భారత ఎన్నికల సంఘం
ఉపరాష్ట్రపతి ఎన్నిక – 2025
Posted On:
10 SEP 2025 5:30PM by PIB Hyderabad
పదిహేడో ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను 2025 ఆగస్టు 1న విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా కమిషన్ తెలియజేసింది. పోలింగ్, లెక్కింపు జరిగే తేదీగా 2025, సెప్టెంబర్ 9ను నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం.. 2025 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్థులో ఉన్న వసుధ, రూం నెం. ఎఫ్-101లో పోలింగ్ జరిగింది. అర్హత కలిగిన మొత్తం 781 ఓటర్లలో 767 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 15 బ్యాలెట్ పత్రాలను చెల్లనివిగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం తదుపరి భారత ఉపరాష్ట్రపతిగా 2025, సెప్టెంబర్ 9న శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. 2025 ఆగస్టు 7న గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణతో మొదలైన ఈ ప్రక్రియ గణతంత్ర భారత దేశానికి పదిహేనో ఉపరాష్ట్రపతిగా శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఎన్నికైనట్లు ధ్రువపత్రంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఈ రోజు సంతకం చేయడంతో ముగిసింది. అనంతరం సంతకం చేసిన కాపీని కేంద్ర హోం కార్యదర్శికి, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ శ్రీ భాను ప్రకాశ్ ఏటూరు, కార్యదర్శి శ్రీ సుమన్ కుమార్ దాస్ అందజేశారు. ఈ ధ్రువీకరణ పత్రాన్ని భారత నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార సమయంలో చదివి వినిపిస్తారు.
ఈ ఎన్నికను విజయంతంగా నిర్వహించడంలో సహకారాన్ని అందించిన రిటర్నింగ్ అధికారి, ఈసీఐ పరిశీలకులు, ఢిల్లీ పోలీసు, సీఆర్పీఎఫ్ బృందాన్ని కమిషన్ ప్రశంసించింది.
***
(Release ID: 2165548)
Visitor Counter : 46