ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
27 SEP 2025 3:53PM by PIB Hyderabad
జై జగన్నాథ్, జై మాతా సమలేయ్, జై మాతా రామ చండీ!
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, అత్యంత ప్రజాదరణ గల, అంకితభావం కలిగిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జుయెల్ ఓరం గారు, ఒడిశా ఉప ముఖ్యమంత్రులు ప్రవతి పరిదా గారు, కనక్ వర్ధన్ సింగ్ దేవ్ గారు, పార్లమెంటులో నా సహచరులు బైజయంత్ పాండా గారు, ప్రదీప్ పురోహిత్ గారు, ఒడిశా భాజపా అధ్యక్షులు మన్మోహన్ సమల్ గారు అలాగే వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులు..
లక్షలాది మంది ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ రోజు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మాతో అనుసంధానమయ్యారు. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఝార్సుగూడలోని నా సోదరీ సోదరులకు నేను గౌరవంగా నమస్కరిస్తున్నాను. మీ ఆప్యాయతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయ ప్రముఖులందరికీ జోహార్.
మిత్రులారా,
ప్రస్తుతం నవరాత్రి పండగ జరుగుతోంది. ఈ పవిత్రమైన పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామ చండీ కొలువైన భూమిపై మీ అందరి 'దర్శనం' పొందే అదృష్టం నాకు లభించింది. పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. మీ ఆశీర్వాదాలు మాకు బలం.. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
సోదరీ సోదరులారా,
ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒడిశా ప్రజలు కొత్త తీర్మానంతో ప్రతిజ్ఞ చేశారు. ఆ సంకల్పం ‘వికసిత్ ఒడిశా’ కోసం. నేడు ఒడిశా డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వేగంతో ముందుకు సాగడం ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు. ఒడిశా అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ కొత్తగా మన ముందుకు వస్తోంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G సేవలు ప్రారంభించుకున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఐఐటీల విస్తరణ కూడా ఈ రోజు ప్రారంభమైంది. ఒడిశాలో విద్య, నైపుణ్యాభివృద్ధి, కనెక్టివిటీకి సంబంధించిన అనేక ప్రాజెక్టులూ ప్రారంభించుకున్నాం. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. కొద్దిసేపటి కిందట బెర్హంపూర్ నుంచి సూరత్ వరకు ఆధునిక అమృత్ భారత్ రైలు ప్రారంభమైంది. సూరత్‌తో సంబంధం ఎంత ముఖ్యమో మీకు కూడా తెలుసు. సూరత్‌లో బంధువులు లేని గ్రామం ఈ ప్రాంతంలో చాలా అరుదు. పశ్చిమ బెంగాల్ తర్వాత, ఒడిశా వెలుపల అతిపెద్ద ఒడియా జనాభా గుజరాత్‌లోనే ముఖ్యంగా సూరత్‌లోనే నివసిస్తుందని కూడా కొందరు అంటున్నారు. అందుకే ఇక్కడ నుంచి నేరుగా రైలు సేవలను వారి కోసం ప్రారంభించాం. ఈ అభివృద్ధి పనులన్నింటి కోసం మీ అందరికీ, ఒడిశా ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన రైల్వే మంత్రి కూడా సూరత్ నుంచి ఒడియా సోదరీ సోదరులందరితో కలిసి ఈ కార్యక్రమంలో మనతో పాటు చేరారు.
మిత్రులారా,
భాజపా ప్రభుత్వం పేదలకు సేవ చేసే, పేదలకు సాధికారత కల్పించే ప్రభుత్వం. పేదలు, దళితులు, వెనకబడిన వర్గాలు, గిరిజన వర్గాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం మా ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలోనూ మేం ఆ నిబద్ధతను చూస్తున్నాం. అంత్యోదయ గృహ యోజన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేసే అవకాశం నాకు లభించింది. ఒక పేద కుటుంబానికి పక్కా ఇల్లు లభించినప్పుడు.. అది వారి వర్తమానాన్ని సులభతరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాల జీవితాన్ని కూడా సురక్షితం చేస్తుంది. ఇప్పటివరకు మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు అందించింది. ఒడిశాలో కూడా వేలాది ఇళ్ళు వేగంగా నిర్మితమవుతున్నాయి. ఈ విషయంలో మా ముఖ్యమంత్రి మోహన్ జీ, ఆయన బృందం ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. నేటికి దాదాపు యాభై వేల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరింది. ఒడిశాలో ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద గిరిజన కుటుంబాల కోసం 40,000కి పైగా ఇళ్ళు మంజూరయ్యాయి. అంటే అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు ఈ రోజు వారి అతి పెద్ద కల నెరవేరుతోంది. లబ్ధిదారులైన నా సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఒడిశా సామర్థ్యంపైనా, స్థానిక ప్రజల ప్రతిభపైనా నాకు ఎప్పుడూ గొప్ప నమ్మకం ఉంది. ప్రకృతి ఒడిశాను సమృద్ధిగా దీవించింది. ఒడిశా దశాబ్దాల పేదరికాన్ని చూసింది.. కానీ ఇప్పుడు ఈ దశాబ్దం మిమ్మల్ని శ్రేయస్సు దిశగా నడిపిస్తుంది. ఈ దశాబ్దం ఒడిశా జీవితంలో చాలా ముఖ్యమైంది. మా ప్రభుత్వం ఒడిశాకు ప్రధాన ప్రాజెక్టులనూ తీసుకువస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒడిశా కోసం రెండు సెమీ కండక్టర్ యూనిట్లను కేటాయించింది. ఇంతకుముందు అస్సాంలో గానీ, ఒడిశాలో గానీ సెమీ కండక్టర్ల వంటి అత్యాధునిక పరిశ్రమను స్థాపించవచ్చని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇక్కడి యువత సామర్థ్యం కారణంగానే ఇప్పుడు అలాంటి పరిశ్రమలు మీ దగ్గరకు వస్తున్నాయి. చిప్స్ తయారు చేయడానికి ఒడిశాలో సెమీ కండక్టర్ పార్కు కూడా ఏర్పాటు కానుంది. మీ ఫోన్, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, కారు, అనేక ఇతర పరికరాలకు శక్తినిచ్చేది.. అది లేకుండా ఏ పరికరం పనిచేయలేనిది అయిన చిన్న చిప్ ఇక్కడ ఒడిశాలోనే తయారయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. ఇప్పుడు బిగ్గరగా చెప్పండి-జై జగన్నాథ్!
మిత్రులారా,
చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతి రంగంలోనూ భారత్ స్వయం-సమృద్ధి సాధించాలనేది మా సంకల్పం. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మీరు జవాబిస్తారా? నేను అడిగితే మీరు సమాధానం ఇస్తారా? మీరు పూర్తి శక్తితో సమాధానం ఇస్తారా? నాకు చెప్పండి.. భారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దా? భారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దా? భారత్ స్వయం-సమృద్ధి సాధించాలా వద్దా? చూడండి.. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మన దేశం ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకూడదని కోరుకుంటున్నాడు. భారత్ ప్రతి విషయంలోనూ స్వయం-సమృద్ధి సాధించాలి. అందుకే పారాదీప్ నుంచి ఝార్సుగూడ దాకా విశాలమైన పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం.
సోదరీ సోదరులారా,
ఆర్థికంగా బలంగా మారాలనుకునే ఏ దేశమైనా నౌకా నిర్మాణానికి, పెద్ద పెద్ద నౌకలను తయారు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. నౌకా నిర్మాణం ద్వారా వాణిజ్యం, సాంకేతికత, జాతీయ భద్రత వంటి ప్రతి రంగానికి ప్రయోజనం కలుగుతుంది. మనకు సొంత నౌకలు ఉన్నప్పుడు సంక్షోభ సమయాల్లో కూడా ప్రపంచంతో ఎగుమతులు-దిగుమతులకు అంతరాయం ఉండదు. అందుకే మన భాజపా ప్రభుత్వం చాలా పెద్ద ముందడుగు వేసింది. దేశంలో నౌకా నిర్మాణం కోసం మేం 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమోదించాం. దీని వల్ల దేశంలోకి దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. ఈ డబ్బు ఉక్కు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, చిన్న-కుటీర పరిశ్రమలకు చేరుతుంది. అతిపెద్ద ప్రయోజనం నా యువతకు.. ఈ దేశంలోని కుమారులు, కుమార్తెలకు వెళుతుంది. ఇది లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఒడిశా కూడా దీని నుంచి చాలా ప్రయోజనం పొందుతుంది. ఒడిశా పరిశ్రమలు, యువత ఈ ఉపాధి అవకాశాల నుంచి చాలా ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా,
దేశం స్వయం-సమృద్ధి దిశగా ఈ రోజు కీలక ముందడుగు వేసింది. టెలికాం ప్రపంచంలో 2జీ, 3జీ, 4జీ సేవలు ప్రారంభమయ్యే నాటికి భారత్ చాలా వెనకబడి ఉంది. అప్పుడు ఏమి జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. 2జీ, 3జీ గురించిన జోకులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.
సోదరీ సోదరులారా,
2జీ, 3జీ, 4జీ సేవల సాంకేతికతల కోసం భారత్ విదేశాలపై ఆధారపడి ఉండేది. అలాంటి పరిస్థితి మన దేశానికి మంచిది కాదు. అందుకే ఈ ముఖ్యమైన టెలికాం సాంకేతికతలను భారత్‌లోనే అభివృద్ధి చేయాలని దేశం నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ మన దేశంలో పూర్తిగా స్వదేశీ 4జీ సాంకేతికతను అభివృద్ధి చేయడం మనకు గర్వకారణం. కృషి, అంకితభావం, అపారమైన నైపుణ్యంతో బీఎస్ఎన్ఎల్ చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి దోహదపడిన మన దేశ యువతను, వారి ప్రతిభను, భారత్ స్వయం-సమృద్ధి కోసం వారు చేసిన గొప్ప సేవను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ కంపెనీలు ఈ రోజు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను ప్రారంభించగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఐదు దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపాయి. ఇప్పుడు 4జీ సేవలు ప్రారంభించడానికి 'స్వదేశీ' సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని ఐదు దేశాల్లో మనం కూడా ఉన్నాం.
మిత్రులారా,
యాదృచ్ఛికమే అయినా, ఈ రోజు బీఎస్ఎన్ఎల్ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ చరిత్రాత్మక సందర్భంలో బీఎస్ఎన్ఎల్, దాని భాగస్వాముల కృషి ద్వారా భారత్ ప్రపంచ టెలికాం తయారీ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రోజు ఝార్సుగూడ నుంచి బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ప్రారంభం కావడం ఒడిశాకు గర్వకారణం. ఇందులో దాదాపు లక్ష 4జీ టవర్లు ఉన్నాయి. ఇది జాతికే గర్వకారణం. ఈ టవర్లు దేశంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో కొత్త విప్లవాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ 4జీ టెక్నాలజీ విస్తరణతో దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేని దాదాపు 30,000 గ్రామాలు ఇప్పుడు అనుసంధానమవుతున్నాయి.
మిత్రులారా,
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ వేలాది గ్రామాల ప్రజలు కూడా ఈ రోజు మనతో పాటు వీక్షిస్తున్నారు. ఈ కొత్త హై-స్పీడ్ ఇంటర్నెట్ సాంకేతికత ద్వారా సరిహద్దులలోని మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్లు ఇక్కడ జరిగేది చూస్తూ మాట్లాడేది వింటున్నారు. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే మన కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా ఈ రోజు అస్సాం నుంచి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మిత్రులారా,
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవల ద్వారా నా గిరిజన ప్రాంతాలు, నా గిరిజన సోదరీసోదరులు, మారుమూల గ్రామాలు, సుదూర కొండ ప్రాంతాలకు ప్రయోజకం చేకూరుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా అద్భుతమైన డిజిటల్ సేవలను పొందుతారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చు.. మారుమూల ప్రాంతాల్లోని రైతులు పంటల ధరలను తెలుసుకోవచ్చు.. ఆనారోగ్యంగా ఉన్న వారు టెలిమెడిసిన్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దేశంలోని ఉత్తమ వైద్యుల నుంచి వైద్య సలహా తీసుకోవచ్చు. ఇది సరిహద్దులలో, హిమాలయాల శిఖరాల్లో, ఎడారుల్లో విధులు నిర్వర్తిస్తోన్న మన సైనికులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మెరుగైన అనుసంధానత వల్ల వాళ్లు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు.
మిత్రులారా,
భారత్‌లో ఇప్పటికే అత్యంత వేగవంతమైన 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ టవర్లను 5జీ సేవలకు సులభంగా ఆధునికీకరించొచ్చు. ఈ చారిత్రాత్మక రోజును పురస్కరించుకొని బీఎస్ఎన్ఎల్, దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
'ఆత్మనిర్భర్ భారత్' తయారుచేయాలంటే నైపుణ్యం కలిగిన యువతతో పాటు పరిశోధనలకు మంచి వాతావరణం ఉండటం కూడా అవసరం. అందుకే ఇది భాజపా ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. నేడు ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యాభివృద్ధిలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ విద్యా సంస్థలను కూడా మేం ఆధునికీకరిస్తున్నాం. ఇవాళ దీనికి సంబంధించిన మెరిట్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం కింద సాంకేతిక విద్యను అందించే సంస్థలపై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నాం. ఫలితంగా నాణ్యమైన సాంకేతిక విద్య కోసం మన యువత ఇకపై పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆధునిక ప్రయోగశాలలను ఉపయోగించుకునేందుకు, ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేర్చుకోవడానికి, సొంత పట్టణాల్లోనే సొంత అంకురాలను ప్రారంభించేందుకు వాళ్లు అవకాశాలను పొందుతారు.
మిత్రులారా,
ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలో, ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి సదుపాయాలు అందేలా చూసుకునేందుకు పని జరుగుతోంది. రికార్డు స్థాయిలో వ్యయం చేస్తున్నాం. అయితే గతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు. మిమ్మల్ని దోచుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వదులుకోలేదు.
మిత్రులారా,
2014లో ప్రజలు మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడే దేశాన్ని కాంగ్రెస్ దోపిడీ వ్యవస్థ నుంచి విజయవంతంగా విముక్తి చేశాం. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందినప్పటికీ.. దానిపై కూడా పన్ను చెల్లించాల్సి ఉండేది. కాంగ్రెస్ ఈ వ్యవస్థను 2014 వరకు కొనసాగించింది. కానీ మీరు నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత.. ప్రస్తుతం 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం పూర్తి పన్ను రహితంగా ఉంది.
మిత్రులారా,
2025 సెప్టెంబర్ 22 నుంచి ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణలు అందరికీ జీఎస్టీ బచత్ ఉత్సవ్ (పొదుపు పండుగ) అనే బహుమతిని ఇచ్చాయి. ఇవి ముఖ్యంగా మాతృమూర్తులు, సోదరీమణులకు వంటగది ఖర్చులను మరింత తగ్గించింది. చాలా నిత్యావసరాలపై ధరలు గణనీయంగా తగ్గాయి. నేను ఒక ఉదాహరణను ద్వారా దీన్ని వివరిస్తాను. 2014 కంటే ముందు ఒడిశాలోని ఒక కుటుంబం నిత్యావసరాలపై సంవత్సరానికి రూ.1 లక్ష ఖర్చు చేసినట్లయితే.. దానిపై రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు పన్ను ఉండేది. 2014 కంటే ముందు మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 20,000–25,000 రూపాయలను పన్నుగా తీసుకునేది. అంటే మీరు రూ. 1 లక్ష ఖర్చు చేయాలంటే వాస్తవానికి రూ. 1.25 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. 2017లో మా ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ఈ పన్నును తగ్గించటం ద్వారా మీపై భారాన్ని గణనీయంగా తగ్గించాం. ప్రస్తుతం చేపట్టిన నూతన సంస్కరణలతో పన్ను మరింత తగ్గింది. ఇవాళ రూ. 1 లక్ష వార్షిక ఖర్చుపై ఒక కుటుంబం రూ. 5,000 నుంచి రూ. 6,000 మాత్రమే పన్ను చెల్లించాలి. ఇప్పుడు చెప్పండి.. గతంలో రూ. 25,000 ఎక్కడ! ఇప్పుడు ఉన్న రూ. 5,000 నుంచి రూ. 6,000 ఎక్కడ!. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంతో పోల్చితే ఇప్పుడు రూ. 1 లక్ష వార్షిక ఖర్చుపై ఒక పేద, సామాన్య, నవ మధ్య తరగతి కుటుంబం రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఆదా చేసుకుంటోంది.
మిత్రులారా,
ఒడిశా రైతు బిడ్డల రాష్ట్రం. జీఎస్టీ పొదుపు పండుగ రైతులకు కూడా చాలా ప్రయోనకరంగా ఉంటుంది. ప్రతిపక్షాల హయంలో రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు ఒక్క ట్రాక్టర్‌పై రూ. 70,000 పన్ను చెల్లించాల్సి ఉండేది. జీఎస్టీ ప్రవేశపెట్టి మేం ఆ పన్నును తగ్గించాం. ఇప్పుడు కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులు ఇప్పుడు అదే ట్రాక్టర్‌పై సుమారు రూ. 40,000 ఆదా చేసుకుంటున్నారు. ఇప్పుడు వరి నాట్లు వేసేందుకు ఉపయోగించే యంత్రాలపై రూ. 15,000 ఆదా చేస్తున్నారు. కర్షకులు పవర్ టిల్లర్లపై రూ. 10,000, నూర్పిడి యంత్రాలపై రూ. 25,000 వరకు పొదుపు చేసుకుంటున్నారు. భాజపా ప్రభుత్వం ఇలాంటి అనేక వ్యవసాయ ఉపకరణాలు, పరికరాలపై పన్నులను గణనీయంగా తగ్గించింది.
మిత్రురాలా,
ఒడిశాలో ఎక్కువ గిరిజన జనాభా ఉంటుంది. వారంతా జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. మన ప్రభుత్వం ఇప్పటికే కెండు ఆకులు సేకరించేవారి కోసం పనిచేస్తోంది.. ఇప్పుడు వీటిపై జీఎస్టీ గణనీయంగా తగ్గించింది. ఇది ఈ పనిచేసే వాళ్లు కెండు ఆకులపై మెరుగైన ధరలు పొందేలా చూసుకుంటుంది.
మిత్రులారా,
భాజపా ప్రభుత్వం నిరంతరం మీకు పన్ను ఉపశమనం కల్పిస్తూ మీ పొదుపును పెంచుతోంది. ప్రతిపక్షాలు మాత్రం పాత పద్ధతులను విడిచిపెట్టటం లేదు. కాంగ్రెస్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని దోచుకునే పనిలో ఉంది.
దీన్ని నేను కారణం లేకుండా చెప్పటం లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారన్న దానికి ఆధారాలు నా దగ్గరున్నాయి. కొత్త పన్ను రేట్లలో భాగంగా మేం సిమెంట్‌పై పన్ను తగ్గించాం. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ మమ్మల్ని అన్ని విధాలా తిట్టే అలవాటు చేసుకుంది. సిమెంట్‌పై జీఎస్టీ రేటును మేం తగ్గించినప్పుడు.. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు తగ్గాయి. కానీ కాంగ్రెస్ సామాన్య ప్రజలకు ఈ ఉపశమనాన్ని ఇవ్వదలుచుకోలేదు. గతంలో మేం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా వాటిపై మరో పన్ను విధించింది. ఫలితంగా ధరలు మారలేదు. వాళ్లు సొంత ఖజానాలను నింపుకుంటూ దోపిడీకి ద్వారాలు తెరిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అదే జరిగింది. మన ప్రభుత్వం సిమెంట్ ధరను తగ్గించినప్పుడు వాళ్లు కొత్తగా సొంత పన్నును విధించారు. భారత ప్రభుత్వం హిమాచల్ ప్రజలకు ఇవ్వాలనుకున్న ప్రయోజనాన్ని ఈ విధంగా ఈ దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా ప్రజలను దోచుకుంటుంది. అందుకే దేశ ప్రజలు కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.
మిత్రులారా,
జీఎస్టీ పొదుపు పండుగ తల్లులు, అక్కాచెళ్లెలకు ఎక్కువ ఆనందాన్ని తీసుకొచ్చింది. మహిళలు, కుమార్తెలకు సేవ చేయడం మా ప్రభుత్వానికి ప్రాధాన్యతతో కూడిన అంశం. మేం మాతృమూర్తులు, అక్కాచెళ్లెల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.
మిత్రులారా,
కుటుంబం కోసం త్యాగాలు చేసే వారిలో మాతృమూర్తులు మొదటి స్థానంలో ఉంటారు. తల్లి చేసే త్యాగాలు మనందరికీ తెలుసు. పిల్లల మీద భారం పడకుండా ప్రతి కష్టాన్ని తమపై వేసుకుంటారు. వైద్య ఖర్చుల భారం కుటుంబంపై పడకుండా ఉండేందుకు సొంత అనారోగ్యాలను కూడా దాచిపెడతారు. దీని కోసమే ఆయుష్మాన్ భారత్ యోజన తీసుకొచ్చాం. ఇది దేశంలోని తల్లులు, అక్కాచెళ్లెలు, మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. వీరంతా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందుతున్నారు.
మిత్రులారా,
తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం ధృడంగా ఉంటుంది. అందుకే విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ప్రతి తల్లి ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ను (ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబం) ప్రారంభించాం. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబం బలంగా మారుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాం. ఈ శిబిరాల్లో ఇప్పటికే 3 కోట్లకు పైగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో మధుమేహం, రొమ్ము క్యాన్సర్, టీబీ, సికిల్ సెల్ అనీమియా, అనేక ఇతర వ్యాధుల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒడిశాలోని మాతృమూర్తులు, అక్కాచెళ్లెలు, కుమార్తెలు అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా,
ప్రజలను, దేశాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ నిరంతరంగా అంకితభావంతో పనిచేస్తోంది. పన్ను తగ్గింపు అయినా, ఆధునిక అనుసంధానత అయినా మేం ప్రజా సౌలభ్యం, శ్రేయస్సుకు మార్గాలను వేస్తున్నాం. ఒడిశా కూడా దీని నుంచి గణనీయంగా ప్రయోజనం పొందుతోంది. ప్రస్తుతం ఒడిశాలో ఆరు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దాదాపు 60 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతోంది. ఝార్సుగూడలోని వీర్ సురేంద్ర సాయి విమానాశ్రయాన్ని ఇప్పుడు దేశంలోని అనేక ప్రధాన నగరాలకు అనుసంధానమవుతోంది. ఒడిశా ఇప్పుడు ఖనిజాలు, గనుల తవ్వకం ద్వారా చాలా ఎక్కువ ఆదాయాన్ని పొందుతోంది. సుభద్ర యోజన ద్వారా ఒడిశా మాతృమూర్తులు, అక్కాచెల్లెలకు నిరంతరం మద్దతు లభిస్తోంది. మన ఒడిశా ఇప్పటికే పురోగతి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ అభివృద్ధి వేగ మరింత ఊపందుకుంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో మీరంతా నాతో కలిసి అనండి—
భారత మాతా కీ జై!
భారత మాతా కీ జై!
భారత మాతా కీ జై!
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
చాలా ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(Release ID: 2172923)
Visitor Counter : 12
Read this release in:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam