ఆర్థిక మంత్రిత్వ శాఖ
హక్కు కోరని ఆర్థిక ఆస్తులపై 3 నెలల దేశవ్యాప్త అవగాహన కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శ్రీకారం
· అక్టోబరు 4న ‘మీ సొమ్ము-మీ హక్కు’ నినాదంతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభం
Posted On:
01 OCT 2025 1:24PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వివిధ సంస్థలలోగల హక్కు కోరని ఆర్థిక ఆస్తులపై 3 నెలలపాటు నిర్వహించే జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 4న కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభిస్తారు. ‘మీ సొమ్ము-మీ హక్కు’ (ఆప్ కీ పుంజీ-ఆప్ కా అధికార్) నినాదంతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), బీమా నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), మదుపుదారుల అవగాహన-రక్షణ నిధి ప్రాధికార సంస్థ (ఐఈపీఎఫ్‌ఏ)ల సమన్వయంతో ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ప్రజల్లో అవగాహన లేమితోపాటు పాత ఖాతాల వివరాలు తెలియక ప్రజలు వాటిపై తమ హక్కును కోరని కారణంగా బీమా పాలసీలు, బ్యాంకు డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ఆదాయం వంటి ఆర్థిక ఆస్తులు తరచూ ఆయా సంస్థల ఖాతాల్లో పేరుకుపోతుంటాయి. ఈ నేపథ్యంలో అటువంటి ఆస్తులపై హక్కు పొందడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అటువంటి ఆస్తుల శోధన, రికార్డుల నవీకరణ సహా వాటిపై హక్కు కోరే విధానాలను అధికారులు ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తారు. ఈ కార్యక్రమంతోపాటు డిజిటల్ ఉపకరణాలు, వాటి వినియోగ విధానంపై ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు.
దేశ ప్రజలు ఆదా చేసిన ప్రతి రూపాయి వాస్తవ ఖాతాదారులకు లేదా వారి చట్టబద్ధ వారసులు, నామినీలకు దక్కేవిధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రారంభిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజల చురుకైన భాగస్వామ్యం ద్వారా అవగాహన పెరుగుతుంది. దీంతోపాటు ఇంటింటా ఆర్థిక సార్వజనీనత బలోపేతానికీ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. హక్కు కోరే ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేవిధంగా ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించారు. ఈ మేరకు సంబంధిత నిధి నియంత్రణ సంస్థలు సందేహాలు-సమాధానాల (ఎఫ్ఏక్యూ)ను కూడా రూపొందించాయి. వీటి ద్వారా హక్కుదారుల గుర్తింపు, అభ్యర్థన విధానం తదితరాలపై విస్పష్ట సమాచారం లభిస్తుంది.
ఈ ప్రచార కార్యక్రమం కింద బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు, పెన్షన్ సంస్థల స్టాళ్ల ఏర్పాటు ద్వారా ప్రత్యేక ఆర్థిక సార్వజనీనత ప్రదర్శన కూడా నిర్వహిస్తారు.
***
(Release ID: 2173666)
Visitor Counter : 7