వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
యూపీఎస్సీ 2022 ఫలితాల విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటనను ఇచ్చినందుకు దృష్టి ఐఏఎస్‍కు రూ. 5 లక్షల జరిమానా విధించిన కేంద్ర వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ)
Posted On:
03 OCT 2025 11:08AM by PIB Hyderabad
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) 2022 ఫలితాల విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటన ఇచ్చినందుకు దృష్టి ఐఏఎస్‌కు (వీడీకే ఎడ్యువెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్) కేంద్ర వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) 5 లక్షల జరిమానా విధించింది.
దృష్టి ఐఏఎస్ ఒక ప్రకటనలో ‘యూపీఎస్సీ సీఎస్ఈ-2022లో 216 కంటే ఎక్కువ అభ్యర్థులు ఎంపిక" అని పేర్కొంటూ.. ఫోటోలతో పాటుగా అభ్యర్థుల పేర్లను పొందుపరిచింది.
అయితే సీసీపీఏ పరిశీలనలో ఈ ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని తేలింది. అభ్యర్థులు తీసుకున్న కోర్సుల రకం, వ్యవధికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని దాచిపెట్టినట్లు గమనించింది.
దృష్టి ఐఏఎస్ పేర్కొన్న 216 మంది అభ్యర్థులలో 162 మంది (75 శాతం) యూపీఎస్సీ సీఎస్ఈ ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్షలను స్వతంత్రంగా రాసిన అనంతరం ఈ సంస్థ ఇచ్చే ఉచిత ఇంటర్వూ గైడెన్స్ ప్రోగ్రామ్ (ఐజీపీ) మాత్రమే తీసుకున్నారని దర్యాప్తులో తేలింది. 54 మంది విద్యార్థులు మాత్రమే ఐజీపీతో పాటుగా ఇతర కోర్సులను తీసుకున్నారు.
ఈ కీలక విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టటంతో అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలోని అన్ని దశలను దృష్టి ఐఏఎస్ ద్వారానే దాటారనే తప్పుడు నమ్మకాన్ని తల్లిదండ్రులు, అభ్యర్థులకు కల్పించింది. వినియోగదారుల రక్షణ చట్టం- 2019లోని సెక్షన్ 2(28) కింద ఇది తప్పుదారి పట్టించే ప్రకటన.
పదే పదే ఉల్లంఘనకు పాల్పడుతోన్న దృష్టి ఐఏఎస్: ఇలాంటి కారణంతో దృష్టి ఏఐఎస్‌కు జరిమానా విధించటం ఇది రెండోసారని సీసీపీఏ తెలిపింది. ఇంతకు ముందు సెప్టెంబర్ 2024లో ‘‘యూపీఎస్సీ సీఎస్ఈ 2021లో 150 కంటే ఎక్కువ అభ్యర్థులు ఎంపిక" అంటూ ఇచ్చిన తప్పుదారి పట్టించే ప్రకటన విషయంలో కూడా తుది ఆదేశాలను సీసీపీఏ ఇచ్చింది. 150 కంటే ఎక్కువ అభ్యర్థుల ఎంపిక అనే ప్రకటనను బలపరుస్తూ 161 మంది అభ్యర్థుల వివరాలను సమర్పించింది. ఈ 161 మంది అభ్యర్థులలో ఐజీపీలో 148 మంది, మెయిన్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఏడుగురు, జీఎస్ ఫౌండేషన్ కోర్సులో నలుగురు, ఆప్షనల్ కోర్సులో ఒక్కరు, మిగిలిన ఇంకొక్కరి వివరాలు అందించలేదని దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో రూ. 3 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ.. తప్పుదారి పట్టించే ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించింది.
ఇంతకుముందే జరిమానా విధిస్తూ హెచ్చరించినప్పటికీ 2022 పరీక్షా ఫలితాల విషయంలో కూడా దృష్టి ఐఏఎస్ మరోసారి పాత పద్ధతిలోనే ‘216 కంటే ఎక్కువ అభ్యర్థుల ఎంపిక" అంటూ సంఖ్యను పెంచింది. ఈ విధంగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది.
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని సెక్షన్ 2(9) ప్రకారం.. ముఖ్యమైన విషయాలను దాచిపెట్టటం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సమాచారంతో కూడిన ఎంపిక హక్కును కోల్పోతారు. ఇటువంటి ప్రకటనలు తప్పుడు అంచనాలను సృష్టిస్తాయి.. వినియోగదారుల నిర్ణయాలను అన్యాయంగా ప్రభావితం చేస్తాయి. వాస్తవాలను పారదర్శకంగా బహిర్గతం చేయకుండా పెద్ద పెద్ద ప్రకటనలు చేసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది.
ఇప్పటి వరకు సీసీపీఏ.. తప్పుదారి పట్టించే ప్రకటనలు, అసంబద్ధమైన వ్యాపార పద్ధతుల విషయంలో వివిధ కోచింగ్ సంస్థలకు 54 నోటీసులు జారీ చేసింది. 26 కోచింగ్ సంస్థలకు రూ. 90.6 లక్షలకు పైగా జరిమాన విధిస్తూ.. తప్పుదారి పట్టించే ప్రకటనలను నిలిపేయాలన్న ఆదేశాలను జారీ చేసింది. ఈ సంస్థలన్నీ ఆయా ప్రకటనల్లో ఎంపికైన అభ్యర్థులు తీసుకున్న కోర్సుల వివరాలను తెలిపే ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టాయని సీసీపీఏ గుర్తించింది. దీన్ని వినియోగదారుల రక్షణ చట్టం- 2019 .. తప్పుదారి పట్టించే ప్రకటనగా పరిగణిస్తోంది.
విద్యార్థులు కోర్సుల ఎంపిక విషయంలో సమాచారంతో కూడిన న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు అన్ని కోచింగ్ సంస్థలు ప్రకటనల్లో నిజాయితీగా సమాచారాన్ని పొందుపరచాలని సీసీపీఏ ప్రధానంగా చెప్పింది.
***
(Release ID: 2174467)
Visitor Counter : 3