీ కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అమృత్ భారత్ 2.0 ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందనీ, వెర్షన్ 3.0 సుదూర ప్రయాణాలకు అనువైన పుష్-పుల్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి దశలో ఉందని ఆయన పేర్కొన్నారు. అమృత్ భారత్ 4.0లో తదుపరి తరం ట్రైన్‌సెట్‌లు, రైలింజన్లు ఉంటాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే 36 నెలల్లో కొత్త తరం ప్యాసింజర్ రైలింజన్లకు రూపకల్పన చేసి, తయారు చేసి, పరీక్షకు సిద్ధంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు.

గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రైల్వేల ఆధునికీకరణ, విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని కేంద్ర మంత్రి అన్నారు. దీని కోసం రైల్వే బడ్జెట్ నిరంతరం పెరుగుతూనే ఉందని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో 35,000 కిలోమీటర్లకు పైగా కొత్త ట్రాక్‌లు వేయడంతో పాటు 46,000 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తి చేశామన్నారు. భారతీయ రైల్వేలు ఇప్పుడు ప్రపంచ వేదికపై ప్రధాన ఎగుమతిదారుగా కూడా ఎదుగుతున్నాయని ఆయన తెలియజేశారు. మన దేశంలో తయారయ్యే రైలింజన్లు ఆఫ్రికా, ఆస్ట్రేలియా సహా అనేక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఉద్ఘాటించారు.

దేశవ్యాప్తంగా 156 వందే భారత్ సర్వీసులు, 30 అమృత్ భారత్ సర్వీసులు, 4 నమో భారత్ సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. 2024-25 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 7,000 కంటే ఎక్కువ కోచ్‌లు, సుమారు 42,000 వ్యాగన్లు, 1,681 రైలింజన్లు ఉత్పత్తి అయ్యాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు దేశంలో మొట్టమొదటి 9,000 హెచ్‌పీ ఎలక్ట్రిక్ రైలింజను ప్రారంభించామనీ, 12,000 హెచ్‌పీ రైలింజన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయనీ శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

రోజుకు 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలు ఇప్పుడు అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరుకు రవాణా నెట్‌వర్క్‌గానూ అవతరించాయని శ్రీ వైష్ణవ్ అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు 99 శాతం పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 1,300 కి పైగా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారత రైల్వేలు అనేక అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించాయనీ, వాటిలో ఐఫెల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తున్న చినాబ్ వంతెన, పంబన్ వద్ద భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన, కుతుబ్ మినార్ కంటే 42 మీటర్ల ఎత్తున్న బైరాబి సైరంగ్ వంతెన ప్రధానమైనవని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. రైల్వేల్లో భద్రత, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1.16 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో స్వదేశీ భద్రతా వ్యవస్థ కవచ్ కూడా భాగంగా ఉందన్నారు.

రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో శ్రీ సతీష్ కుమార్, గతి శక్తి విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ (డాక్టర్) మనోజ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైల్వేలు' ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను అక్టోబర్ 15 నుంచి 17 వరకు భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 15కి పైగా దేశాలకు చెందిన 450 మందికి పైగా ప్రదర్శనకారులు పాల్గొని ఆధునిక రైలు, మెట్రో ఉత్పత్తులు, ఆవిష్కరణలు, సుస్థిర పరిష్కారాలను ప్రదర్శిస్తున్నారు.

***


(Release ID: 2179960) Visitor Counter : 6