ప్రధాన మంత్రి కార్యాలయం
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
ముంబయిలో ప్రయాణాన్ని- అనుసంధానతను మార్చనున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం, భూగర్భ మెట్రో ప్రాజెక్టులు
వికసిత్ భారత్ అంటే.. వేగవంతమైన పురోగతి.. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం.. పౌరుల జీవితాలను సులభతరం చేసే ప్రభుత్వ పథకాలు..
గత దశాబ్ద కాలంలో లక్షలాది మంది ప్రజల తొలి విమాన ప్రయాణ కలను నెరవేర్చిన ఉడాన్ యోజనకు ధన్యవాదాలు
విమాన ప్రయాణాన్ని సులభతరం చేసిన కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ యోజన
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా నిలిచిన భారత్
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్
మన యువశక్తే మన బలం
మన దేశం.. పౌరుల భద్రత, రక్షణ కంటే మరేదీ మనకు ముఖ్యం కాదు: ప్రధానమంత్రి
Posted On:
08 OCT 2025 5:44PM by PIB Hyderabad
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మహారాష్ట్రలోని ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులనూ ప్రారంభించిన ఆయన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి హజారైన ప్రముఖులందరినీ స్వాగతిస్తూ.. వారందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన విజయదశమి, కోజాగరి పూర్ణిమ వేడుకలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాబోయే దీపావళి పండగ సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ముంబయి నగరం ఇప్పుడు తన రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొందిందనీ.. ఈ ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద కనెక్టివిటీ కేంద్రాల్లో ఒకటిగా నిలవడంలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ముంబయికి ఇప్పుడు పూర్తిస్థాయి భూగర్భ మెట్రో కూడా అందుబాటులోకి వచ్చిందన్న శ్రీ మోదీ.. ఇది ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందనీ, ప్రయాణికుల సమయాన్నీ ఆదా చేస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ కోసం ప్రత్యక్ష నిదర్శనంగా భూగర్భ మెట్రోను అభివర్ణించారు. ముంబయి వంటి సందడిగా ఉండే నగరంలో చరిత్రాత్మక భవనాలను సంరక్షిస్తూ భూగర్భంలో ఈ అద్భుతమైన మెట్రోను నిర్మించారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న కార్మికులూ, ఇంజనీర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
దేశం యువతకు లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించిన రూ. 60,000 కోట్ల ‘పీఎం సేతు’ పథకాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వందలాది ఐటీఐలు, సాంకేతిక పాఠశాలల్లో నేటి నుంచి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు డ్రోన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో శిక్షణ పొందుతారని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మహారాష్ట్ర ముద్దుబిడ్డ, జననేత శ్రీ డీ.బీ. పాటిల్.. సమాజం, రైతుల పట్ల అంకితభావంతో చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ శ్రీ మోదీ ఆయనకు నివాళులర్పించారు. శ్రీ పాటిల్ సేవానిరతి అందరికీ స్ఫూర్తిదాయకమనీ, ప్రజా జీవితంలో పనిచేసే వారికి ఆయన జీవితం నిరంతరం మార్గదర్శనం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
"ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ... పౌరుల జీవితాలను సులభతరం చేసే ప్రభుత్వ పథకాల ద్వారా వేగవంతమైన పురోగతితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఈ రోజు యావత్ భారతం కట్టుబడి ఉంది" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. గత పదకొండు సంవత్సరాలుగా ఈ స్ఫూర్తి దేశంలోని ప్రతి మూలలో అభివృద్ధి ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేసిందని ఆయన తెలిపారు. వందే భారత్ సెమీ హై-స్పీడ్ రైళ్లు పట్టాలపై పరిగెత్తినప్పుడు.. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఊపందుకున్నప్పుడు.. విశాలమైన హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు కొత్త నగరాలను అనుసంధానించినప్పుడు.. పర్వతాల గుండా పొడవైన సొరంగ మార్గాలు సిద్ధమైనప్పుడు.. ఎత్తయిన సముద్ర వంతెనలు సుదూర తీరాలను కలిపినప్పుడు.. భారత వేగం, పురోగతీ అందరికీ కనిపిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అటువంటి పురోగతులు భారత యువత ఆకాంక్షలకు కొత్త రెక్కలను జోడిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
భారత అభివృద్ధి ప్రయాణంలో ఊపును నేటి కార్యక్రమం కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతను ప్రతిబింబించే ప్రాజెక్టుగా ఆయన అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నిర్మించిన ఈ విమానాశ్రయం సంస్కృతి-శ్రేయస్సులను సూచించే తామర పువ్వు ఆకారంలో ఉందన్నారు. ఈ కొత్త విమానాశ్రయం మహారాష్ట్ర రైతులను యూరప్, మధ్యప్రాచ్యంలోని శక్తిమంతమైన మార్కెట్లతో అనుసంధానిస్తుందనీ.. తాజా ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు త్వరగా చేరుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సమీపంలోని చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఎగుమతి ఖర్చులనూ ఈ విమానాశ్రయం తగ్గిస్తుందన్నారు. దీని ద్వారా పెట్టుబడులు పెరుగుతాయనీ, కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుకూ ఇది దారితీస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కొత్త విమానాశ్రయం కోసం మహారాష్ట్ర-ముంబయి ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పం... పౌరులకు వేగవంతమైన అభివృద్ధిని అందించాలనే దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఫలితాలు అనివార్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విమానయాన రంగం ఈ పురోగతికి ప్రధాన నిదర్శనంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన తొలి ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న శ్రీ మోదీ.. హవాయి చెప్పులు ధరించిన వారు కూడా విమానంలో ప్రయాణించగలగాలనే తన దార్శనికతను పునరుద్ఘాటించారు. ఈ కలను సాకారం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాలను నిర్మించడం చాలా అవసరం.. ఈ లక్ష్యాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా పరిగణించిన మా ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక కొత్త విమానాశ్రయాలు నిర్మించిందన్నారు. 2014లో దేశంలోని విమానాశ్రయాలు కేవలం 74 మాత్రమే ఉండగా.. వాటి సంఖ్య ప్రస్తుతం 160 దాటిందని శ్రీ మోదీ తెలిపారు.
చిన్న నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం వల్ల నివాసితులకు విమాన ప్రయాణం కోసం కొత్త ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సామాన్య పౌరులకు విమాన టిక్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. గత దశాబ్దంలో లక్షలాది మంది ఈ పథకం ద్వారా మొదటిసారి విమానంలో ప్రయాణించడం ద్వారా తమ చిరకాల కలను నెరవేర్చుకున్నారని ఆయన తెలిపారు.
కొత్త విమానాశ్రయాల నిర్మాణం, ఉడాన్ పథకం పౌరులకు సౌకర్యాన్ని అందించాయని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా నిలిచిందన్నారు. భారతీయ విమానయాన సంస్థలు నిరంతరం విస్తరిస్తున్న క్రమంలో వందలాది కొత్త విమానాలకు ఆర్డర్లు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వృద్ధితో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజనీర్లు, గ్రౌండ్ వర్కర్లకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
విమానాల సంఖ్య పెరిగేకొద్దీ నిర్వహణ, మరమ్మత్తు పనులకూ డిమాండ్ పెరుగుతుందన్న ప్రధానమంత్రి.. ఈ అవసరాన్ని తీర్చడానికి భారత్ దేశీయంగా కొత్త సౌకర్యాలను అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి దేశాన్ని ఒక ప్రధాన ఎమ్ఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర పరిశీలన) కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధ్రువీకరించారు. ఈ కార్యక్రమం దేశ యువతకు అనేక కొత్త ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
"ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ నిలిచింది.. మన బలం మన యువతలోనే ఉంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ప్రభుత్వ పథకం యువతకు గరిష్ట ఉపాధి అవకాశాలను అందించడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో పెరిగిన పెట్టుబడులు ఉద్యోగాల సృష్టికి దారితీస్తున్నాయనీ.. రూ. 76,000 కోట్ల వధావన్ పోర్ట్ ప్రాజెక్టును దీనికి ఉదాహరణగా శ్రీ మోదీ ఉటంకించారు. వాణిజ్యం విస్తరించినప్పుడు.. సరుకుల రవాణా రంగం ఊపందుకున్నప్పుడు.. ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
జాతీయ విధానాన్ని రాజకీయాలకు ప్రాతిపదికగా భావించే విలువలతో భారత్ పురోగమిస్తోందని శ్రీ మోదీ ధ్రువీకరించారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు చేసే ప్రతి రూపాయి పౌరుల సౌలభ్యం, సామర్థ్యాన్ని పెంపొందించే సాధనంగా తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కంటే అధికారానికి ప్రాధాన్యమిచ్చే దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు ఇది విరుద్ధమన్నారు. అటువంటి వ్యక్తులు అభివృద్ధి పనులను అడ్డుకుంటారనీ.. కుంభకోణాలు-అవినీతి ద్వారా ప్రాజెక్టులను పట్టాలు తప్పిస్తారని.. దేశం అనేక దశాబ్దాలు ఇటువంటి దుష్పరిపాలననే చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈరోజు ప్రారంభమైన మెట్రో లైన్ గత ప్రభుత్వాల చర్యలను గుర్తుచేస్తుందన్న శ్రీ మోదీ.. ముంబయిలోని లక్షలాది కుటుంబాల ప్రయాణ కష్టాలను తగ్గిస్తుందనే ఆశను ఇది ప్రజల్లో కలిగించిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల దేశానికీ వేల కోట్ల నష్టం వాటిల్లిందని.. అనేక సంవత్సరాలుగా ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మెట్రో లైన్ పూర్తవడంతో రెండు నుంచి రెండున్నర గంటల ప్రయాణం ఇప్పుడు కేవలం 30 నుంచి 40 నిమిషాలకు తగ్గిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రతి నిమిషం ముఖ్యమైనదిగా భావించే ముంబయి వంటి నగరంలో పౌరులు మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా ఈ సౌకర్యాన్ని కోల్పోయారనీ, ఇది వారికి జరిగిన తీవ్రమైన అన్యాయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
"గత పదకొండు సంవత్సరాలుగా ప్రభుత్వం పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది" అని ప్రధానమంత్రి అన్నారు, రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, మెట్రోలు, ఎలక్ట్రిక్ బస్సులు వంటి సౌకర్యాల్లో అపూర్వమైన పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. అటల్ సేతు, కోస్టల్ రోడ్ వంటి ప్రాజెక్టులను ఈ అభివృద్ధికి ఉదాహరణలుగా ఆయన ఉటంకించారు.
ప్రయాణికులు నానా కష్టాలు పడుతూ ప్రయాణ మాధ్యమాలను మార్చాల్సిన ఇబ్బందులను తొలగించి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం అన్ని రవాణా మార్గాలను ఏకీకృతం చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. ‘వన్ నేషన్-వన్ మొబిలిటీ’ దార్శనికత సాకారం దిశగా భారత్ పురోగమిస్తోందని ఆయన ధ్రువీకరించారు. ముంబయి వన్ యాప్ ఈ దిశలో మరో కీలక ముందడుగనీ.. ప్రజలు టిక్కెట్ల కోసం పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బందిని దీనితో నివారించవచ్చని అన్నారు. ఈ యాప్ ద్వారా స్థానిక రైళ్లు, బస్సులు, మెట్రోలు, టాక్సీల్లోనూ ఒకే టికెట్‌ను ఉపయోగించవచ్చని ప్రధానమంత్రి తెలిపారు.
భారత ఆర్థిక రాజధాని.. అత్యంత శక్తిమంతమైన నగరాల్లో ఒకటి అయిన ముంబయిని 2008 దాడుల్లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలహీనత సందేశాన్ని పంపిందనీ.. ఉగ్రవాదం ముందు లొంగిపోయినట్లు కనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబయి ఉగ్రదాడుల తర్వాత భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌పై దాడి చేయడానికి సిద్ధమైనట్లు ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి ఇటీవల వెల్లడించిన విషయాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. దేశం మొత్తం అలాంటి చర్యకు మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విదేశీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఆ సమయంలో సైనిక ప్రతిస్పందనను నిలిపివేసిందని ప్రతిపక్ష నాయకుడు చెబుతున్నారనీ.. ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేశారో ప్రతిపక్ష పార్టీ స్పష్టం చేయాలని ప్రధానమంత్రి డిమాండ్ చేశారు. వారి ఈ నిర్ణయం ముంబయి ప్రజల, దేశ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ బలహీనత ఉగ్రవాదులకు ధైర్యం ఇచ్చిందనీ.. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేలా చేసిందని.. దాని వల్ల దేశంలోని అమాయకుల ప్రాణాలు బలయ్యాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
"దేశం, ప్రజల భద్రత కంటే మా ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదు" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ పూర్తి శక్తితో స్పందిస్తూ శత్రు భూభాగంపై ప్రతిదాడి చేస్తుందనీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతటికీ ఇది ప్రత్యక్షంగా తెలిసిందన్నారు.
పేదలు, నవ-మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాలకు సాధికారత కల్పించడం జాతీయ ప్రాధాన్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ కుటుంబాలు సౌకర్యాలను, గౌరవాన్నీ పొందినప్పుడు.. వారి సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. పౌరుల సమష్టి బలం దేశాన్ని బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీలో చేపట్టిన ఇటీవలి తదుపరి తరం సంస్కరణలు అనేక వస్తువులను మరింత సరసమైనవిగా చేశాయనీ, ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచాయని ఆయన తెలిపారు. మార్కెట్ డేటాను ఉటంకిస్తూ.. ఈ నవరాత్రి సీజన్ అనేక సంవత్సరాల అమ్మకాల రికార్డులనూ బద్దలు కొట్టిందని, రికార్డు సంఖ్యలో స్కూటర్లు, బైక్‌లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లను ప్రజలు కొనుగోలు చేశారని ఆయన అన్నారు.
పౌరుల జీవితాలను మెరుగుపరిచే, దేశాన్ని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని ధ్రువీకరిస్తూ.. ప్రతి ఒక్కరూ స్వదేశీని స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, మార్కెట్‌లో స్వదేశీ మంత్రం ప్రతిధ్వనించాలన్న శ్రీ మోదీ.. "ఇది స్వదేశీ" అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పాలని కోరారు. ప్రతి పౌరుడు స్వదేశీ దుస్తులు, పాదరక్షలనే కొని.. స్వదేశీ ఉత్పత్తులను ఇంటికి తీసుకువచ్చి.. స్వదేశీ వస్తువులే కానుకగా ఇచ్చినప్పుడు మన దేశ సంపద మన దేశంలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది భారతీయ కార్మికులకు ఉపాధిని సృష్టిస్తుంది.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. మొత్తం దేశం స్వదేశీ మంత్రాన్ని స్వీకరించినప్పుడు దేశం ఎంత గొప్ప శక్తిని పొందుతుందో ఊహించుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు.
దేశ అభివృద్ధిని వేగవంతం చేయడంలో మహారాష్ట్ర ఎల్లప్పుడూ ముందంజలో ఉందని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. మహారాష్ట్రలోని ప్రతి పట్టణం, గ్రామాల సామర్థ్యాలను పెంపొందించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటాయని ఆయన ధ్రువీకరించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా అందరికీ తన అభినందనలూ, శుభాకాంక్షలు తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు శ్రీ రామ్‌దాస్ అథవాలే, శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు, శ్రీ మురళీధర్ మొహోల్, భారతదేశంలో జపాన్ రాయబారి శ్రీ కెయిచి ఓనో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చాలనే తన దార్శనికతకు అనుగుణంగా దాదాపు రూ. 19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎమ్ఐఏ) మొదటి దశను ప్రధానమంత్రి ప్రారంభించారు.
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్. దీనిని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేశారు. ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న ఎన్ఎమ్ఐఏ.. రద్దీని తగ్గించడానికి, ముంబయిని ప్రపంచ బహుళ-విమానాశ్రయ వ్యవస్థల లీగ్‌లోకి తీసుకురావడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎమ్ఐఏ)తో కలిసి పనిచేస్తుంది. 1160 హెక్టార్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన విమానాశ్రయాల్లో ఒకటిగా రూపొందించిన ఈ విమానాశ్రయం సంవత్సరానికి 90 మిలియన్ల ప్రయాణీకులను (ఎమ్‌పీపీఏ), 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేయనుంది.
దాని ప్రత్యేకతల్లో ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (ఏపీఎమ్) ఒకటి. నాలుగు ప్యాసింజర్ టెర్మినల్స్‌ను సజావుగా ఇంటర్-టెర్మినల్ బదిలీల కోసం అనుసంధానించేలా ప్రణాళిక చేసిన ఒక రవాణా వ్యవస్థ.. నగరం వైపు మౌలిక సదుపాయాలను అనుసంధానించే ల్యాండ్‌సైడ్ ఏపీఎమ్ దీనిలో భాగంగా ఉన్నాయి. సుస్థిర విధానాలను అనుసరిస్తూ, విమానాశ్రయంలో సుస్థిర ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) కోసం ప్రత్యేక నిల్వ, సుమారు 47 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి, నగరం అంతటా పబ్లిక్ కనెక్టివిటీ కోసం ఈవీ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలో వాటర్ టాక్సీ ద్వారా అనుసంధానించిన మొదటి విమానాశ్రయంగా కూడా ఎన్ఎమ్ఐఏ గుర్తింపు సాధించింది.
ఆచార్య ఆత్రే చౌక్ నుంచి కఫే పరేడ్ వరకు విస్తరించిన ముంబయి మెట్రో లైన్-3 ఫేజ్ 2బీని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ మార్గాన్ని దాదాపు రూ. 12,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. దీనితో కలిపి మొత్తం రూ. 37,270 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ముంబయి మెట్రో లైన్ 3 (ఆక్వా లైన్) మొత్తాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఇది నగరంలోని రవాణా పరివర్తనలో ఒక కీలక ముందడుగుగా నిలుస్తుంది.
ముంబయిలోని మొట్టమొదటి, ఏకైక పూర్తిస్థాయి భూగర్భ మెట్రో లైన్‌గా ఈ ప్రాజెక్ట్ ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎమ్ఎమ్ఆర్) అంతటా రాకపోకలను సులభతరం చేస్తుంది. లక్షలాది మంది నగరవాసులకు వేగవంతమైన, మరింత సమర్థమైన, ఆధునిక రవాణా పరిష్కారాన్ని అందిస్తుంది.
కఫే పరేడ్ నుంచి ఆరే జేవీఎల్ఆర్ వరకు 33.5 కిలోమీటర్ల పొడవునా 27 స్టేషన్లతో విస్తరించిన ముంబయి మెట్రో లైన్–3 రోజుకు 13 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ చివరి దశ 2బీ దక్షిణ ముంబయిలోని వారసత్వ, సాంస్కృతిక జిల్లాలైన ఫోర్ట్, కాలా ఘోడా, మెరైన్ డ్రైవ్‌లకు సమర్థమైన కనెక్టివిటీని అందిస్తుంది. బాంబే హైకోర్టు, మంత్రాలయ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్ఈ), నారీమన్ పాయింట్ వంటి కీలకమైన పరిపాలన, ఆర్థిక కేంద్రాలకు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది.
రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర మెట్రో లైన్లు, మోనోరైల్ సేవలు సహా ఇతర రవాణా మార్గాలతో సమర్థమైన ఏకీకరణను నిర్ధారించేలా మెట్రో లైన్-3ని రూపొందించారు. దీని ద్వారా అన్ని ప్రాంతాలకూ కనెక్టివిటీని మెరుగవుతుంది.. మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా రద్దీని ఇది తగ్గిస్తుంది.
మెట్రో, మోనోరైలు, సబర్బన్ రైల్వేలు, బస్ పీటీఓలలోని 11 ప్రజా రవాణా ఆపరేటర్ల (పీటీఓల) కోసం "ముంబయి వన్" పేరుతో ఇంటిగ్రేటెడ్ కామన్ మొబిలిటీ యాప్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వీటిలో ముంబయి మెట్రో లైన్ 2ఏ & 7, ముంబయి మెట్రో లైన్ 3, ముంబయి మెట్రో లైన్ 1, ముంబయి మోనోరైలు, నవీ ముంబయి మెట్రో, ముంబయి సబర్బన్ రైల్వే, బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్), థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్, మీరా భయాందర్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్, కళ్యాన్ డోంబివలి మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్, నవీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయి.
ముంబయి వన్ యాప్ ప్రయాణికులకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బహుళ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లలో ఇంటిగ్రేటెడ్ మొబైల్ టికెటింగ్, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా క్యూలో నిలబడే పద్ధతిని పూర్తిగా తొలగించడం, బహుళ రవాణా మోడ్‌లను కలిగి ఉన్న ప్రయాణాలకు ఒకే డైనమిక్ టికెట్ ద్వారా సజావుగా మల్టీమోడల్ కనెక్టివిటీ అందించడం దీనిలో భాగంగా ఉన్నాయి. ఇది ఆలస్యం, ప్రత్యామ్నాయ మార్గాలు, చేరుకునే అంచనా సమయాలపై ఎప్పటికప్పుడు ప్రయాణ నవీకరణలను, సమీపంలోని స్టేషన్లు, ఆకర్షణలు, ఆసక్తికర ప్రదేశాలపై మ్యాప్ ఆధారిత సమాచారాన్ని, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఎస్ఓఎస్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. ఈ లక్షణాలన్నీ కలిసి, ప్రయాణికుల సౌలభ్యం, సామర్థ్యం, భద్రతను మెరుగుపరుస్తాయి. ముంబయి అంతటా ప్రజా రవాణా అనుభవాన్ని అద్భుతంగా మారుస్తాయి.
మహారాష్ట్రలో నైపుణ్యం, ఉపాధి, ఔత్సాహిక పరిశ్రమల స్థాపన, ఆవిష్కరణల ద్వారా యువతకు మార్గదర్శనం చేసే కార్యక్రమం అయిన స్వల్పకాలిక ఉపాధి కల్పన కార్యక్రమం (స్టెప్)ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 400 ప్రభుత్వ ఐటీఐలు, 150 ప్రభుత్వ సాంకేతిక ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తారు. ఇది ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిని సమలేఖనం చేయడంలో ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తుంది. 2,500 కొత్త శిక్షణా బ్యాచులను స్టెప్ ఏర్పాటు చేస్తుంది. వీటిలో మహిళల కోసం 364 ప్రత్యేక బ్యాచులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), సోలార్, డిజిటల్ విధానంలో తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కోర్సుల కోసం 408 బ్యాచులు ఉన్నాయి.
***
(Release ID: 2176609)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam