హోం మంత్రిత్వ శాఖ
గురుగ్రామ్‌లోని మానేసర్‌లో జరిగిన ఎన్ఎస్‌జీ 41వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
స్పెషల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ సెంటర్ క్యాంపస్‌కు శంకుస్థాపన
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్.. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ నిశ్చయం, ధైర్యం, వ్యూహాత్మక విధానంతో ఎన్ఎస్‌జీ సిబ్బంది చేసిన పోరాటంతో సత్ఫలితాలు
భారత భద్రతా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన వారి ఘనత
స్పెషల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉగ్రవాదంపై పోరాటం కోసం ప్రత్యేక కమాండోలకు అత్యాధునిక శిక్షణ
ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూ కేంద్రాలకు అదనంగా అయోధ్యలోనూ కొత్త ఎన్ఎస్‌జీ హబ్ ఏర్పాటు
అది సర్జికల్ స్ట్రైక్స్ అయినా.. వైమానిక దాడులైనా.. ఆపరేషన్ సిందూర్ అయినా.. ఆపరేషన్ మహాదేవ్ అయినా.. మన భద్రతా సంస్థలు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని గుర్తించి శిక్షిస్తాయని నిరూపించాయి
2019 తర్వాత యూఏపీఏ చట్టం, ఎన్ఐఏ చట్టం, పీఎమ్ఎల్ఏ చట్టాలకు సవరణలు... ఉగ్రవాద నిధులపై చర్యలు... పీఎఫ్ఐపై నిషేధం... ఎమ్ఏసీ, సీసీటీఎన్ఎస్, ఎన్ఏటీగ్రిడ్ ఏర్పాటు వంటి చర్యలతో ఉగ్రవాదానికి బలమైన దెబ్బలు తగిలాయి
మొదటిసారిగా మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అందించిన ఉగ్రవాద నిర్వచనంతో ఉగ్రవాదులు లొసుగులను అడ్డుపెట్టుకుని కోర్టుల నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది
Posted On:
14 OCT 2025 5:40PM by PIB Hyderabad
గురుగ్రామ్‌లోని మానేసర్‌లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) 41వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్ఎస్‌జీ క్యాంపస్‌లో స్పెషల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఎస్.ఓ.టీ.సీ.) నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఎస్‌జీ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ సర్వత్ర, సర్వోత్తమ, సురక్ష అనే మూడు సూత్రాలతో పాటు సమర్పణ, సాహసం, దేశభక్తి అనే సద్గుణాలతో ఎన్ఎస్‌జీ నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గణనీయ పోరాటం చేసిందన్నారు. మన భద్రత, ఉగ్రవాదంపై పోరాటం చాలా సురక్షితమైన చేతుల్లో ఉందని దేశంలోని ప్రతి పౌరుడు విశ్వసిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ఎస్‌జీ సిబ్బంది దృఢ నిశ్చయం, ధైర్యం, వ్యూహాత్మక విధానంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి మంచి ఫలితాలను అందించిన తీరు భారత భద్రతా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
స్పెషల్ ఆపరేషన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఎస్.ఓ.టీ.సీ.) ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన జరిగిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. రూ. 141 కోట్ల వ్యయంతో 8 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఈ కేంద్రం.. ఉగ్రవాదంపై పోరాడుతున్న ప్రత్యేక కమాండోలకు అత్యాధునిక శిక్షణను అందిస్తుందన్నారు. ఎన్ఎస్‌జీ సిబ్బందికి మాత్రమే కాకుండా దేశవ్యాప్త పోలీసు దళాల్లో ఏర్పాటు చేసిన యాంటీ-టెర్రర్ యూనిట్లకూ ఉగ్రవాదంపై పోరాటం కోసం వారిని సిద్ధం చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను ఎస్.ఓ.టీ.సీ.లు అందిస్తాయని శ్రీ అమిత్ షా తెలిపారు. భారత్ వంటి విశాలమైన దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేదనీ... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసు దళాల ప్రత్యేక విభాగాలు, ఎన్ఎస్‌జీలతో పాటు కేంద్ర సాయుధ పోలీసు దళాలన్నీ (సీఏపీఎఫ్‌లు) దేశ భద్రత కోసం కలిసి పనిచేయాలని శ్రీ అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ ఎస్.ఓ.టీ.సీ రాబోయే రోజుల్లో ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత శక్తిమంతం చేస్తూ.. మన దళాలను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంచుతుందని ఆయన అన్నారు.
1984 నుంచి ఎన్ఎస్‌జీ సర్వత్ర, సర్వోత్తమ, సురక్ష అనే మూడు సూత్రాలను అమలు చేస్తూ... ఆపరేషన్ అశ్వమేధ, ఆపరేషన్ వజ్ర శక్తి, ఆపరేషన్ ధంగు వంటి ఆపరేషన్స్ ద్వారా.. అలాగే అక్షరధామ్ దాడి, ముంబయి ఉగ్ర దాడుల సమయంలోనూ ధైర్యం, అసమాన సామర్థ్యంతో దేశాన్ని కాపాడిందని శ్రీ అమిత్ షా కొనియాడారు. ఎన్ఎస్‌జీ ధైర్యం, అంకితభావాలను చూసి యావత్ దేశం గర్విస్తుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్‌జీ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని శ్రీ అమిత్ షా ప్రకటించారు. ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, జమ్మూలలో ఇప్పటికే ఆరు ఎన్ఎస్‌జీ హబ్‌లు ఏర్పాటయ్యాయనీ.. ఇక్కడ ఎన్ఎస్‌జీ కమాండోలు సంవత్సరంలోని 365 రోజులూ 24 గంటలూ విధుల్లో ఉంటారని ఆయన తెలిపారు. అయోధ్యలో ఇప్పుడు కొత్త ఎన్ఎస్‌జీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ఈ హబ్‌లోని కమాండోలు తమ జోన్ పరిధిలో ఏదైనా ఆకస్మిక ఉగ్రదాడి జరిగితే బలమైన ప్రతిస్పందనను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా, అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర పోలీసు దళాలకు, ఉగ్రవాద నిరోధక విభాగాలకు శిక్షణనివ్వడం, అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడం, దళాల ఫిట్‌నెస్‌ను నిర్ధారించడంపై ఎన్ఎస్‌జీ ప్రధాన కార్యాలయం నిరంతరం దృష్టి సారిస్తోందని శ్రీ అమిత్ షా ఉద్ఘాటించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని ధృడమైన విధానాన్ని అవలంబిస్తోందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. 2019 నుంచి ఉగ్రవాద ముప్పుల నుంచి దేశాన్ని రక్షించడానికి తమ ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ).. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టాన్ని సవరించడంతో పాటు, ఉగ్రవాద గ్రూపులకు నిధులను అరికట్టడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ).. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లను క్రియాశీలం చేసిందనీ.. ఉగ్రవాద నిధులపై శాస్త్రీయ దర్యాప్తు కోసం ఒక వ్యవస్థనూ ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని నిషేధించడంతో పాటు మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎమ్ఏసీ)ని బలోపేతం చేసిందన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్-సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (ఎన్ఏటీగ్రిడ్) ద్వారా దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలతో డేటా షేరింగ్‌ను ప్రారంభించిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఉగ్రవాదులు లొసుగులను సాకుగా చూపి కోర్టుల నుంచి తప్పించుకునే సమస్యను పరిష్కరించడానికి మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో మొదటిసారిగా ఉగ్రవాదానికి సమగ్ర నిర్వచనం ఇచ్చిందన్నారు.
57 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదులుగా, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించామనీ, వారి కార్యకలాపాలనూ విజయవంతంగా నిరోధించామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యల ద్వారా మోదీ ప్రభుత్వం ఉగ్రవాద నెట్‌వర్క్‌ల మూలాలపై బలంగా దెబ్బకొట్టిందన్నారు. తీవ్రవాదులు ఏ మూలలో దాగున్నా మన భద్రతా సంస్థలు గుర్తించి.. శిక్షిస్తాయని నిరూపితమైందని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కోలేరు. భారత్‌లో దాడులకు ప్రణాళిక చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాన్నీ, వారి శిక్షణా శిబిరాలనూ, లాంచ్ ప్యాడ్‌లను ఆపరేషన్ సిందూర్ నాశనం చేసిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని ఆపరేషన్ మహాదేవ్ అంతం చేసిందనీ, తద్వారా మన భద్రతా దళాలపై దేశానికి మరింత నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఎన్ఎస్‌జీ సిబ్బంది దేశవ్యాప్తంగా 770కి పైగా కీలక ప్రదేశాల్లో నిఘా నిర్వహించారనీ.. సంభావ్య ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రణాళికలతో కూడిన డేటా బ్యాంక్‌ను రూపొందించారని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలు, ఇతర ముఖ్యమైన సంస్థలు, జలమార్గాలు, భారత పార్లమెంటు భద్రత కోసం ఎన్ఎస్‌జీ చాలా జాగ్రత్తగా చక్కని ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. మహాకుంభ్ అయినా.. పూరీ రథయాత్ర అయినా.. ఏదైనా మతపరమైన కార్యక్రమం అయినా.. ఎన్ఎస్‌జీ ధైర్యం, అంకితభావం, భద్రతకు చిహ్నంగా మారిందని శ్రీ అమిత్ షా ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్‌జీని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సన్నద్ధం చేయడమే కాకుండా దాని కార్యకలాపాల్లోనూ గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని ఆయన తెలిపారు. రాబోయే అనేక సంవత్సరాలు ఎన్ఎస్‌జీ తన నాలుగు దశాబ్దాల ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టుకుంటుందని శ్రీ అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
2019 నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్‌ల) సిబ్బంది చెట్ల పెంపకం ప్రచారంలో భాగంగా 6.5 కోట్లకు పైగా మొక్కలను నాటారనీ, దేశ పచ్చదనాన్ని కాపాడటానికీ గణనీయ తోడ్పాటునందించారని శ్రీ అమిత్ షా తెలిపారు. సీఏపీఎఫ్ సిబ్బంది ఈ మొక్కలను తమ సొంత పిల్లల్లాగే పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.
***
(Release ID: 2179333)
Visitor Counter : 5