మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో 2025-26 సంవత్సరానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తుల సమర్పణ గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు
प्रविष्टि तिथि:
16 SEP 2025 12:49PM by PIB Hyderabad
2025-26 సంవత్సరానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్) కోసం ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ)లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు.
విద్యార్థులు దరఖాస్తులను సమర్పించడం కోసం ఎన్ఎస్‌పీ పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్ట్ సంవత్సరం 2025-26లో ఎంపికైన విద్యార్థులు మొదట ఎన్ఎస్‌పీలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ఎంచుకున్న స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ఎస్‌పీలో రిజిస్ట్రేషన్ కోసం తరచుగా అడిగే ప్రశ్నల వివరాలు https://scholarships.gov.in/studentFAQs పై అందుబాటులో ఉంటాయి.
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం అమలు చేసే 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ పథకం' ద్వారా.. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాథమిక స్థాయితో అంటే 8వ తరగతి తర్వాత చదువు మానేయడాన్ని అరికట్టడం కోసం, వారు ఉన్నత మాధ్యమిక స్థాయి అంటే 12వ తరగతి వరకు చదువును పూర్తి చేసేలా ప్రోత్సహించడం కోసం ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్వహించే స్కాలర్‌షిప్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఒక లక్ష కొత్త ఉపకార వేతనాలను అందిస్తారు. చదువులో విద్యార్థి ప్రతిభ ఆధారంగా 10 నుంచి 12వ తరగతి వరకు పునరుద్ధరణ విధానంలో ఈ స్కాలర్‌షిప్ కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి అందించే స్కాలర్‌షిప్ మొత్తం రూ. 12000.
భారత ప్రభుత్వం విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్ పథకాల కోసం వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ) ద్వారా ఈ ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్‌ను అమలు చేస్తున్నారు. ఆగస్టు 30వ తేదీ నాటికి 85,420 కొత్త, 1,72,027 పునరుద్ధరణ దరఖాస్తులను సమర్పించారు.
ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్ స్కాలర్‌షిప్‌లను డీబీటీ విధానాన్ని అనుసరించి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎమ్ఎస్) ద్వారా ఎంపిక చేసిన విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ బదిలీ విధానంలో నేరుగా పంపిణీ చేస్తారు. స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 3.50 లక్షలకు మించకూడదు. స్కాలర్‌షిప్ అవార్డు కోసం ఎంపిక పరీక్షకు హాజరు కావడానికి 7వ తరగతి పరీక్షలో కనీసం 55 శాతం మార్కులుగానీ, తత్సమాన గ్రేడ్ గానీ కలిగి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది).
ఎన్ఎస్‌పీ పోర్టల్‌లో ఎంపిక చేసిన విద్యార్థుల స్కాలర్‌షిప్ దరఖాస్తులను రెండు స్థాయిల్లో ధ్రువీకరిస్తారు. లెవల్-1 (ఎల్1) ధ్రువీకరణ ఇనిస్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (ఐఎన్ఓ) వద్ద, లెవల్-2 (ఎల్2) ధ్రువీకరణ జిల్లా నోడల్ ఆఫీసర్ (డీఎన్ఓ) వద్ద జరుగుతుంది. ఐఎన్ఓ స్థాయి (ఎల్1) ధ్రువీకరణకు గడువు 15.10.2025, డీఎన్ఓ స్థాయి (ఎల్2) ధ్రువీకరణకు గడువు 31.10.2025గా ఉంది.
***
(रिलीज़ आईडी: 2167415)
आगंतुक पटल : 120