రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రారంభించిన రెండు నెలల్లోనే 25 లక్షల సంఖ్యను దాటిన ఫాస్టాగ్ వార్షిక పాసులు
Posted On:
15 OCT 2025 4:30PM by PIB Hyderabad
‘ప్రయాణ సౌలభ్యాన్ని’ మెరుగుపరచడంలో భాగంగా ఫాస్టాగ్ యేడాది కాలానికి ఇచ్చే పాసులకు జాతీయ రహదారి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగా గత రెండు నెలల్లో దాదాపు 5.67 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ పాస్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 25 లక్షల సంఖ్యను దాటింది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్.. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల్లో వర్తిస్తుంది. ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ద్వారా ప్రయాణికులు తరచూ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రూ. 3,000 చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం గడువు లేదా 200 టోల్ ప్లాజాల ప్రయాణాల వరకు ఉపకరిస్తుంది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ కలిగిన అన్ని వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ లేదా ఎన్ హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా ఒకేసారి రుసుము చెల్లించాలి. డబ్బులు కట్టిన తర్వాత వాహనానికి అనుసంధానమైన ఫాస్టాగ్... రెండు గంటల్లోనే అమల్లోకి వస్తుంది.
ఫాస్టాగ్ వార్షిక పాసును ఇతరులకు బదిలీ చేయడానికి ఉండదు. ఒక వాహనానికి అనుసంధానమైన ఫాస్టాగ్ పైనే వర్తిస్తుంది. ఇది జాతీయ రహదారి, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారుల వద్ద మాత్రం టోల్, పార్కింగ్ చెల్లింపులకు ఫాస్టాగ్ ప్రస్తుత వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు జాతీయ రహదారి ప్రయాణికుల నుంచి లభించిన అద్భుత స్పందన.. దేశవ్యాప్తంగా సురక్షితమైన, సౌకర్యవంతమైన, నిరంతరాయమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలన్న ఎన్ హెచ్ఎఐ నిబద్ధతను మరోసారి చాటుతోంది.
***
(Release ID: 2179667)
Visitor Counter : 4