లోక్‌సభ సచివాలయం
మహాత్మాగాంధీ.. లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధానమంత్రి.. లోక్‌సభ స్పీకర్ నివాళి
Posted On:
02 OCT 2025 3:54PM by PIB Hyderabad
మహాత్మాగాంధీ, పూర్వ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోని వారి చిత్రపటాల వద్ద లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు నివాళి అర్పించారు.
ఆ మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, పార్లమెంటరీ-మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, చట్టం-న్యాయశాఖ (స్వతంత్ర బాధ్యత)సహా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, పలువురు ప్రస్తుత-మాజీ ఎంపీలు, ఇతర ప్రముఖులు ఉన్నారు.
రాజ్‌ఘాట్‌లోనూ శ్రీ ఓం బిర్లా నివాళి
అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధివద్ద లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పుష్పాంజలి ఘటించారు. ప్రపంచ మానవాళికి మహాత్ముని జీవితమే అజరామర సందేశమని ఈ సందర్భంగా స్పీకర్ అభివర్ణించారు.
మహాత్మాగాంధీ జీవితం.. ప్రబోధాలు సామాజిక-రాజకీయ-పౌర జీవనంలో శాశ్వత స్ఫూర్తిదాయకాలు: శ్రీ బిర్లా
· అచంచల దేశభక్తి.. నిరాడంబరత మూర్తీభవించిన శాస్త్రీజీని దేశం సదా స్మరిస్తూనే ఉంటుంది
మహాత్మాగాంధీ, పూర్వ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శ్రీ బిర్లా వారికి నివాళి అర్పించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన అనుసరించిన విలువలు ఎంతో శక్తివంతమైనవి కాబట్టే, స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను నిర్దేశించడంతోపాటు మరింత బలాన్నిచ్చాయి. ఆయన పిలుపుతో లక్షలాదిగా భారతీయులు ఏకమై స్వాతంత్ర్య సాధన లక్ష్యం వైపు ముందడుగు వేశారు. ఆయన జీవితం, ప్రబోధాలు సామాజిక-రాజకీయ-పౌర జీవనంలో శాశ్వత స్ఫూర్తిదాయకాలు.
అలాగే, అకుంఠిత దేశభక్తితోపాటు నిష్కాపట్యం, నిరాడంబరత మూర్తీభవించిన పూర్వ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజీకి ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశ పురోగమనం దాకా ఆయన కీలక పాత్ర పోషించారు. దేశభక్తి, దృఢ సంకల్పం, నిరాడంబరతలకు ప్రతిరూపమైన శాస్త్రీజీని దేశం సదా స్మరించుకుంటూనే ఉంటుంది.” అని శ్రీ బిర్లా పేర్కొన్నారు.
****
(Release ID: 2174359)
Visitor Counter : 2