కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కర్ణాటకలోని హంపిలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) శిక్షణార్థులతో ముచ్చటించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
ఈ కార్యక్రమంలో పీఎంఐఎస్ ద్వారా తాము సాధించిన విజయాలను పంచుకున్న యువత
శిక్షణార్థులు సాధించిన విజయాలను అభినందిస్తూ.. వారి అంకితభావాన్ని ప్రశంసించిన శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
16 OCT 2025 1:44PM by PIB Hyderabad
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కర్ణాటకలోని హంపిలో 2025 అక్టోబర్ 15న ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) శిక్షణార్థులతో ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తన్న 60 మందితో పాటు.. ఇన్ఫోసిస్, ఎంఎస్పీఎల్, ఐబీఎం, టీసీఎస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్, హెచ్ఏఎల్, ఎన్ఎండీసీ, హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ తదితర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పీఎంఐఎస్ ద్వారా ఇంటర్నులు సాధించిన అనుభవాన్ని, వారి ఆకాంక్షలను మంత్రి తెలుసుకున్నారు. ఈ పథకంలో వారు చేరడానికి ఎలా స్ఫూర్తి పొందారో తెలుసుకోవడంతో పాటు.. ఇంటర్న్‌షిప్పులో నేర్చుకున్న అంశాలను, మెరుగుపరుచుకున్న నైపుణ్యాల గురించి చర్చించారు. వారి వృత్తి జీవితానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించి ప్రోత్సహించారు.
ఇంటర్న్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని ఆయా సంస్థలు ఇప్పటికే పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకున్నాయి. వారికి మంత్రి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పని ప్రదేశాల్లో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్న ఈ తరుణంలో వాటికి తగినట్టుగా మారాల్సిన ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. అంకితభావాన్ని ప్రశంసించారు. ‘‘ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలుసుకోవడం ఆనందదాయకం. పనికి సంబంధించిన ప్రధానాంశాలను తెలుసుకోవడం, కమ్యూనికేషన్ అడ్డంకులను అధిగమించడం లాంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు’’ అని మంత్రి అన్నారు.
పీఎంఐఎస్ ద్వారా యువత పరివర్తనకు సంబంధించిన అద్భుతమైన విజయగాథలను తెలియజెప్పే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన కాలువ హరికృష్ణ కథ. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఐటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న అనంతరం అదే సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా విధుల్లో చేరారు. అతడి తండ్రి రైతు. తల్లి గృహిణి. తన ప్రయాణాన్ని ‘‘నిజమైన పరివర్తన’’గా హరి వర్ణించారు. మంత్రి చేతుల మీదుగా ఆఫర్ లెటర్ తీసుకోవాలన్న కోరికను వ్యక్తం చేశారు. దానికి మంత్రి అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన మరో అభ్యర్థి ఆర్ లక్ష్మీ ప్రసన్న.. ఇన్ఫోసిస్‌లో చేరడం ద్వారా పీఎంఐఎస్ తనకు కొత్త అవకాశాలను ఎలా అందించిందో వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ తనకు ఆత్మవిశ్వాసాన్నివ్వడంతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని పరిచయం చేసిందని వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తెలియజేశారు.
అదే విధంగా.. హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎంబడెడ్ ఇంజనీర్ ఇంటర్న్‌గా చేరిన కేరళకు చెందిన గౌరి హెచ్ తన స్ఫూర్తిదాయక గాథను పంచుకున్నారు. సింగిల్ పేరెంట్ అయిన ఆమెకు ఓ కూతురు ఉన్నారు. చదువులో ప్రతిభ కనబరిచినప్పటికీ తాను ఎంచుకున్న రంగంలో పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని, తాను కలలు కన్న కెరీర్‌లో అడుగు పెట్టేందుకు పీఎంఐఎస్ దోహదపడిందని ఆమె తెలియజేశారు. ఆమె ప్రయాణాన్ని మంత్రి కొనియాడుతూ.. ‘‘గౌరి సానుకూల దృక్పథం, పట్టుదల నన్ను ఆకట్టుకున్నాయి. పీఎంఐఎస్ వెనుక ఉన్న నిజమైన సంకల్పాన్ని, స్ఫూర్తిని రూపొందించింది ఆమె లాంటి కథలే’’ అని తెలియజేశారు.
పెరుగుతున్న పీఎంఐఎస్ ప్రభావం, వికసిత్ భారత్ 2047 దిశగా భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని తయారుచేయాలనే ప్రభుత్వం అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం గురించి
అయిదేళ్ల కాల వ్యవధిలో భారతీయ యువతకు ఉపాధిని, నైపుణ్యాలను, ఇతర అవకాశాలను అందించేందుకు ప్రధానమంత్రి ప్రారంభించిన అయిదు పథకాల ప్యాకేజీలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) ఓ భాగం. పూర్తి స్థాయి విద్య లేదా ఉపాధి కార్యక్రమంలో భాగం కాని 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతను పీఎంఐఎస్ లక్ష్యంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సంస్థల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది. వచ్చే అయిదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్పులు అందించాలని, భారతీయ యువతకు ఉద్యోగావకాశాలు విస్తరించాలనేదే ఈ పథకం లక్ష్యం. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన ప్రయోగదశ కొనసాగుతోంది. ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం https://pminternship.mca.gov.in/ సందర్శించండి.
***
(Release ID: 2179927)
Visitor Counter : 7