లోక్‌సభ సచివాలయం
వికసిత భారత్ లక్ష్య సాధనకు మహిళల ఆర్థిక సాధికారతే పునాది
· మహిళా సాధికారతపై తిరుపతిలో నిర్వహించిన శాసనసభా కమిటీల తొలి జాతీయ సమావేశంలో స్పష్టం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా · “లింగ ప్రతిస్పందనాత్మక బడ్జెట్ రూపకల్పన ఓ సామాజిక-ఆర్థిక నమూనా” · “వికసిత భారత్ సాకారంలో మహిళల సారథ్యాన పురోగమనమే కీలకం” · మహిళల విద్య.. ఆరోగ్యం.. వ్యవస్థాపన.. డిజిటల్ సార్వజనీనతలను నిర్దేశించిన ‘తిరుపతి తీర్మానానికి’ ఆమోదం · ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మహిళా సాధికారతపై శాసనసభా కమిటీల తొలి జాతీయ సమావేశం ముగింపు
Posted On:
15 SEP 2025 4:10PM by PIB Hyderabad
వికసిత భారత్ లక్ష్య సాధనకు మహిళల సుస్థిర ఆర్థిక సాధికారత పునాది వంటిదని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో నిర్వహించిన పార్లమెంటరీ-శాసనసభ కమిటీల తొలి జాతీయ సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కూడా ముగింపు ప్రసంగం చేశారు. అనంతరం కమిటీల సంయుక్త నిర్ణయాలను ‘తిరుపతి తీర్మానం’ పేరిట ఆమోదించడంతో సమావేశం ముగిసింది.
మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించిన ఈ చారిత్రక సమావేశం చివరన ఆయన తన అభిప్రాయాలను సభికులతో పంచుకున్నారు. మహిళా సాధికారత అన్నది సామాజిక అవసరం మాత్రమే కాదని, అది ఆర్థిక ఆవశ్యకతని విశదీకరించారు. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, వ్యవస్థాపన తదితరాలపై అన్ని విధాలుగా శ్రద్ధ చూపాలన్నారు. తద్వారా దేశం తన విస్తృత మానవ మూలధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర సామాజిక-ఆర్థిక నమూనాతో పురోగమనానికి బాటలు వేయగలదన్నారు.
మన దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందడంలో మహిళల నాయకత్వం, సహకారం ఎంతో కీలకమని శ్రీ బిర్లా చెప్పారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్రాల చట్టసభల సభ్యులు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకునేందుకు ఇలాంటి సమావేశాలు వేదికగా ఉంటాయన్నారు.
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ- మన దేశంలో ప్రజాస్వామ్యం ఓ రాజకీయ వ్యవస్థకు పరిమితం కాదని, నాగరికత విలువల సహిత జీవన విధానమని లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారత్ అనాదిగా పరిగణనలో ఉందని, సమానత్వం, సంవాదం, సమ భాగస్వామ్య సూత్రాల అమలుకు నెలవని చెప్పారు. దేశ సాంస్కృతిక, సామాజిక మూలాల్లో ప్రజాస్వామ్యం లోతుగా పాదుకున్నదని ఆయన వివరించారు.
మహిళా సాధికారతను సంక్షేమానికి పరిమితం చేయరాదని, జాతీయ పురోగమనానికి పునాదిగా పరిగణించాలని శ్రీ బిర్లా పునరుద్ఘాటించారు. మహిళల విద్యకు పెద్దపీట వేయడం ద్వారా వారి విముక్తి కోసం పోరాడిన సావిత్రిబాయి ఫూలే వంటి సంస్కర్తల మార్గదర్శక పాత్రను ఆయన గుర్తుచేశారు. అలాగే 100 శాతం అక్షరాస్యత సాధించడంలో భాగంగా మహారాష్ట్రలోని గ్రామీణ వృద్ధ మహిళలతో అక్షరాభ్యాసం చేయించిన పాఠశాలలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. సమకాలీన విధానాలకు ఇటువంటి కార్యక్రమాలే ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు.
గ్రామీణ, వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన మహిళల విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- అవకాశాలు లభిస్తే పరిణామాత్మక ఫలితాలు సాధ్యమని విద్య, వ్యవస్థాపన సహా సామాజిక నాయకత్వంలో మహిళల నైపుణ్యం రుజువు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇటువంటి అవకాశాలను సమాజంలోని ప్రతి రంగానికీ విస్తరించే దిశగా వినూత్న కృషికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. తద్వారా దేశ పురోగమనంలో సమాన వాటాదారులుగా మహిళలు తమవంతు పాత్రను సమర్థంగా పోషించగలరని చెప్పారు.
లింగ ప్రతిస్పందనాత్మక బడ్జెట్ రూపకల్పన ద్రవ్య విధానానికి పరిమితం కాదని, మహిళల అవసరాలను జాతీయ ప్రగతి వ్యూహంతో సంధానించే సామాజిక-ఆర్థిక నమూనాగా దాన్ని పరిగణించాలని శ్రీ ఓం బిర్లా స్పష్టం చేశారు. బడ్జెట్లు సామాజిక న్యాయ ఉపకరణాలుగా మారితే మహిళలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యం, జీవనోపాధిలో సమాన వాటా లభ్యతకు భరోసా లభిస్తుందన్నారు. తద్వారా వృద్ధి వైపు దేశ ప్రయాణంలో భాగస్వాములై నాయకత్వం వహించడానికి కూడా వారు ముందుకు రాగలరని చెప్పారు. వనరుల కేటాయింపులో లింగ దృక్కోణాన్ని అనుసరిస్తూ మహిళల సమస్యలకు పరిధులు గీయకుండా ప్రధాన ప్రణాళికలలో వాటిని భాగం చేయాలని ఆయన సూచించారు.
కేంద్ర, రాష్ట్రాల మంత్రిత్వ శాఖల్లో లింగ బడ్జెట్ విభాగాలను సంస్థాగతం చేయాలని శ్రీ ఓం బిర్లా అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యం, వ్యవస్థాపన, రుణ లభ్యత వగైరాల కోసం కేటాయింపులు పెంచుతూ, లింగ-విభజిత సమాచారం ద్వారా ఫలితాలను పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యల ద్వారా సామాజిక న్యాయం, సార్వజనీన వృద్ధికి బడ్జెట్లు సాధనాలు కాగలవని పేర్కొన్నారు.
వినూత్న సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత అవకాశాలు-సవాళ్లను ప్రస్తావిస్తూ... నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికంగా ఎంతమాత్రం వెనుకబడరాదని శ్రీ బిర్లా సూచించారు. మహిళలను చురుకైన సాంకేతికత సృష్టికర్తలుగా శక్తిమంతం చేయాలంటే డిజిటల్ అంతరం తగ్గింపు, సైబర్ భద్రతకు భరోసా, డిజిటల్ అవగాహన కార్యక్రమాల విస్తరణ వంటివి ఎంతో అవసరమన్నారు. జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో వారి సమ్మిళిత భాగస్వామ్యంపై భరోసా దిశగా మునుపటి వయోజన విద్య తరహాలో మహిళల కోసం ప్రత్యేక డిజిటల్ అవగాహన కార్యక్రమాలను రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు.
సమావేశంలో చివరగా- మహిళా సాధికారతకు మరింత ప్రాధాన్యమిస్తూ స్పష్టమైన ప్రణాళికను నిర్దేశిస్తున్న ‘తిరుపతి తీర్మానం’ ఏకగ్రీవ ఆమోదం పొందింది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో లింగ దృక్కోణం వర్తింపు ద్వారా ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, వ్యవస్థాపనకు కేటాయింపుల పెంపుతోపాటు లింగ ప్రతిస్పందనాత్మక బడ్జెట్ సంస్థాగతీకరణ, జాతీయ-రియు రాష్ట్ర స్థాయులలో సాంకేతిక సామర్థ్య బలోపేతం తదితరాల అవసరాన్ని ఈ తీర్మానం స్పష్టంగా నిర్వచించింది. డిజిటల్ అంతరం తగ్గింపు, ‘స్టెమ్’ (ఎస్‌టీఈఎం) రంగాల్లో మహిళల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, సైబర్ భద్రతకు భరోసా, డిజిటల్ అవగాహన కార్యక్రమాల విస్తరణ, మహిళలను చురుకైన సాంకేతికత సృష్టికర్తలుగా తీర్చిదిద్దడంపైనా తీర్మానం నిబద్ధత ప్రకటించింది. దేశ పురోగమనానికి మహిళల సారథ్యం, భాగస్వామ్యం కీలకమని పేర్కొంది. జాతీయ వృద్ధి సహా వికసిత భారత్ సాకారంలో మహిళల సారథ్యాన పురోగమనమే కీలకమని స్పష్టం చేసింది. అంతిమంగా మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, స్వావలంబన సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనింది.
***
(Release ID: 2167053)
|