కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్ నుంచి అమెరికాకు అక్టోబర్ 15 నుంచి అంతర్జాతీయ పోస్టల్ సేవల పునరుద్ధరణ
Posted On:
14 OCT 2025 4:27PM by PIB Hyderabad
అమెరికాకు అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను 15 అక్టోబర్ 2025 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోస్టల్ విభాగం ప్రకటించింది.
అన్ని రకాల పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14324 కు అనుగుణంగా భారత్ 22 ఆగస్టు 2025 న ఆఫీస్ మెమోరాండం ద్వారా అమెరికాకు తపాలా సేవలను నిలిపివేసింది. దిగుమతి సుంకాల వసూలు, చెల్లింపు కోసం అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రవేశపెట్టిన కొత్త నియంత్రణ నిబంధనల కారణంగా ఈ నిలిపివేత అవసరమైంది.
విస్తృతమైన వ్యవస్థ అభివృద్ధి, సీబీపీ ఆమోదం ఉన్న అర్హత కలిగిన సంస్థలతో సమన్వయం, ఢిల్లీ, మహారాష్ట్ర సర్కిళ్ళలో విజయవంతమైన ప్రయోగాత్మక పరీక్షల తరువాత ఇండియా పోస్ట్ ఇప్పుడు డెలివరీ డ్యూటీ పెయిడ్ (డీడీపీ) ప్రాసెసింగ్ కోసం నియమాలకు అనుగుణమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కొత్త ఏర్పాటు ప్రకారం, అమెరికాకు పంపే వాటికి వర్తించే అన్ని కస్టమ్స్ సుంకాలను బుకింగ్ సమయంలో భారతదేశంలో ముందస్తుగా వసూలు చేస్తారు. ఆమోదం ఉన్న అర్హత కలిగిన సంస్థల ద్వారా నేరుగా సీబీపీకి పంపుతారు. దీనివల్ల అన్ని నియంత్రణ నిబంధనలకు పూర్తి కట్టుబాటుతో పాటు వేగంగా కస్టమ్స్ అనుమతి, అమెరికాలోని చిరునామాదారులకు ఎటువంటి అదనపు సుంకం లేదా ఆలస్యం లేకుండా నిరంతర సరఫరా సాధ్యమవుతుంది.
సీబీపీ మార్గదర్శకాల ప్రకారం, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ - ఐఈఈపీఏ) పరిధిలో భారత్ నుంచి అమెరికాకు పంపే తపాలా వస్తువులపై ప్రకటించిన ఎఫ్ఓబీ విలువలో 50% ఫ్లాట్ రేటుతో కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది. కొరియర్ లేదా వాణిజ్యపరమైన సరుకుల మాదిరిగా పోస్టల్ వస్తువులపై ఎటువంటి అదనపు ప్రాథమిక సుంకాలు లేదా ఉత్పత్తి సంబంధ సుంకాలు ఉండవు. అనుకూలమైన ఈ సుంకం విధానం ఎగుమతిదారులకు అయ్యే మొత్తం ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు), హస్త కళాకారులు, చిన్న వ్యాపారులు, ఇ-కామర్స్ ఎగుమతిదారులకు పోస్టల్ రవాణా విధానం మరింత తక్కువ ఖర్చుతో కూడిన, పోటీదాయకమైన సరకు రవాణా మార్గంగా మారుతుంది.
ముఖ్యంగా, డెలివరీ డ్యూటీ పెయిడ్ (డీడీపీ), అర్హత కలిగిన సంస్థల సేవల కోసం తపాలా శాఖ వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుములను విధించదు. పోస్టల్ టారిఫ్‌లు యథాతథంగా కొనసాగుతాయి. దీనివల్ల ఎగుమతిదారులు సవరించిన యూఎస్ దిగుమతి నిబంధనలను అనుసరిస్తూనే తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ డెలివరీ రేట్ల ప్రయోజనాన్ని కొనసాగించగలరు. ధరను అందుబాటులో ఉంచడానికి, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి, పోస్టల్ ద్వారా భారత ఎగుమతులను పెంచడానికి ఈ చర్య తీసుకున్నారు.
ఇప్పుడు వినియోగదారులు అమెరికాకు పంపడానికి అన్ని రకాల అంతర్జాతీయ తపాలా మెయిల్స్ - ఈఎంఎస్, ఎయిర్ పార్సెల్, రిజిస్టర్డ్ లెటర్స్/ప్యాకెట్లు, ట్రాక్డ్ ప్యాకెట్లను - ఏదైనా పోస్టాఫీస్, ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ (ఐబీసీ), డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రం (డీఎన్కే) లేదా www.indiapost.gov.in లోని సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
డెలివరీ డ్యూటీ పెయిడ్ విధానం వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తుంది. పన్ను వసూలులో పూర్తి పారదర్శకతను తీసుకొస్తుంది. ఇప్పుడు అమెరికాకు పోస్టు పంపేవారు వర్తించే అన్ని సుంకాలను భారత్ లో ముందస్తుగా చెల్లించవచ్చు. దీనివల్ల మొత్తం రవాణా ఖర్చులు ముందుగానే తెలుసుకునే అవకాశం లభించడంతో పాటు విదేశాల్లో వాటిని అందుకునే వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
అంతర్జాతీయ ఎగుమతులను సులభతరం చేయడానికి, మేక్ ఇన్ ఇండియా, ఒక జిల్లా - ఒక ఉత్పత్తి, డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలు వంటి భారతదేశ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో, నమ్మదగిన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన రవాణా సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ కట్టుబడి ఉంది. పోస్టల్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతిదారులు, చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సర్కిళ్ల అధిపతులను ఇండియా పోస్ట్ కోరింది.
అమెరికాకు సేవల పునఃప్రారంభం భారత అంతర్జాతీయ తపాలా, ఎగుమతి రవాణా వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన చర్యగా నిలుస్తుంది. సమ్మిళిత, ఎగుమతి ఆధారిత ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ దృక్పథానికి మద్దతు ఇవ్వడంలో పెరుగుతున్న ఇండియా పోస్ట్ పాత్రను ఈ చర్య ప్రతిబింబిస్తుంది.
***
(Release ID: 2179105)
Visitor Counter : 11