జౌళి మంత్రిత్వ శాఖ
2025-26 ఖరీఫ్ సీజన్ కోసం పత్తి ఎంఎస్పీ ఏర్పాట్ల సన్నద్ధతను సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
· కొనుగోలు కేంద్ర కార్యకలాపాల కోసం తొలిసారిగా నిబంధనల ప్రకటన:
పత్తి పండించే ప్రధాన రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 550 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
· ఈ సీజన్ నుంచి ‘కపాస్-కిసాన్’ మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా
రైతుల స్వీయ నమోదు, స్లాట్ బుకింగ్
Posted On:
03 SEP 2025 10:53AM by PIB Hyderabad

కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ అధ్యక్షతన 2025 సెప్టెంబరు 2న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జౌళీ శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, సంయుక్త కార్యదర్శి (ఫైబర్) శ్రీమతి పద్మినీ సింగ్లా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీ శ్రీ లలిత్ కుమార్ గుప్త, జౌళి మంత్రిత్వ శాఖతోపాటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇతర సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 2025 అక్టోబరు 1 నుంచి మొదలవుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్- 2025-26లో పత్తికి కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) సంబంధించి ఏర్పాట్ల సంసిద్ధతను అంచనా వేయడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారు.
పత్తి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ పునరుద్ఘాటించారు. సకాలంలో, పారదర్శకంగా, రైతు కేంద్రీకృత సేవలను అందించడంపై దృష్టి సారిస్తూ.. ఎంఎస్పీ మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే పత్తినంతటినీ అంతరాయం లేకుండా కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను అందించడం ద్వారా పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సాంకేతికత దిశగా మళ్లించేలా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా.. ఎంఎస్పీ కార్యకలాపాల కింద కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు నుంచి నిల్వ, అమ్మకం వరకు- అన్ని ప్రక్రియలూ ఇప్పుడు పూర్తిగా ప్రత్యక్ష ప్రమేయం, భౌతిక పత్రాల అవసరం లేకుండానే పూర్తవుతున్నాయి. ఇది ఎంఎస్పీ కార్యకలాపాలపై రైతులు, ఇతర భాగస్వాముల విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.

పత్తి సాగు విస్తీర్ణం, ఉపయోగంలో ఉన్న ఏపీఎంసీ యార్డుల లభ్యత, పత్తి కొనుగోలు కేంద్రంలో కనీసం ఒక స్టాక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లభ్యత వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం తొలిసారిగా ఏకరూప నిబంధనలు రూపొందించారు. ఫలితంగా, పత్తి ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎంఎస్పీ కింద పత్తి కొనుగోళ్లు ఉత్తరాది రాష్ట్రాల్లో 2025 అక్టోబర్ 1 నుంచి, మధ్య రాష్ట్రాల్లో అక్టోబర్ 15 నుంచి, దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ 21 నుంచి మొదలవుతాయి.
దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారంగా పత్తి రైతుల స్వీయ నమోదు, 7 రోజుల రోలింగ్ స్లాట్ బుకింగు కోసం ఈ సీజన్ నుంచి కొత్తగా ప్రారంభించిన ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్ ద్వారా అవకాశం కల్పించనున్నారు. సేకరణ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, పారదర్శకత, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు వీలు కల్పించడం ఈ డిజిటల్ వేదిక లక్ష్యం. గతేడాది ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ ఆధారిత చెల్లింపు సమాచార సేవలు కూడా కొనసాగుతాయి.
క్షేత్రస్థాయిలో మద్దతును మరింతగా పెంచడం కోసం.. తక్షణ ఫిర్యాదుల పరిష్కారం లక్ష్యంగా ప్రతి ఏపీఎంసీ మండీలో రాష్ట్రాలు స్థానిక పర్యవేక్షణ కమిటీలు (ఎల్ఎంసీ) ఏర్పాటు చేస్తాయి. సేకరణ జరిగినన్ని రోజులూ ప్రత్యేక రాష్ట్రస్థాయి హెల్ప్ లైన్లు, కేంద్ర సీసీఐ హెల్ప్ లైన్ క్రియాశీలంగా పనిచేస్తాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచడం, రవాణాపరంగా సహకారంతోపాటు ఇతర మౌలిక వసతులను పత్తి సీజన్ ప్రారంభానికి ముందే అందిస్తామన్నారు.

***
(Release ID: 2163453)
Visitor Counter : 2