సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి మరో ఏడు ప్రదేశాలు
प्रविष्टि तिथि:
18 SEP 2025 4:48PM by PIB Hyderabad
ప్రపంచ వేదికపై సుసంపన్న, సహజ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలోనూ, ప్రదర్శించడంలోనూ భారత్ తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉంది. దేశం మరింత గర్వించేలా మరో ఏడు అద్భుతమైన ప్రకృతి వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో విజయవంతంగా చేరాయి. దీనితో తాత్కాలిక జాబితాలో భారత వారసత్వ ప్రదేశాల సంఖ్య 62 నుంచి 69కి పెరిగింది.
ఈ చేరికతో, యునెస్కో పరిశీలనలో ఇప్పుడు భారత్ నుంచి మొత్తం 69 ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 49 సాంస్కృతిక, 17 సహజ, 3 మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఈ విజయం అసాధారణమైన ప్రకృతి, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత్ కు గల నిరంతర నిబద్ధతకు నిదర్శనం.
యునెస్కో నియమావళి ప్రకారం, ప్రతిష్ఠాత్మక ప్రపంచ వారసత్వ జాబితాలో నామినేట్ కావాలంటే, ఏ ప్రదేశమైనా ముందుగా ఈ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించడం తప్పనిసరి.
కొత్తగా చేరిన ప్రదేశాల వివరాలు
1. మహారాష్ట్రలోని పంచగని, మహాబలేశ్వర్ వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్: ప్రపంచంలోనే ఎక్కువ శాస్త్రీయ అధ్యయనాలు జరిగిన లావా ప్రవాహాలివి. ప్రాధాన్యత దృష్ట్యా గొప్పగా సంరక్షించుకున్న ప్రాంతాలు. ఈ ప్రదేశాలు భారీ దక్కన్ ట్రాప్స్లోనూ, ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కోయినా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాయి.
2. కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం: అరుదైన స్తంభాకార బసాల్టిక్ రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన ఈ ద్వీప సమూహం చివరి క్రెటేషియస్ కాలం నాటిది. సుమారు 8.5 కోట్ల సంవత్సరాల కిందట నాటి ప్రాంతం.
3. మేఘాలయ యుగం గుహలు, మేఘాలయ: మేఘాలయలోని అద్భుతమైన గుహ వ్యవస్థలు, ముఖ్యంగా మావ్లూహ్ గుహ, హోలోసీన్ యుగంలో మేఘాలయ యుగానికి ప్రపంచ ప్రామాణిక కేంద్రంగా నిలిచాయి. ఇవి ముఖ్యమైన వాతావరణ, భౌగోళిక మార్పులను ప్రతిబింబిస్తాయి.
4. నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్: నాగాలాండ్లో కనిపించే భౌగోళిక అద్భుతం. సముద్ర మట్టిలో ఏర్పడిన రాళ్లు భూమి ఉపరితలానికి లేచినట్టు ఉంటాయి. భూమి పొరల్లో కదలికలు, మధ్య సముద్ర శ్రేణుల గతిపై ఇవి అవగాహనను అందిస్తాయి.
5. ఎర్ర మట్టి దిబ్బలు (ఎర్ర ఇసుక కొండలు), ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం సమీపంలో కనిపించే ఈ కళ్లు చెదిరే ఎర్రటి ఇసుక ఆకృతులు, భూ వాతావరణ చరిత్రను చురుకైన పరిణామ క్రమాన్ని ప్రతిబింబించే ప్రత్యేక వాతావరణ, తీరప్రాంత భూభౌగోళిక లక్షణాలను ఆవిష్కరిస్తాయి.
6. తిరుమల కొండల ప్రకృతి వారసత్వం, ఆంధ్రప్రదేశ్: ఎపార్కియన్ అన్కన్ఫార్మిటీ, ప్రతిష్ఠాత్మకమైన శిలాతోరణం కలిగి ఉన్న ఈ స్థలం... భూమి చరిత్రలో 1.5 బిలియన్ సంవత్సరాలకు పైగా గల భూగర్భ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే అపారమైన భౌగోళిక విలువను కలిగి ఉంది.
7. వర్కల క్లిఫ్స్, కేరళ: కేరళ తీరప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ అందమైన కొండచరియలు, మియో ప్లియోసీన్ యుగానికి చెందిన వర్కల్లి ఫార్మేషన్ ను వివరిస్తాయి. ఇవి సహజసిద్ధమైన ఊటలు. ఆకర్షణీయమైన కోత భూరూపాలతో శాస్త్రీయంగా, పర్యాటకపరంగా ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి.
ప్రపంచ వారసత్వం పట్ల భారత్ నిబద్ధత
తాత్కాలిక జాబితాలో ఈ ప్రదేశాలను చేర్చడం ప్రపంచ వారసత్వ జాబితాకు భవిష్యత్తు నామినేషన్ల దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ప్రకృతి అద్భుతాలను ప్రపంచ వారసత్వ పరిరక్షణ ప్రయత్నాలతో ఏకీకృతం చేయడంపై భారత వ్యూహాత్మక దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది.
భారతదేశం తరపున ప్రపంచ వారసత్వ సదస్సుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నామినేషన్ల సంకలనం, సమర్పణలో కీలక పాత్ర పోషించింది. పారిస్ లోని యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి ఈ ప్రయత్నంలో అంకితభావంతో పనిచేసినందుకు ఏఎస్ఐని అభినందించారు.
జూలై 2024లో న్యూఢిల్లీలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సదస్సుకు భారత్ సగర్వంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 140 పైగా దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.
Click here to see Seven Sites in the Tentative List of World Heritage
***
(रिलीज़ आईडी: 2168379)
आगंतुक पटल : 43