ప్రధాన మంత్రి కార్యాలయం
2025 వ సంవత్సరం ఆగస్టు 31 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 125 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
31 AUG 2025 11:44AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈ వర్షాకాలంలో, ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయి. గత కొన్ని వారాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి భారీ విధ్వంసాలను మనం చూశాం. కొన్ని చోట్ల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. మరి కొన్ని చోట్ల పొలాలు మునిగిపోయాయి, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజల జీవితాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ సంఘటనలు ప్రతి భారతీయుడిని బాధపెట్టాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధ మనందరికీ బాధ. సంక్షోభం ఎక్కడ వచ్చినా మన NDRF-SDRF సిబ్బంది, ఇతర భద్రతా దళాలు అక్కడి ప్రజలను రక్షించడానికి రాత్రింబగళ్ళు పనిచేశాయి. సైనికులు సాంకేతిక పరిజ్ఞానం సహాయం కూడా తీసుకున్నారు. థర్మల్ కెమెరాలు, లైవ్ డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్ నిఘా వంటి అనేక ఆధునిక వనరుల సహాయంతో సహాయ చర్యలను వేగవంతం చేయడానికి కృషి జరిగింది.
ఈ సమయంలో హెలికాప్టర్ ద్వారా సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. గాయపడిన వారిని విమానంలో తరలించారు. విపత్తు సమయంలో సైన్యం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులు, పరిపాలనా యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో సాధ్యమైనంత కృషి చేశారు. ఈ క్లిష్ట సమయంలో మానవత్వాన్ని అన్నింటికంటే ఉన్నత స్థానంలో ఉంచిన ప్రతి పౌరుడికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! వరదలు, వర్షాల విధ్వంసం మధ్య జమ్మూ- కాశ్మీర్ కూడా రెండు ప్రత్యేకమైన విజయాలను సాధించింది. చాలా మంది వాటిని గమనించలేదు. కానీ మీరు ఆ విజయాల గురించి తెలుసుకున్నప్పుడు మీరు చాలా సంతోషిస్తారు. జమ్మూ - కాశ్మీర్‌లోని పుల్వామాలోని ఒక స్టేడియంలో రికార్డు సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. పుల్వామా మొదటి డే-నైట్ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. గతంలో ఇది అసాధ్యం. కానీ ఇప్పుడు నా దేశం మారుతోంది. ఈ మ్యాచ్ 'రాయల్ ప్రీమియర్ లీగ్'లో భాగం. దీనిలో జమ్మూ- కాశ్మీర్‌లోని వివిధ జట్లు ఆడుతున్నాయి. పుల్వామాలో రాత్రిపూట వేలాది మంది ముఖ్యంగా యువత క్రికెట్ ఆస్వాదిస్తోంది. ఈ దృశ్యం నిజంగా చూడదగినది.
మిత్రులారా! మన దృష్టిని ఆకర్షించిన రెండవ కార్యక్రమం దేశంలో జరిగిన మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. అది కూడా శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగింది. నిజంగా అటువంటి ఉత్సవాన్ని నిర్వహించడానికి అది సరైన ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. జమ్మూ కాశ్మీర్‌లో జల క్రీడలను మరింత ప్రాచుర్యం పొందేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం నలుమూలల నుండి 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు కూడా ఇందులో వెనుకబడి లేరు. వారి భాగస్వామ్యం కూడా పురుషుల భాగస్వామ్యంతో దాదాపు సమానంగా ఉంది. ఇందులో పాల్గొన్న అందరు క్రీడాకారులను నేను అభినందిస్తున్నాను. అత్యధిక పతకాలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ జట్టుకు ప్రత్యేక అభినందనలు. హర్యానా, ఒడిషా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అక్కడి ప్రజల ఆప్యాయత, ఆతిథ్యాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను.
మిత్రులారా! ఈ ఈవెంట్ అనుభవాన్ని మీకు తీసుకురావడానికి ఇందులో పాల్గొన్న ఇద్దరు క్రీడాకారులతో మాట్లాడాలని నేను అనుకున్నాను. వారిలో ఒకరు ఒడిషాకు చెందిన రష్మితా సాహు, మరొకరు శ్రీనగర్‌కు చెందిన మొహ్సిన్ అలీ, వారు ఏం చెప్తారో విందాం.
ప్రధాన మంత్రి: రష్మిత గారూ.. నమస్తే!
రష్మితా: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: జై జగన్నాథ్.
రష్మిత: జై జగన్నాథ్ సర్.
ప్రధాన మంత్రి: రష్మిత గారూ.. క్రీడా ప్రపంచంలో మీ విజయానికి ముందుగా మీకు చాలా అభినందనలు.
రష్మిత: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: రష్మిత గారూ.. మా శ్రోతలు మీ గురించి, మీ క్రీడా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను. చెప్పండి!
రష్మిత: సర్.. నా పేరు రష్మిత సాహు. మాది ఒడిషా. నేను కానోయింగ్ క్రీడాకారిణిని. నేను 2017 లో క్రీడలలో చేరి, కానోయింగ్ ప్రారంభించాను. జాతీయ స్థాయిలో జాతీయ ఛాంపియన్‌షిప్ లో, జాతీయ క్రీడలలో పాల్గొన్నాను. నాకు 41 పతకాలు వచ్చాయి. వాటిలో 13 బంగారు, 14 వెండి, 14 కాంస్య పతకాలు సర్.
ప్రధానమంత్రి: మీరు ఈ క్రీడపై ఆసక్తిని ఎలా పెంచుకున్నారు? మొదట మిమ్మల్ని దీని వైపు ఎవరు ప్రేరేపించారు? మీ కుటుంబంలో క్రీడా వాతావరణం ఉందా?
రష్మిత: లేదు సార్. మా గ్రామంలోనే క్రీడల వాతావరణం లేదు. ఒకసారి నదిలో బోటింగ్ జరుగుతుంటే నేను ఈతకు వెళ్ళాను. నేను, నా స్నేహితులు ఈత కొడుతున్నాం. అప్పుడే కానోయింగ్-కయాకింగ్ కోసం ఒక పడవ వెళ్ళింది. దాని గురించి నాకు ఏమీ తెలియదు. కాబట్టి నేను నా స్నేహితులను అడిగాను. ఇది ఏమిటి అని. జగత్‌పూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ వారి స్పోర్ట్స్ సెంటర్ ఉందని, అక్కడ క్రీడలు నిర్వహిస్తారని, తను కూడా అక్కడికి వెళ్తానని నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది ఏమిటో నాకు తెలియదు. పిల్లలు నీటిలో దీన్ని ఎలా చేస్తారో? బోటింగ్ చేస్తారా? నేను కూడా వెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. ఎలా వెళ్లాలో నాకు కూడా చెప్పండి అని అడిగాను. అక్కడికి వెళ్లి మాట్లాడమని అతడు నాకు చెప్పాడు. అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్లి “నాన్నా.. నేను వెళ్ళాలి, నాన్నా.. నేను వెళ్ళాలి” అని అడిగాను. అప్పుడు నాన్న సరే అని చెప్పి నన్ను తీసుకువచ్చాడు. ఆ సమయంలో ట్రయల్ లేదు. అప్పుడు కోచ్ ఫిబ్రవరిలో ట్రయల్స్ జరుగుతాయని, ఫిబ్రవరి, మార్చిలో ట్రయల్ సమయంలో రావచ్చని చెప్పాడు. అప్పుడు నేను ట్రయల్ సమయంలో వచ్చాను.
ప్రధాన మంత్రి: సరే రష్మితా! కాశ్మీర్‌లో జరిగిన ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’లో మీ అనుభవం ఎలా ఉంది? మీరు మొదటిసారి కాశ్మీర్‌కు వెళ్లారా?
రష్మితా: అవును సర్.. నేను మొదటిసారి కాశ్మీర్‌కు వెళ్లాను. మొదటి ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ అక్కడ జరిగింది. నాకు అందులో రెండు ఈవెంట్లు ఉన్నాయి. సింగిల్స్ 200 మీటర్లు, 500 మీటర్ల డబుల్స్. నేను రెండింటిలోనూ బంగారు పతకాలు గెలుచుకున్నాను సర్.
ప్రధాన మంత్రి: ఓహ్ వావ్! మీరు రెండింటినీ గెలుచుకున్నారా?
రష్మిత: అవును సర్.
ప్రధాన మంత్రి: చాలా చాలా అభినందనలు.
రష్మిత: ధన్యవాదాలు సర్.
ప్రధాన మంత్రి: సరే రష్మితా: వాటర్ స్పోర్ట్స్ కాకుండా మీకు ఇంకా ఏమేం హాబీలు ఉన్నాయి.
రష్మిత: వాటర్ స్పోర్ట్స్ కాకుండా నాకు రన్నింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నేను సెలవులకు వెళ్ళినప్పుడల్లా రన్నింగ్ కు వెళ్తాను. నా పాత మైదానం నేను ఫుట్‌బాల్ ఆడటం నేర్చుకున్న ప్రదేశం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా చాలా రన్నింగ్ చేస్తాను. ఫుట్‌బాల్ కూడా ఆడతాను సర్ కొంచెం.
ప్రధాన మంత్రి: కాబట్టి క్రీడలు మీ నరాల్లోనే ఉన్నాయి.
రష్మిత: అవును సర్. నేను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చదివేటప్పుడు నేను పాల్గొన్న అన్ని ఈవెంట్లలో మొదటి స్థానంలో ఉండేదాన్ని. నేను ఛాంపియన్‌గా ఉండేదాన్ని సర్.
ప్రధాన మంత్రి: రష్మితా ! మీలాగే క్రీడలలో పురోగతి సాధించాలనుకునే వారికి మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏమిటి?
రష్మిత: సర్.. చాలా మంది పిల్లలకు తమ ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టడానికి అనుమతి లేదు. వారు బాలికలైతే వారు ఎలా బయటకు వెళతారనే ప్రశ్నలు ఎదురవుతాయి కొందరు ఆర్థిక సమస్యల కారణంగా క్రీడలను వదిలివేస్తున్నారు. ఈ ఖేలో ఇండియా పథకంలో చాలా మంది పిల్లలకు ఆర్థిక సహాయం లభిస్తుంది. చాలా మంది పిల్లలు చాలా సహాయం పొందుతున్నారు. దీని కారణంగా చాలా మంది పిల్లలు ముందుకు సాగగలుగుతున్నారు. క్రీడలను వదిలివేయవద్దని నే అందరికీ చెప్తాను. క్రీడలతో మనం చాలా దూరం వెళ్ళవచ్చు. క్రీడలు శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రీడలను ముందుకు తీసుకెళ్లడం, భారతదేశానికి పతకాలు సాధించడం మన కర్తవ్యం సర్.
ప్రధాన మంత్రి: సరే రష్మిత గారూ.. నాకు ఇది నిజంగా నచ్చింది. మీకు మరోసారి చాలా అభినందనలు. మీ నాన్నకు కూడా నా అభినందనలు తెలియజేయండి. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నప్పటికీ ఆయన ఒక కుమార్తెకు ముందుకు సాగడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
రష్మితా: ధన్యవాదాలు సర్.
ప్రధాన మంత్రి: జై జగన్నాథ్.
రష్మిత: జై జగన్నాథ్ సర్.
ప్రధాన మంత్రి: మొహ్సిన్ అలీ గారూ.. నమస్తే!
మొహ్సిన్ అలీ: నమస్తే సర్!
ప్రధాన మంత్రి: మొహ్సిన్ గారూ.. మీకు చాలా అభినందనలు. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు.
మొహ్సిన్ అలీ: ధన్యవాదాలు సార్.
ప్రధాన మంత్రి: మొహ్సిన్ గారూ... మీరు మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ లో కూడా బంగారు పతకం గెలుచుకున్న మొదటి వ్యక్తి మీరే. మీరు ఎలా భావించారు?
మొహ్సిన్ అలీ: సర్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదటిసారి కాశ్మీర్‌లో జరిగిన ఖేలో ఇండియాలో నేను బంగారు పతకం గెలుచుకున్నాను.
ప్రధాన మంత్రి: మీ కుటుంబంలో చర్చ ఏం జరుగుతోంది?
మొహ్సిన్ అలీ: చాలా చర్చ జరుగుతోంది సార్. మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది.
ప్రధానమంత్రి: మీ స్కూల్‌మేట్స్?
మొహ్సిన్ అలీ: మా స్కూల్‌మేట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. కాశ్మీర్‌లోని అందరూ “మీరు గోల్డ్ మెడలిస్ట్” అని అంటున్నారు.
ప్రధానమంత్రి: కాబట్టి మీరు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయ్యారు.
మొహ్సిన్ అలీ: అవును సార్!
ప్రధానమంత్రి: మీరు వాటర్ స్పోర్ట్స్‌లో ఆసక్తిని ఎలా పెంచుకున్నారు? దాని ప్రయోజనాలు మీకేం కనబడుతున్నాయి?
మొహ్సిన్ అలీ: నా బాల్యంలో దాల్ సరస్సులో పడవ నడపడం నేను మొదట చూశాను. “అలా చేస్తావా?” అని మా నాన్న నన్ను అడిగాడు. నాకు కూడా దానిపై ఆసక్తి ఉంది. నేను కేంద్రంలోని మేడమ్ దగ్గరికి వెళ్లాను. తరువాత మేడమ్- బిల్కిస్ మేడమ్- నాకు నేర్పించారు.
ప్రధానమంత్రి: సరే, మొహ్సిన్ గారూ.. దేశం నలుమూలల నుండి ప్రజలు వచ్చారు. మొదటిసారిగా శ్రీనగర్ దాల్ సరస్సులో జల క్రీడల కార్యక్రమం జరిగింది. ప్రజలు ఎలా భావించారు?
మొహ్సిన్ అలీ: సర్.. మేం చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ ఇది మంచి ప్రదేశం అని, ఇక్కడ అన్నీ బాగున్నాయని, సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. ఖేలో ఇండియా అంతా బాగుంది.
ప్రధాన మంత్రి: సరే..మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వెలుపల ఆడటానికి వెళ్ళారా?
మొహ్సిన్ అలీ: అవును సర్.... నేను భోపాల్, గోవా, కేరళ, హిమాచల్ లకు ఆడేందుకు వెళ్ళాను.
ప్రధాన మంత్రి: అయితే మీరు మొత్తం భారతదేశాన్ని చూశారు.
మొహ్సిన్ అలీ: అవును సార్
ప్రధాన మంత్రి: సరే, చాలా మంది ఆటగాళ్ళు అక్కడికి వచ్చారు కదా.
మొహ్సిన్ అలీ: అవును సర్..
ప్రధాన మంత్రి: మరి మీకు కొత్త స్నేహితులు దొరికారా లేదా?
మొహ్సిన్ అలీ: సర్, నాకు చాలా మంది స్నేహితులు దొరికారు. మేం ఇక్కడ దాల్ లేక్, లాల్ చౌక్‌లో కలిసి తిరిగాం. మేం అన్నిచోట్లా తిరిగాం సర్. మేం పహల్గామ్‌కు కూడా వెళ్ళాం. అన్ని చోట్లా తిరిగాం.
ప్రధాన మంత్రి: చూడండి, జమ్మూ కాశ్మీర్‌లోని క్రీడా ప్రతిభ అద్భుతంగా ఉందని నేను చూశాను.
మొహిసిన్ అలీ: అవును సర్
ప్రధాన మంత్రి: దేశాన్ని గర్వపడేలా చేసే సామర్థ్యం జమ్మూ కాశ్మీర్‌లోని మన యువతలో ఉంది. మీరు కృషి చేయడం ద్వారా దానిని నిరూపించారు.
మొహిసిన్ అలీ: సర్, ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనేది నా కల, అదే నా కల.
ప్రధాన మంత్రి: వావ్, శభాష్..
మొహిసిన్ అలీ: అది నా కల సార్.
ప్రధాన మంత్రి: చూడండి, మీ నుండి ఇది విన్నప్పుడు నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
మొహిసిన్ అలీ: సర్, అది నా కల. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనేది. దేశం కోసం జాతీయ గీతాన్ని ప్లే చేయడం.. అది నా ఏకైక కల.
ప్రధాన మంత్రి: నా దేశంలోని కార్మిక కుటుంబంలోని అబ్బాయి చాలా పెద్ద కలలు కంటున్నాడు. అంటే ఈ దేశం చాలా అభివృద్ధి చెందబోతోంది.
మోహ్సిన్ అలీ: సర్, ఇది చాలా అభివృద్ధి చెందబోతోంది. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఖేలో ఇండియా నిర్వహించినందుకు భారత ప్రభుత్వానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఇక్కడ మొదటిసారి జరిగింది సర్.
ప్రధాన మంత్రి: అందుకే మీరు మీ పాఠశాలలో కూడా ఉత్సాహంగా ఉండాలి.
మొహ్సిన్ అలీ: అవును సర్.
ప్రధాన మంత్రి: సరే మొహ్సిన్ గారూ.. మీతో మాట్లాడటం నాకు చాలా నచ్చింది. నా తరపున నేను మీ నాన్నకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా కార్మిక జీవితాన్ని గడిపి కూడా ఆయన మీ జీవితాన్ని తీర్చిదిద్దారు. మీరు మీ నాన్న మాట ప్రకారం విశ్రాంతి తీసుకోకుండా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. ఇది ఒక ఆటగాడికి గొప్ప ప్రేరణ. మీ వెనుక చాలా కష్టపడి పనిచేసిన మీ కోచ్‌ను కూడా నేను అభినందిస్తున్నాను. నా వైపు నుండి చాలా శుభాకాంక్షలు. చాలా చాలా అభినందనలు సోదరా!
మొహ్సిన్ అలీ: ధన్యవాదాలు సర్, నమస్కారాలు సర్, జై హింద్!
మిత్రులారా! ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అనే భావన దేశ ఐక్యత, దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైంది. ఖచ్చితంగా క్రీడలు అందులో పెద్ద పాత్ర పోషిస్తాయి. అందుకే నేను చెప్పేది ఏమిటంటే ఆడేవారు అభివృద్ధి చెందుతారు. మన దేశం ఎక్కువ టోర్నమెంట్లు ఆడినకొద్దీ అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. మీ ఆటగాళ్లకు, మీ మిత్రులకు నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! మీరు యూపీఎస్సీ పేరు విని ఉంటారు. ఈ సంస్థ దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్ పరీక్షను కూడా నిర్వహిస్తుంది. సివిల్ సర్వీసెస్‌లో టాపర్ల స్ఫూర్తిదాయకమైన మాటలను మనమందరం చాలాసార్లు విన్నాం. ఈ యువకులు తమ కృషితో క్లిష్ట పరిస్థితులలో చదివిన తర్వాత ఈ సర్వీసెస్ లో స్థానం పొందుతారు. కానీ, మిత్రులారా! యూపీఎస్సీ పరీక్ష గురించి మరొక నిజం ఉంది. చాలా సమర్థులైన వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు. వారి కృషి కూడా మరెవరికంటే తక్కువేమీ కాదు. కానీ వారు స్వల్ప తేడాతో తుది జాబితాను చేరుకోలేకపోతున్నారు. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలకు కొత్తగా సిద్ధం కావాలి. దీనికి వారి సమయం, డబ్బు రెండూ ఖర్చవుతాయి. అందుకే ఇప్పుడు అలాంటి ఆశావహ విద్యార్థుల కోసం ఒక డిజిటల్ వేదిక రూపకల్పన జరిగింది. దాని పేరు 'ప్రతిభా సేతు'.
'ప్రతిభా సేతు'లో వివిధ యూపీఎస్సీ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణులై, తుది మెరిట్ జాబితాలో స్థానం పొందలేని అభ్యర్థుల డేటా ఉంటుంది. ఈ పోర్టల్‌లో పదివేల మందికి పైగా ఆశావహులైన యువత డేటాబ్యాంక్ ఉంది. కొందరు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యారు. కొందరు ఇంజనీరింగ్ సర్వీసుల్లోకి వెళ్లాలని కోరుకున్నారు. కొందరు వైద్య సేవల ప్రతి దశను ఉత్తీర్ణులై ఫైనల్‌లో ఎంపిక కాలేదు. అటువంటి అభ్యర్థులందరి సమాచారం ఇప్పుడు 'ప్రతిభా సేతు' పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు ఈ ఆశావహ విద్యార్థుల సమాచారాన్ని ఈ పోర్టల్ నుండి తీసుకొని వారికి ఉపాధి కల్పించవచ్చు. మిత్రులారా! ఈ ప్రయత్నంలో ఫలితాలు కూడా రావడం మొదలైంది. ఈ పోర్టల్ సహాయంతో వందలాది మంది అభ్యర్థులు తక్షణ ఉద్యోగాలు పొందారు. స్వల్ప తేడాతో ఆగిపోయిన యువత ఇప్పుడు కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా! నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. భారతదేశంలో దాగి ఉన్న అవకాశాలను యావత్ ప్రపంచం వీక్షిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్లాదకరమైన అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో పాడ్‌కాస్ట్‌లు చాలా ఫ్యాషన్‌గా మారాయని మీకు తెలుసు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అంశాలకు సంబంధించిన పాడ్‌కాస్ట్‌లను చూస్తారు, వింటారు. ఇటీవల నేను కూడా కొన్ని పాడ్‌కాస్ట్‌లలో పాల్గొన్నాను. అలాంటి పాడ్‌కాస్ట్‌లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ ఉన్నారు. ఆ పాడ్‌కాస్ట్‌లో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు దాన్ని విన్నారు. పాడ్‌కాస్ట్ లో చర్చ జరుగుతున్నప్పుడు నేను సంభాషణలో ఒక అంశాన్ని లేవనెత్తాను. ఒక జర్మన్ క్రీడాకారుడు ఆ పాడ్‌కాస్ట్ విన్నాడు. అతని దృష్టి నేను దానిలో ప్రస్తావించిన దానిపై కేంద్రీకృతమైంది. అతను ఆ అంశంతో ఎంతగా కనెక్ట్ అయ్యాడంటే అతను మొదట దానిపై పరిశోధన చేసి, ఆపై జర్మనీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, ఆ అంశంపై భారతదేశంతో అనుసంధానం అవ్వాలనుకుంటున్నానని వారికి ఒక లేఖ రాశాడు. ఒక జర్మన్ ఆటగాడికి స్ఫూర్తినిచ్చిన పాడ్‌కాస్ట్‌లో మోదీజీ ఎలాంటి అంశం గురించి మాట్లాడారో మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ అంశం ఏమిటి? మీకు గుర్తు చేస్తాను. పాడ్‌కాస్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని షాడోల్ లో ఫుట్‌బాల్ క్రేజ్‌కు సంబంధించిన ఒక గ్రామాన్ని నేను ప్రస్తావించాను. వాస్తవానికి నేను రెండేళ్ల కిందట షాడోల్‌కు వెళ్లి అక్కడి ఫుట్‌బాల్ ఆటగాళ్లను కలిశాను. పాడ్‌కాస్ట్ సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా నేను షాడోల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లను కూడా ప్రస్తావించాను. జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్ డైట్‌మార్ బీర్స్‌డోర్ఫర్ కూడా ఇదే విషయాన్ని విన్నాడు. షాడోల్ యువ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జీవిత ప్రయాణం అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. స్ఫూర్తినిచ్చింది. నిజంగా అక్కడి ఆటగాళ్ళు ఫుట్‌బాల్ ద్వారా ఇంతగా ప్రేరణ పొందుతారని ఎవరూ ఊహించలేదు. ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఇతర దేశాల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ జర్మన్ కోచ్ షాడోల్ లోని కొంతమంది క్రీడాకారులకు జర్మనీలోని ఒక అకాడమీలో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దీని తరువాత, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనను సంప్రదించింది. త్వరలో షాడోల్ నుండి మా యువ స్నేహితులు కొందరు శిక్షణ కోసం జర్మనీకి వెళతారు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ప్రజాదరణ నిరంతరం పెరుగుతుండటం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫుట్‌బాల్ ప్రేమికులు సమయం దొరికినప్పుడల్లా షాడోల్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న క్రీడా విప్లవాన్ని దగ్గరగా చూడాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! సూరత్‌లో నివసించే జితేంద్ర సింగ్ రాథోడ్ గురించి తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. మీ హృదయం గర్వంతో నిండిపోతుంది. జితేంద్ర సింగ్ రాథోడ్ ఒక సెక్యూరిటీ గార్డు. అతను తీసుకున్న అద్భుతమైన చొరవ ప్రతి దేశభక్తుడికి గొప్ప ప్రేరణనిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతమాత రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులందరి గురించి సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటివరకు అమరులైన వేలాది మంది ధైర్య సైనికుల గురించి ఆయన వద్ద సమాచారం ఉంది. అమరవీరుల వేలాది ఛాయాచిత్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఒకప్పుడు ఒక అమరవీరుడి తండ్రి మాటలు అతని హృదయాన్ని తాకాయి. "నా కొడుకు పోతేనేం. యావద్దేశం సురక్షితంగా ఉంటుంది, కాదా?" అని అమరవీరుడి తండ్రి అతనితో అన్నారు. ఈ ఒక్క విషయం జితేంద్ర సింగ్ హృదయాన్ని దేశభక్తి పట్ల అద్భుతమైన మక్కువతో నింపింది. నేడు ఆయన అనేక మంది అమరవీరుల కుటుంబాలతో సన్నిహితంగా ఉన్నారు. దాదాపు రెండున్నర వేల మంది అమరవీరుల తల్లిదండ్రుల పాదాల నుండి మట్టిని కూడా ఆయన తీసుకువచ్చారు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న లోతైన ప్రేమ, అనుబంధాలకు ఇది ఒక సజీవ ఉదాహరణ. జితేంద్ర గారి జీవితం మనకు నిజమైన దేశభక్తి పాఠాన్ని నేర్పుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజుల్లో ఇళ్ల పైకప్పులపై, పెద్ద భవనాలపై, ప్రభుత్వ కార్యాలయాలలో సౌర ఫలకాలు తరచుగా ప్రకాశిస్తున్నట్లు మీరు చూసి ఉంటారు. ప్రజలు ఇప్పుడు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నారు. దాన్ని విశాల దృక్పథంతో స్వీకరిస్తున్నారు. మన దేశం సూర్య భగవానుడి ఆశీస్సులు పొందింది. కాబట్టి ఆయన ఇచ్చిన శక్తిని పూర్తిగా ఎందుకు ఉపయోగించుకోకూడదు?
మిత్రులారా! సౌరశక్తి కారణంగా రైతుల జీవితాలు కూడా మారుతున్నాయి. పొలాలు, కృషి, రైతులు మారలేదు. కానీ ఇప్పుడు కష్టానికి ఫలాలు చాలా ఎక్కువ. ఈ మార్పు సోలార్ పంపులు, సోలార్ రైస్ మిల్లుల నుండి వస్తోంది. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వందలాది సోలార్ రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. ఈ సోలార్ రైస్ మిల్లులు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి ముఖాల్లో మెరుపును కూడా పెంచాయి.
మిత్రులారా! బీహార్‌కు చెందిన దేవకి గారు సోలార్ పంపుతో గ్రామం స్వరూపాన్ని మార్చారు. ముజఫర్‌పూర్‌లోని రతన్‌పురా గ్రామంలో నివసించే దేవకి గారిని ఇప్పుడు ప్రేమగా "సోలార్ దీదీ" అని పిలుస్తారు. దేవకి గారి జీవితం అంత సాఫీగా సాగలేదు. చిన్న వయసులోనే వివాహం, చిన్న పొలం, నలుగురు పిల్లల బాధ్యత. భవిష్యత్తు గురించి స్పష్టమైన చిత్రం లేదు. కానీ ఆమె స్ఫూర్తికి ఎప్పుడూ విఘాతం కలగలేదు. ఆమె ఒక స్వయం సహాయక బృందంలో చేరారు. అక్కడ ఆమెకు సోలార్ పంప్ గురించి సమాచారం అందింది. ఆమె సోలార్ పంప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో కూడా విజయం సాధించారు. తర్వాత సోలార్ దీదీ సోలార్ పంప్ గ్రామ ముఖచిత్రాన్ని మార్చేసింది. గతంలో కొన్ని ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందించే అవకాశం ఉన్న చోట ఇప్పుడు 40 ఎకరాలకు పైగా భూమికి సోలార్ దీదీ సోలార్ పంప్ నుండి నీరు అందుతోంది. గ్రామంలోని ఇతర రైతులు కూడా సోలార్ దీదీ ప్రచారంలో చేరారు. వారి పంటలు పచ్చగా మారడం ప్రారంభించాయి. ఆదాయం పెరగడం ప్రారంభమైంది.
మిత్రులారా! గతంలో దేవకి గారి జీవితం నాలుగు గోడల మధ్యే పరిమితమై ఉండేది. కానీ నేడు ఆమె పూర్తి నమ్మకంతో తన పనిని చేస్తోంది. సోలార్ దీదీగా మారి, డబ్బులు సంపాదిస్తోంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె UPI ద్వారా ఆ ప్రాంత రైతుల నుండి చెల్లింపు తీసుకుంతయారు. ఇప్పుడు ఆమెను మొత్తం గ్రామంలో ఎంతో గౌరవంగా చూస్తున్నారు. వారి కృషి, దూరదృష్టి సౌరశక్తి కేవలం విద్యుత్ వనరు మాత్రమే కాదని, ప్రతి గ్రామానికి కొత్త వెలుగును తెచ్చే కొత్త శక్తి అని నిరూపించాయి.
నా ప్రియమైన దేశప్రజలారా! సెప్టెంబర్ 15వ తేదీ భారతదేశ గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం. ఆ రోజును మనం ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంజనీర్లు కేవలం యంత్రాలను తయారు చేయరు. వారు కలలను వాస్తవ రూపంలోకి మార్చే కర్మయోగులు. భారతదేశంలోని ప్రతి ఇంజనీర్‌ను నేను అభినందిస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! విశ్వకర్మను పూజించే పవిత్ర సందర్భం కూడా సెప్టెంబర్‌లో వస్తోంది. విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న ఉంది. ఆ రోజును మన విశ్వకర్మ సోదరులకు కూడా అంకితం చేశాం. వారు సంప్రదాయ చేతిపనులు, నైపుణ్యాలు, జ్ఞాన-విజ్ఞానాన్ని ఒక తరం నుండి మరొక తరానికి నిరంతరం అందిస్తున్నారు. మన వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు ఎల్లప్పుడూ భారతదేశ శ్రేయస్సుకు పునాదిగా ఉన్నారు. మన ఈ విశ్వకర్మ సోదరులకు సహాయం చేయడానికి ప్రభుత్వం విశ్వకర్మ యోజనను కూడా ప్రారంభించింది.
మిత్రులారా! ఇప్పుడు నేను మీ కోసం ఒక ఆడియో రికార్డింగును వినిపించాలనుకుంటున్నాను.
####
“రాష్ట్రాల కోసం నేను చేసిన పని, మన ప్రభుత్వం హైదరాబాద్ కోసం చేసిన పని సానుకూలంగానే చేశాం. కానీ హైదరాబాద్ విషయంలో మనం ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నామో మీకు తెలుసు. ఏ యువరాజు లేదా రాజు కోసం తప్పుడు నిర్ణయం తీసుకోబోమని అన్ని రాష్ట్రాలకు, అందరు యువరాజులకు హామీ ఇచ్చాం. అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అందరికీ జరిగేదే వారికి కూడా జరుగుతుంది. కానీ వారి కోసం అప్పటి వరకు ఒక ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం.”
####
మిత్రులారా! ఇది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వరం. హైదరాబాద్ సంఘటనలపై ఆయన గొంతులో ఉన్న బాధను మీరు గ్రహించవచ్చు. వచ్చే నెల సెప్టెంబర్‌లో మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. 'ఆపరేషన్ పోలో'లో పాల్గొన్న వారందరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకునే నెల ఇది. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ వేరే పరిస్థితిలో ఉందని మీ అందరికీ తెలుసు. నిజాం, రజాకార్ల దురాగతాలు రోజురోజుకూ పెరుగుతున్న కాలమది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు, 'వందేమాతరం' చెప్పినందుకు కూడా ప్రజలను చంపేశారు. మహిళలు, పేదలను హింసించారు. ఆ సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ సమస్య చాలా పెద్దదిగా మారుతోందని హెచ్చరించారు. చివరికి సర్దార్ పటేల్ ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. 'ఆపరేషన్ పోలో' ప్రారంభించమని ప్రభుత్వాన్ని ఒప్పించారు. రికార్డు సమయంలో మన దళాలు హైదరాబాద్‌ను నిజాం నియంతృత్వం నుండి విముక్తి చేసి భారతదేశంలో భాగం చేశాయి. యావత్ దేశం ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయ సంస్కృతి ప్రభావాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఈ ప్రభావం ప్రపంచంలోని పెద్ద నగరాలకే పరిమితం కాదు- చిన్న పట్టణాలలో కూడా కనిపిస్తుంది. ఇటలీలోని ఒక చిన్న పట్టణమైన క్యాంప్-రోతోందోలో ఇలాంటిదే కనిపించింది. మహర్షి వాల్మీకి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. స్థానిక మేయర్‌తో సహా ఆ ప్రాంతంలోని చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంప్-రోతోందోలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. మహర్షి వాల్మీకి సందేశాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి.
మిత్రులారా! ఈ నెల ప్రారంభంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది. శ్రీరాముని గొప్ప విగ్రహం వీడియోలు సోషల్ మీడియాలో చాలా షేర్ అయ్యాయి.
మిత్రులారా! రామాయణం, భారతీయ సంస్కృతిల పట్ల ఈ ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంటోంది. రష్యాలో వ్లాడివోస్టాక్ అనే ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -20 (మైనస్ ఇరవై) నుండి -30 (మైనస్ ముప్పై) డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే ప్రదేశంగా చాలా మందికి ఇది తెలుసు. ఈ నెలలో వ్లాడివోస్టాక్‌లో ఒక ప్రత్యేకమైన ప్రదర్శన జరిగింది. రామాయణంలోని వివిధ ఇతివృత్తాలపై రష్యన్ పిల్లలు వేసిన చిత్రాలను కూడా ఇందులో ప్రదర్శించారు. ఇక్కడ ఒక పోటీ కూడా జరిగింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారతీయ సంస్కృతిపై అవగాహన పెరుగుతున్నట్లు చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇప్పటికీ ఇంతే. ఈ సమయంలో దేశం మొత్తం గణేష్ ఉత్సవాలను జరుపుకుంటోంది. రాబోయే రోజుల్లో అనేక పండుగల ఆనందం ఉంటుంది. ఈ పండుగల సమయంలో మీరు స్వదేశీ ప్రాముఖ్యతను ఎప్పటికీ మర్చిపోకూడదు. భారతదేశంలో తయారుచేసిన బహుమతులు ఇవ్వాలి. భారతదేశంలో నేసిన బట్టలు వేయాలి. అలంకరణలు భారతదేశంలో తయారు చేసిన పదార్థాలతో తయారు చేయాలి. దీపాలు భారతదేశంలో తయారు చేసిన పదార్థాలతో తయారు చేయాలి. ఇంకా ఇలాగే. జీవితంలోని ప్రతి అవసరంలో ప్రతిదీ స్వదేశీగా ఉండాలి. 'ఇది స్వదేశీ' అని గర్వంగా చెప్పండి. 'ఇది స్వదేశీ' అని గర్వంగా చెప్పండి. 'ఇది స్వదేశీ' అని గర్వంగా చెప్పండి. ఈ భావనతో మనం ముందుకు సాగాలి. 'స్థానిక వస్తువులకు స్వరం' అనే ఒకే ఒక మంత్రం, 'స్వావలంబన భారతదేశం' అనే ఒకే ఒక మార్గం, 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే ఒకే ఒక లక్ష్యం.
మిత్రులారా! ఈ ఆనందాల మధ్య, మీరందరూ పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ ఉండాలి. ఎందుకంటే పరిశుభ్రత ఉన్నచోట పండుగల ఆనందం కూడా పెరుగుతుంది. మిత్రులారా! 'మన్ కీ బాత్' కోసం ఇలా పెద్ద సంఖ్యలో మీ సందేశాలను నాకు పంపుతూ ఉండండి. మీ ప్రతి సూచన ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యం. మీ అభిప్రాయాన్ని నాకు పంపుతూ ఉండండి. తర్వాతిసారి మనం కలిసినప్పుడు మరిన్ని కొత్త అంశాలపై చర్చ జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
***
(Release ID: 2162404)
Visitor Counter : 11
Read this release in:
Odia
,
Gujarati
,
Punjabi
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Tamil
,
Kannada
,
Malayalam