ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జీఎస్టీలో తాజా సంస్కరణలతో ఎగబాకనున్న గిరాకీ.. దేశీయ తయారీకి ప్రోత్సాహం.. మరిన్ని ఉద్యోగావకాశాలు
త్వరలోనే ప్రపంచ స్థాయి వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకోనున్న
భారత ఎలక్ట్రానిక్ అనుబంధ విస్తారిత వ్యవస్థ
ఏసీలూ, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లతో పాటు పవర్ బ్యాంకులపై తగ్గిన జీఎస్టీ....
డిజిటల్ వృద్ధికీ, అందుబాటు ధరల్లో ఐసీటీ హార్డ్‌వేర్‌కూ అవకాశాలు
Posted On:
09 SEP 2025 4:20PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞానశాఖలో భాగంగా ఉన్న రంగాలు, మరీముఖ్యంగా వినియోగదారు కేంద్రీకృత ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐసీటీ) హార్డ్‌వేర్ రంగాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఇటీవల తీసుకువచ్చిన కొత్త సంస్కరణలతో అండదండలు లభించనున్నాయి. రేట్లలో తగ్గింపు ఫలితంగా ఎలక్ట్రానిక్ ఉత్పాదనలు ప్రజలకు చౌక ధరల్లో దొరుకుతాయి. దీనికి తోడు దేశీయ తయారీ రంగానికీ మద్దతు లభిస్తుంది. మరో వైపు డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధన కూడా వేగం పుంజుకోనుంది.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊతం
ఎయిర్ కండిషనర్లు, డిష్వాషర్లు, పెద్ద తెర టెలివిజన్లు (ఎల్‌సీడీతో పాటు ఎల్ఈడీ టీవీల)పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినందువల్ల చౌక ధరలకు లభించే ఈ వస్తువులు మరిన్ని కుటుంబాలకు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిణామం కంప్రెషర్లు, డిస్ప్లేలు, సెమీకండక్లర్ల వంటి అంతర్భాగాల తెరవెనుక ఉండే వ్యవస్థ బలపడడానికీ తోడ్పాటును అందించగలదని భావిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్స్, వైరింగ్, కూలింగ్ వ్యవస్థలు, ఎల్ఈడీ ప్యానల్స్‌తో పాటు అసెంబ్లీ సేవలతో ముడిపడ్డ ఎంఎస్ఎంఈలకు కూడా కొత్త అవకాశాలు అందివస్తాయి. ఈ సంస్కరణలు స్థానిక తయారీని ప్రోత్సహించడం ఖాయం. దీంతో, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. డిష్ వాషర్లపై జీఎస్టీ తగ్గించడం కుటుంబాల జీవన స్థాయిని మెరుగుపరచనుంది.
డిజిటల్ అభివృద్ధికి ఉత్తేజంతో పాటు ఐసీటీ హార్డ్‌వేర్ లభ్యత
టీవీలతో సంబంధం ఉండని మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో విద్యాసంస్థలు, కార్యాలయాలుతో పాటు డిజిటల్ శిక్షణ కేంద్రాలకు ఖర్చులు తగ్గుతాయి. చౌకగా లభ్యమయ్యే ఐసీటీ హార్డ్‌వేర్.. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం, అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ లతో పాటు డిజిటల్ విద్య రంగానికి కూడా ప్రోత్సాహాన్ని అందించనుంది. ఇదే విధంగా పవర్ బ్యాంకులు సహా లిథియం, అయానేతర ఎలక్ట్రిక్ అక్యుములేటర్లపై జీఎస్టీని 28 శాతం స్థాయి నుంచి 18 శాతం స్థాయికి పరిమితం చేయడంతో ఇంధన నిల్వ సేవలు మరింత చౌక ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా డిజిటల్ ఉపకరణాలకు బ్యాకప్ పవర్ మెరుగుపడుతుంది. ఇళ్లు, కార్యాలయాల్లో సమర్థ ఇంధన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు.
ఈ సంస్కరణలు ఆంతరంగిక భద్రతకు సంబంధించిన కమ్యూనికేషన్ మౌలిక స్వరూపాన్ని కూడా బలపరచనున్నాయి. రెండు వైపుల ప్రసారాలకు వాకీ-టాకీలపై జీఎస్టీ 12 శాతం ఉండగా దానిని 5 శాతానికి తగ్గించారు. దీంతో పోలీసు, పారామిలటరీ, రక్షణ దళాలకు కొనుగోలు ఖర్చులు తగ్గుతాయి.
పునరుత్పాదక ఇంధనానికీ, సుస్థిరత్వానికీ మద్దతు
పునరుత్పాదక ఇంధన ఉపకరణాలు, సౌరశక్తి ఆధారిత ఫోటోవోల్టాయిక్ సెల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ఇళ్లలోను, పారిశ్రామిక స్థాయిలోను పునరుత్పాదక ఇంధన వినియోగ ఖర్చు చాలావరకు తగ్గనుంది. కంపోస్టింగ్ యంత్రాలపై కూడా ఇక 12 శాతానికి బదులు 5 శాతం జీఎస్టీనే వర్తించనుంది. ఇది వ్యర్థపదార్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలతో పాటు కంపోస్టింగ్ సాంకేతికతలకు దన్నుగా ఉండే చర్య అని చెప్పవచ్చు.
ఈ సంస్కరణలతో భారత ఎలక్ట్రానిక్స్, సాంకేతిక విజ్ఞాన అనుబంధ విస్తారిత వ్యవస్థలోని విభిన్న రంగాల్లో వృద్ధి జోరందుకొంటుందని భావిస్తున్నారు. గిరాకీ పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఎంఎస్ఎంఈలకూ, దేశీయ తయారీదారు సంస్థలకూ కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. దీంతో జీఎస్టీ రేట్లలో తగ్గింపులు ఉపాధికల్పనకు తోడ్పడి, స్థానిక తయారీకి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడడమే కాకుండా ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థల్లో భారత్ భాగం పంచుకొనే ప్రక్రియ కూడా వేగాన్ని అందుకొంటుంది.
***
(Release ID: 2165201)