ప్రధాన మంత్రి కార్యాలయం
టీవీ9 కాంక్లేవ్‌లో పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
26 FEB 2024 10:58PM by PIB Hyderabad
పూర్వకాలంలో.. యుద్ధానికి బయలుదేరే ముందు సైన్యంలో ఉత్సాహం నింపడానికి దుందుభి వాయించేవారు... బాకాలను ఊదేవారు. ధన్యవాదాలు, దాస్! టీవీ9 వీక్షకులందరికీ, ఈ సభకు హాజరైనవారికి నా నమస్కారాలు. నేను తరచూ భారత్ వైవిధ్యం గురించి మాట్లాడుతూ ఉంటాను. టీవీ9 న్యూస్రూంలో, విలేకరుల బృందంలో ఆ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. శక్తిమంతమైన భారతీయ ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా వివిధ భారతీయ భాషల్లో కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలు, భాషల్లో పనిచేస్తున్న టీవీ9 జర్నలిస్టులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు.
స్నేహితులారా,
ఈ రోజు జరుగుతున్న ఈ సదస్సుకు టీవీ9 మంచి ఇతివృత్తాన్ని ఎంచుకొంది: ‘‘ఇండియా: తదుపరి విజయానికి సిద్ధం’’. మనలో ఉత్సాహం, శక్తి నిండినప్పుడే గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాం. నిరాశలో మునిగిపోయిన దేశం లేదా వ్యక్తి.. ‘తర్వాతి దశ’కు వెళ్లేందుకు ప్రయత్నించరు. సమకాలీన భారత్ ప్రదర్శిస్తున్న విశ్వాసాన్ని, ఆకాంక్షలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైందంటే.. దాని వెనుక పదేళ్లుగా సిద్ధం చేసిన బలమైన పునాది లేదా ‘లాంఛ్ ప్యాడ్’ ఉందని ఈ ప్రపంచం గ్రహిస్తుంది. ఈ పదేళ్లలో ఇక్కడి వరకు మనం రావడానికి దారి తీసిన మార్పులేమిటి? ఆలోచనా ధోరణిలో, ఆత్మ విశ్వాసంలో, నమ్మకంలో వచ్చిన మార్పు.. సుపరిపాలన సమర్థతే దీనికి కారణం.
స్నేహితులారా,
పాతకాలం నాటి సామెత ఒకటుంది - ‘‘మన్ కే హారే హార్ హై, మన్ కీ జీతే జీత్’’ (మనసులో ఓడిపోతాం అనుకొనేవాడు కచ్చితంగా ఓడిపోతాడు.. గెలుస్తాం అనుకొనేవాడు కచ్చితంగా గెలుస్తాడు). దాస్ చెప్పిన అంశాల పట్ల.. నాకు భిన్నమైన దృక్పథం ఉంది. గొప్ప వ్యక్తుల జీవిత కథలే చరిత్ర అని ఆయన అన్నారు. ఇది బహుశా పాశ్చాత్య ఆలోచనా ధోరణి అయి ఉండొచ్చు, కానీ భారత్‌లో మాత్రం ప్రతి సాధారణ పౌరుడి జీవితం కూడా ఓ చరిత్రే. ఇది దేశానికున్న అసలైన శక్తిని తెలియజేస్తుంది. గొప్పవాళ్లు వస్తుంటారు.. వెళుతుంటారు.. దేశం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
స్నేహితులారా,
ఓడిపోతామనే ఆలోచనతో విజయం సాధించడం అసాధ్యం. అందుకే.. గడచిన పదేళ్లలో ఆలోచనా ధోరణిలో వచ్చిన గణనీయమైన మార్పు, మనం సాధించిన పురోగతి.. అసాధారణమైనవి. గతంలో దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించినవారికి భారతీయ శక్తిపై విశ్వాసం లేదు. భారతీయుల సామర్థ్యాలను వారు తక్కువగా అంచనా వేసి, నిరాశావాదులుగా, ఓడిపోయేవారిగా ముద్ర వేశారు. భారతీయులు సోమరిపోతులని, కష్టపడి పనిచేయలేరని ఎర్రకోట బురుజుల నుంచి అపహాస్యం చేశారు. దేశ నాయకత్వం నైరాశ్యంలో మునిగిపోయినప్పుడు.. ప్రజల్లో ఆశను పెంపొందించడం సవాలుగా మారుతుంది. ఫలితంగా.. దేశంలో చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయి.. స్తబ్ధుగా ఉండిపోయారు. దీనికి తోడు.. పెచ్చరిల్లిన అవినీతి, కుంభకోణాలు, విధాన లోపాలు, బంధుప్రీతి దేశ పునాదులను క్షీణింపజేశాయి.
ఈ దీన స్థితి నుంచి దేశాన్ని ముందుకు నడిపిస్తూ.. గత పదేళ్లలో ఈ స్థాయికి తీసుకువచ్చాం. కేవలం పదేళ్ల వ్యవధిలోనే.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ప్రస్తుతం, దేశంలో సాహసోపేతమైన నిర్ణయాధికారంతో కీలకమైన విధానాలను వేగంగా రూపొందిస్తున్నాం. ఈ ఆలోచనావిధానంలో మార్పు సత్ఫలితాలను ఇస్తోంది. 21 వ శతాబ్దపు సమకాలీన భారత్ చిన్న స్థాయిలో ఆలోచించడాన్ని వదలిపెట్టింది. ఇప్పుడు మేం ఏ పని చేపట్టినా.. ఉత్తమంగా, ఉన్నతంగా చేయడానికే శ్రమిస్తాం. భారత్ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతూ, మనతో జట్టుకట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ ప్రపంచం గుర్తిస్తోంది. ‘ఇండియా దీన్ని సాధించిందా?’ అనే స్పందన ఇప్పుడు సర్వ సాధారణ అంశంగా మారిపోయింది. పెరుగుతున్న విశ్వసనీయత ఇప్పుడు భారతదేశానికి అతిపెద్ద గుర్తింపుగా మారింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంలో దశాబ్దానికి ముందు.. ఇప్పుడు ఉన్న గణాంకాలను మీరు పోల్చి చూడండి. గత ప్రభుత్వాల హయాంలో పదేళ్ల వ్యవధిలో 300 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే భారత్‌కు వచ్చాయి. మా హయాంలో అదే పదేళ్ల కాలంలో సుమారుగా 640 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశానికి వచ్చాయి. గడచిన దశాబ్దంలో చూసిన డిజిటల్ విప్లవం, కొవిడ్-19 సంక్షోభ సమయంలో వ్యాక్సీన్ సామర్థ్యం అందించిన విశ్వాసం, పెరుగుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య.. ఇవన్నీ భారతీయుల్లో ప్రభుత్వంపై, వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి.
మరో గణాంకాన్ని పరిశీలించండి: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సభలో చాలామంది ఉండొచ్చు. 2014లో సుమారుగా రూ. 9 లక్షల కోట్లను దేశ పౌరులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 2024కి వద్దాం. ఇప్పుడు ఈ మొత్తం రూ.52 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంపై భారతీయులకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. నేను ఏదైనా చేస్తాను, నాకు అసాధ్యం కానిది ఏమీ లేదు అని ప్రతి భారతీయుడు ఆలోచిస్తున్నారు. మా పనితీరు ఎంతో మంది నిపుణుల అంచనాలను సైతం అధిగమించిందని టీవీ 9 ప్రేక్షకులు కూడా గమనిస్తారు.
స్నేహితులారా,
ఈ ఆలోచనాధోరణి, విశ్వాసంలో మార్పునకు అసలు కారణం.. మా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పని సంస్కృతి, పరిపాలనా విధానంలోనే ఉంది. అదే అధికారులు, కార్యాలయాలు, వ్యవస్థలు, ఫైళ్లు ఉన్నప్పటికీ.. ఫలితాల్లో మాత్రం గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పౌరులను ఇబ్బంది పెట్టేవిగా కాకుండా.. మిత్రులుగా మారుతున్నాయి. ఇది రానున్న ఏళ్లలో పరిపాలనలో నూతన ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
స్నేహితులారా,
భారత దేశ అభివృద్ధిని వేగవంతం చేయడానికి, తర్వాతి దశకు వెళ్లడానికి.. మునుపటి మార్గం నుంచి గేర్లను మార్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాల హయాంలో రివర్స్ గేర్లో భారత్ వెనక్కి ఎలా వెళ్లిందో చెబుతాను. ఉత్తర ప్రదేశ్‌లోని సరయూ కెనాల్ ప్రాజెక్టుకు 1980ల్లో శంకుస్థాపన చేశారు. అయితే, నాలుగు దశాబ్దాల పాటు అది కార్యరూపం దాల్చలేదు. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నాం. అదే విధంగా 1960ల్లో నెహ్రూ ప్రారభించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పనులు 60 ఏళ్లు నిలిచిపోయాయి. మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి 2017లో ప్రారంభించింది. మహారాష్ట్రలో కృష్ణా కోయినా ప్రాజెక్టు 1980ల్లో ప్రారంభమైంది.. కానీ 2014లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయింది.
స్నేహితులారా,
అటల్ టన్నెల్ ప్రాంతంలో మంచు కురుస్తున్న ఫొటోలను మీరు ఇటీవలి కాలంలో చూసే ఉంటారు. దానికి 2002లో పునాది రాయి వేస్తే.. 2014 వరకు అది అసంపూర్తిగానే ఉంది. మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి 2020లో ప్రారంభించింది. 1998లో ఆమోదం పొందిన అస్సాంలోని బోగీబీల్ బ్రిడ్జి పనులు పూర్తి కావడానికి మా ప్రభుత్వం వచ్చే వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత దాన్ని 2018లో ప్రారంభించాం. అదే విధంగా.. 2008లో మంజూరైన ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, 15 ఏళ్ల తర్వాత 2023లో పూర్తయింది. ఇలాంటి 500 ప్రాజెక్టుల గురించి నేను మీకు చెప్పగలను. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందల ప్రాజెక్టులను మేం వేగంగా పూర్తి చేశాం.
సాంకేతికతను వినియోగించుకుంటూ.. ప్రధానమంత్రి కార్యాలయంలో ఆధునిక వ్యవస్థ అయిన – ప్రగతి ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా, ప్రతి ప్రాజెక్టు ఫైలును స్వయంగా క్షుణ్నంగా పరిశీలిస్తాను. డేటాను సమీక్షించి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను. ఆన్లైన్లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులతో సమగ్ర విశ్లేషణ చేపడతాను. గత దశాబ్దంలో నేను రూ. 17 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను సమీక్షించాను. ఈ నిర్దుష్టమైన పద్ధతి ద్వారానే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
ఓ దేశంలో గత ప్రభుత్వాలన్నీ నత్త నడకన పనులు సాగిస్తే.. దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? మా ప్రభుత్వం నెమ్మదిగా సాగే ఈ విధానం నుంచి బయటకు వచ్చింది. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను: దేశంలోని అతి పొడవైన బ్రిడ్జి అటల్ సేతు. దీనికి 2016లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే దాన్ని ప్రారంభించాం. కొత్త పార్లమెంట్ భవనానికి పునాది రాయి 2020లో వేస్తే.. గతేడాది ప్రారంభోత్సవం చేసుకున్నాం. జమ్ములోని ఎయిమ్స్‌కు 2019లో శంకుస్థాపన చేస్తే.. గత వారమే ఫిబ్రవరి 20న ప్రారంభమైంది.
అదే విధంగా రాజ్‌కోట్ ఎయిమ్స్‌కు 2020లో భూమి పూజ చేస్తే.. నిన్నే ప్రారంభించుకున్నాం. సంభల్పూర్లోని ఐఐఎంకు 2021లో శంకుస్థాపన చేసి ఇటీవలే ప్రారంభించాం. ఐఐటీ భిలాయ్‌కు 2018లో పునాది వేసి.. కొన్ని రోజుల కిందటే ప్రారంభించాం. గోవాలో కొత్త విమానాశ్రయానికి 2016లో శంకుస్థాపన చేసి 2022లో ప్రారంభించుకున్నాం. సముద్ర అంతర్భాగంలో లక్షద్వీపాలకు ఆప్టికల్ ఫైబర్ సదుపాయం కల్పించే పనులు 2020లో ప్రారంభమై ఇటీవలే పూర్తయ్యాయి.
బెనారస్‌లో 2021లో శంకుస్థాపన చేసిన బనాస్ డైరీని కొన్ని రోజుల క్రితమే ప్రారంభించాం. నిన్ననే.. ద్వారకలో ఉన్న సుదర్శన్ బ్రిడ్జికి సంబందించిన ఫొటోలను మీరు చూశారు. ఇది దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జి, జాతికి గర్వకారణమైనది. 2017లో దీనికి మా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మోదీ గ్యారంటీ అని నేను తరచూ చెప్పేది ఇదే: వేగం ఉన్నప్పుడే.. త్వరగా పని పూర్తి చేయాలనే సంకల్పం, పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు గౌరవం ఉన్నప్పుడే దేశ ప్రగతి పథంలో నడుస్తుంది. ఇదే తదుపరి దశ అభివృద్ధికి దారి తీస్తుంది.
మిత్రులారా,
మునుపెన్నడూ లేని విధంగా, ఊహకందని స్థాయిలో నేడు భారత్‌లో పనులు జరుగుతున్నాయి. ఈ వారం రోజుల నుంచే మీకు చాలా ఉదాహరణలు చెప్పగలను. ఫిబ్రవరి 20న జమ్మూ నుంచి ఐఐటీలు, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు సహా దేశవ్యాప్తంగా అనేక ఉన్నత విద్యా సంస్థలను ఒకేసారి ప్రారంభించాను. ఫిబ్రవరి 24న రాజ్‌కోట్ నుంచి ఒకేసారి దేశవ్యాప్తంగా అయిదు ఎయిమ్స్ కేంద్రాలను ప్రారంభించాను. ఈ ఉదయం నేను 27 రాష్ట్రాల్లోని 500కు పైగా రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశాను. అదే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 1500కు పైగా ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌ల పనులను ప్రారంభించాను. ఈ కార్యక్రమానికి హాజరవడానికి ముందే, వచ్చే రెండు రోజుల కోసం నా ఎజెండాను వివరిస్తూ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులను నేను షేర్ చేశాను. రేపు ఉదయం నేను కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలను సందర్శించి.. అంతరిక్షం, ఎంఎస్ఎంఈ, ఓడరేవులు, గ్రీన్ హైడ్రోజన్, రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తేనే భారత్ పురోగమించగలదు. మొదటి, రెండో, మూడో పారిశ్రామిక విప్లవాల్లో వెనుకబడిన మనం.. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచాన్ని ముందుండి నడిపించడం అత్యవసరం. అందుకే, దేశవ్యాప్తంగా నిత్యం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు దేశ పురోగతిని వేగవంతం చేస్తున్నాయి.
భారత్‌లో ప్రతిరోజూ విశేష పురోగతి జరుగుతోంది. రోజూ రెండు కొత్త కళాశాలలను, వారానికో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్నాం. అలాగే ప్రతిరోజూ 55 పేటెంట్లు, 600 ట్రేడ్‌మార్క్‌లు నమోదవుతున్నాయి. రోజూ దాదాపు 1.5 లక్షల ముద్ర రుణాలు పంపిణీ అవుతున్నాయి. రోజూ 37 కొత్త అంకుర సంస్థలు ప్రారంభమవుతున్నాయి. రోజూ రూ. 16 వేల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ అవుతున్నాయి. అలాగే రోజూ మూడు కొత్త జన ఔషధి కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. రోజూ 14 కిలోమీటర్ల రైల్వే మార్గాలను నిర్మిస్తున్నాం. రోజూ 50 వేలకు పైగా ఎల్పీజీ కనెక్షన్‌లను అందిస్తున్నాం. దేశంలో ప్రతీ క్షణం ఓ కుళాయి నీటి కనెక్షన్‌ను అందిస్తున్నాం. అంతేకాకుండా రోజూ 75 వేల మంది పేదరికం నుంచి బయటపడుతున్నారు. పేదరిక నిర్మూలన గురించి నినాదాలను మనమెప్పుడూ వింటూనే ఉంటాం. కానీ మా ప్రభుత్వ హయాంలో.. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
మిత్రులారా,
దేశంలో వినియోగానికి సంబంధించి ఇటీవలి నివేదికలో కొత్త అంశాలు వెల్లడయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పేదరికం సింగిల్ డిజిట్‌కు చేరుకుందని అది పేర్కొన్నది. ఈ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దంతో పోలిస్తే దేశంలో వినియోగం 2.5 రెట్లు పెరిగింది. భారతీయుల్లో వివిధ సేవలు, సౌకర్యాలపై ఖర్చు చేసే సామర్థ్యం పెరగడాన్ని ఇది సూచిస్తుంది. ఇంకా గత దశాబ్ద కాలంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం చాలా వేగంగా పెరిగిందని వెల్లడైంది. గ్రామీణ ప్రజల ఆర్థిక సామర్థ్యం పెరగడంతోపాటు వారిలో ఖర్చు చేయగల సమర్థత మెరుగవడాన్ని ఇది సూచిస్తుంది. ఈ మార్పు యాదృచ్ఛికంగా వచ్చినది కాదు.. గ్రామాలు, పేదలు, రైతుల అభ్యున్నతి లక్ష్యంగా మేం చేసిన ప్రయత్నాల ఫలితమిది. 2014 నుంచి మా ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. గ్రామాలు - నగరాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచింది. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు మహిళల ఆదాయాన్ని మెరుగుపరిచే మార్గాలను రూపొందించింది. తద్వారా ఈ అభివృద్ధి నమూనాతో గ్రామీణ భారతదేశాన్ని శక్తిమంతం చేసింది. అంతేకాకుండా.. దేశంలో తొలిసారిగా మొత్తం వ్యయంలో ఆహార వ్యయం 50 శాతం కన్నా తక్కువగా ఉంది. గతంలో ఆహారం కోసమే చాలావరకూ ఖర్చుచేసిన కుటుంబాలు.. ఇప్పుడు ఇతర అవసరాలకు నిధులను వినియోగించుకుంటున్నారని ఇది సూచిస్తుంది.
మిత్రులారా,
ప్రజలను పేదరికంలో ఉంచేందుకే మొగ్గు చూపడం గత ప్రభుత్వాల ధోరణిలో మరో ముఖ్యమైన అంశం. కేవలం ఎన్నికల సమయంలోనే, అదీ నామమాత్రపు ప్రయోజనాలనే పేదలకు అందించేవారు. స్వార్థ ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో, తమకు ఓటు వేసిన వారికే ప్రభుత్వాలు సేవలందించే ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి.
కానీ మిత్రులారా,
గత పదేళ్లలో భారత్ ఈ సంకుచిత మనస్తత్వాన్ని అధిగమించింది. అవినీతిని అరికట్టి.. దేశంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి ఫలాలను సమానంగా పొందేలా చూసింది. సంకుచిత రాజకీయాలను మేం తిరస్కరించాం. సంతుష్టీకరణకు బదులు సంపూర్ణ పాలననే మేం విశ్వసిస్తాం. దేశ ప్రజలను సంతృప్తిపరిచే మార్గాన్నే మేం ఎంచుకున్నాం. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’.. గత దశాబ్ద కాలంగా ఇదే మాకు మంత్రప్రదంగా ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి కార్యాచరణే ప్రధానమైన పాలన దిశగా మన వ్యవస్థలో మార్పు వచ్చింది. సంకుచితత్వం ఉన్నచోట అవినీతి, వివక్ష పెరుగుతాయి. సమగ్రత ఉన్నచోట సంతృప్తి, సామరస్యం ఉంటాయి.
నేడు ప్రభుత్వం వేగంగా ఇంటింటికీ చేరుతూ.. లబ్ధిదారులకు అవసరమైన సౌకర్యాలు అందేలా చూస్తోంది. మోదీ భరోసా వాహనం గురించి మీరు వినే ఉంటారు. ప్రభుత్వాధికారులు తమ వాహనాల్లో ఊరూరికీ వెళ్లి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకోవడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ప్రస్తుతం మా ప్రభుత్వం నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ప్రజలను కలుస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. పథకాలను ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవడంలో మా అంకితభావానికి ఇది నిదర్శనం. సమగ్రతకే ప్రాధాన్యమిస్తే.. వివక్ష ఏ రూపంలో ఉన్నా తొలగిపోతుందని స్పష్టం చేస్తున్నాను. రాజకీయాల కన్నా జాతీయ విధానానికే మేం కట్టుబడి ఉన్నామనీ దీని ద్వారా స్పష్టమవుతోంది.
మిత్రులారా,
దేశానికే ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్న సూత్రానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. గత పాలకులు సులభంగా బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. కానీ అది దేశ వికాసానికీ, పురోగతికీ ఎంతమాత్రమూ దోహదపడబోదు. అందుకే, దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించేలా.. దేశ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని మేం నిర్ణయాలు తీసుకున్నాం. not a fictitious portrayal అధికరణ 370 రద్దు నుంచి రామ మందిర స్థాపన వరకు, ట్రిపుల్ తలాక్ రద్దు నుంచి మహిళా రిజర్వేషన్లను ప్రోత్సహించడం వరకు, ఒక ర్యాంకు - ఒకే పింఛను అమలు నుంచి సాయుధ దళాల ప్రధానాధికారి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) పదవిని సృష్టించడం వరకు... ‘దేశమే ప్రథమం’గా భావించి అపరిష్కృతంగా ఉన్న ఈ అంశాలన్నింటినీ పరిష్కరించాం.
మిత్రులారా,
21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా భారత్‌ను నేడు మనం సిద్ధం చేయాలి. అందుకే, అంతరిక్షం నుంచి సెమీకండక్టర్ల వరకు, డిజిటలీకరణ నుంచి డ్రోన్ల వరకు, ఏఐ నుంచి పర్యావరణ హిత ఇంధనం వరకు, 5జీ నుంచి ఫిన్ టెక్ వరకు... భవిష్యత్ ప్రణాళికల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ముందంజలో ఉంది. అలాగే, వేగంగా ఫిన్ టెక్‌ను వేగంగా అందిపుచ్చుకుంటోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశం, స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యంలో అగ్రగామి, 5G నెట్వర్క్ విస్తరణలో ఐరోపా కన్నా ముందున్న దేశం భారత్. సెమీకండక్టర్ రంగంలో, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధనాల్లో వేగంగా పురోగతి సాధిస్తోంది.
ఉజ్వల భవిష్యత్తు కోసం నేడు భారత్ రాత్రింబవళ్లూ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. భారత్ ముందుచూపుతో ఆలోచిస్తోంది. ఫలితంగా ‘భారత్‌దే భవిత’ అన్న భావన ఇప్పుడు ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోంది. రాబోయే కాలం, ముఖ్యంగా వచ్చే అయిదేళ్లు అత్యంత ప్రధానమైనవి. ఇక్కడికొచ్చిన ప్రజలందరికీ ఎంతో బాధ్యతతో మాట ఇస్తున్నాను.. మా మూడో దఫా పదవీకాలంలో భారత్ సామర్థ్యాన్ని మునుపెన్నడూ లేనంత ఎత్తులకు తీసుకెళ్తాం. భారత అభివృద్ధి పయనంలో, అంతర్జాతీయ వేదికలపై ఘనతను చాటడంలో రాబోయే ఈ అయిదేళ్లు కీలకం. స్పష్టమైన ఆకాంక్ష- అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, ఈ సదస్సు జరిగినా జరిగి ఉండకపోయినా.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెడుతుందనడంలో సందేహానికి తావు లేదు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా ఆలోచనలను పంచుకునే అవకాశం నాకు లభించింది. కార్యక్రమం విజయవంతమవడంపై శుభాకాంక్షలు! రోజంతా చర్చలు, మేధోమథనాల్లో మునిగిపోయి ఉన్న మీకు ఈ సాయంత్రం ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2171104)
Visitor Counter : 10
Read this release in:
English
,
हिन्दी
,
Punjabi
,
Manipuri
,
Malayalam
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada