రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నౌకాదళ క్విజ్ పోటీ ‘థింక్ -2025’కు అద్భుత స్పందన
Posted On:
12 SEP 2025 2:25PM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న క్విజ్ పోటీ ‘థింక్ (టీహెచ్ఐఎన్‌క్యు) 2025’కు అద్భుత ప్రతిస్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నమోదు ప్రక్రియను దేశం నలుమూలల నుంచి 35,470 బృందాలు పూర్తి చేశాయి. 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, యువజనులతో పాటు భావి కాలపు అగ్రగామి ప్రతిభావంతులు మన దేశ నౌకాదళాన్ని గురించి సమగ్రంగా అవగాహనను ఏర్పరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ క్విజ్‌ను రూపొందించారు. గత జూన్ 10న నమోదు ప్రక్రియను ప్రారంభించడంతో ఈ క్విజ్ ప్రయాణం మొదలైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులే కాక విద్య బోధన సంస్థలు కూడా ఈ క్విజ్ పోటీపై ఎంతో ఆసక్తినీ, ఉత్సాహాన్ని కనబరిచాయి.
ఈ క్విజ్ పోటీలో సెమీఫైనల్‌కు చేరడానికి ప్రస్తుతం ఎలిమినేషన్ దశల్లో పాఠశాలలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఎలిమినేషన్ దశ పూర్తి అయిన తరువాత, 16 బృందాలు సెమీఫైనల్ దశ, ఆ తరువాత ఫైనల్‌కు చేరుకొంటాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్.. ఈ రెండు పోటీలనూ కేరళలోని ఏళిమలలో గల ప్రతిష్ఠాత్మక శిక్షణ సంస్థ ‘ఇండియన్ నేవల్ అకాడమీ’లో నవంబరు 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు.
క్విజ్ పోటీ థింక్ (టీహెచ్ఐఎన్‌క్యు) 2025లో పాల్గొనే పాఠశాల బృందాలన్నిటికీ భారతీయ నౌకాదళం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
***
(Release ID: 2166167)
Visitor Counter : 2