లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డైరెక్టర్ జనరల్‌గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ స్థానంలో ఆయన నూతన జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. యూనిఫాం ధరించే యువజన సంస్థల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఎన్‌సీసీ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో తన కేడెట్ల సంఖ్యను 20 లక్షలకు విస్తరిస్తున్న కీలక సందర్భంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ఎన్‌సీసీ సంస్థ వికసిత్ భారత్@2047తో కలిసి పురోగమిస్తోంది. ఆవిష్కరణలు, డిజిటల్ నైపుణ్యాలు, ప్రపంచ అవగాహనను తన సాంప్రదాయిక విలువలైన వ్యక్తిత్వ నిర్మాణం, దేశభక్తితో ఏకీకృతం చేస్తోంది.
1988 డిసెంబర్ 17న భారత సైన్యంలోని 19వ కుమావోన్ రెజిమెంట్‌లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ 37 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించారు. తిరుగుబాటు నిరోధక, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయన సేవలందించారు. అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లోయ, ఆర్మీ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి మిషన్ కింద పదాతిదళ బ్రిగేడ్‌కూ ఆయన నాయకత్వం వహించారు. ఈ నియామకానికి ముందు ఆయన వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ కమాండెంట్‌గా పనిచేశారు.
ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేసిన లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ కార్యాచరణ, నాయకత్వంలో విశేష అనుభవాన్ని గడించారు. ఆయన నైపుణ్యం, దార్శనికత ఎన్‌సీసీని నూతన శక్తితో నడిపించగలవని, దేశం కోసం క్రమశిక్షణ గల, బాధ్యతాయుతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న యువతను రూపొందించడంలో ఎన్‌సీసీ పాత్రను ఆయన మరింత మెరుగుపరచగలరని భావిస్తున్నారు.
****