ప్రధాన మంత్రి కార్యాలయం
ముఖచిత్రం: భారత్ - జపాన్ ఆర్థిక భద్రతా సహకారం
Posted On:
29 AUG 2025 8:12PM by PIB Hyderabad
ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడిన భారత్ - జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాల భద్రత, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అత్యంత కీలకంగా ఉంది. మన వ్యూహాత్మక దృక్పథం, ఆర్థిక అవసరాలలో పెరుగుతున్న సమానత్వం ఆధారంగా ఉన్న మన ద్వైపాక్షిక సహకారానికి ఆర్థిక భద్రతాపరంగా సహకారం ఎంతో కీలకం.
రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా, భారత్, జపాన్ దేశాలు రాజకీయ విశ్వాసం, ఆర్థిక ప్రగతి, సహజ అనుబంధం ఆధారంగా కీలకమైన, అభివృద్ధి చెందుతున్న రంగాలలో తమ భాగస్వామ్యాన్ని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నాయి.
● విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి/ విదేశాంగ కార్యదర్శి స్థాయి అధ్యక్షతన, వ్యూహాత్మక వాణిజ్యం, సాంకేతికతతో సహా ఆర్థిక భద్రతపై భారత్, జపాన్ దేశాలు 2024 నవంబర్ లో తొలి దశ చర్చలు ప్రారంభించాయి.
*ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థాయి యంత్రాంగాల ద్వారా, వ్యూహాత్మక వాణిజ్యం, సాంకేతికతతో సహా ఆర్థిక భద్రతపై జరుగుతున్న చర్చల ద్వారా రెండు దేశాలు కొన్ని ఆర్థిక అంతర్ అనుసంధానాల నుంచి తలెత్తే విదేశాంగ విధానం, భద్రతా సవాళ్లపై తమ విధాన దృక్పథాలను పంచుకున్నాయి.
● సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడంలోనూ, కీలకమైన మౌలిక సదుపాయాలను సురక్షితం చేయడంలోనూ, ముఖ్యమైన సాంకేతికతలను ప్రోత్సహించడంలోనూ, వాటిని రక్షించడంలోనూ వ్యూహాత్మక వాణిజ్యం, సాంకేతిక సహకారానికి ఉన్న అడ్డంకులను పరిష్కరించడంలోనూ ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత్, జపాన్ దేశాలు సంకల్పించాయి.
● అత్యంత ప్రాధాన్యతతో కూడిన వ్యూహాత్మక సహకారం కోసం భారత్, జపాన్ దేశాలు కొన్ని కీలక రంగాలను గుర్తించాయి: అవి సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, స్వచ్ఛ ఇంధనం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ.
● భారత ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం రెండు దేశాల జాతీయ ఆర్థిక భద్రతా ప్రయోజనాలను కాపాడే ప్రైవేట్ రంగ నేతృత్వంలోని ప్రయత్నాలకు మద్దతు ఇస్తాయి.
● కెయిడన్రెన్ (జపాన్ బిజినెస్ ఫెడరేషన్), ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ (సీఐఐ) మధ్య ఆర్థిక భద్రతపై భారత్, జపాన్ ప్రైవేట్ రంగాల మధ్య చర్చల ప్రారంభాన్ని భారత్, జపాన్ స్వాగతించాయి. జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఈటీఆర్ఓ), సీఐఐ, జపాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా (జేసీసీఐఐ) ప్రతిపాదించిన భారత్, జపాన్ ఆర్థిక, భద్రతా సహకారంపై సంయుక్త కార్యాచరణ ప్రణాళికను అనుసరించి, వ్యూహాత్మక రంగాల్లో స్పష్టమైన చర్యలను ముందుకు తీసుకెళ్ళడానికి పబ్లిక్, ప్రైవేట్ రంగాల సన్నిహిత సహకారాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
సెమీకండక్టర్లు
*భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), జపాన్ ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ( ఎంఈటీఐ) జూలై 2023లో సెమీకండక్టర్ సరఫరా రంగ భాగస్వామ్యంపై ఒక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది సెమీకండక్టర్ సరఫరా శ్రేణిని పెంపొందించడంలో సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
● సెమీకండక్టర్ రంగంలో సుస్థిర సరఫరా వ్యవస్థలు, ప్రతిభ, పరిశోధన, అభివృద్ధి అవకాశాలను అన్వేషించడానికి ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, విద్యాసంస్థలను ఒకచోట చేర్చిన భారత్, జపాన్ సెమీకండక్టర్ విధాన చర్చల కింద రెండు దేశాలు పలు సమావేశాలను నిర్వహించాయి.
● ఆర్థిక భద్రతకు తోడ్పడే కార్యకలాపాలు సహా పలు విధాలుగా భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రైవేట్ రంగానికి రెండు దేశాలు అభినందనలు తెలిపాయి. సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను వైవిధ్యపరచడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం, ప్రతిభతో సహా ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే ఈ కింద ప్రయత్నాలను స్వాగతించారు.
◦ గుజరాత్‌లోని సనంద్‌లో ఒక సెమీకండక్టర్ ఓఎస్ఏటీని జపాన్ సెమీకండక్టర్ సంస్థ రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ సీజీ పవర్‌తో కలిసి ఏర్పాటు చేసింది.
◦ మే 2025లో, మైటీకి చెందిన చిప్స్ టు స్టార్టప్ (సీ2ఎస్) కార్యక్రమం కింద రెనేసాస్ , సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ మధ్య రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ అవగాహన ఒప్పందాలు పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తాయి. అలాగే, స్థానిక స్టార్టప్‌లు సాంకేతిక పురోగతిని సాధించడానికి, స్థానిక తయారీని ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తాయి.
◦ వీఎల్ఎస్ఐ , ఎంబెడెడ్ సెమీకండక్టర్ సిస్టమ్స్ రంగంలో పరిశోధన, సహకారం కోసం జూన్ 2024లో ఐఐటీ హైదరాబాద్‌తో రెనేసాస్ ఒక ఎంఓయూపై సంతకం చేసింది.
◦ భారతదేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమ సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టోక్యో ఎలక్ట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి.
● క్వాడ్ ద్వారా, ముఖ్యంగా సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థల అత్యవసర ప్రణాళిక ద్వారా, ఆర్థిక భద్రత, సమష్టి సుస్థిరతపై తమ సహకారాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తున్నాయి.
● సెమీకండక్టర్ పరిశ్రమతో సహా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలలో, భారతీయ వెంచర్, స్టార్టప్ కంపెనీల కోసం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధికి మద్దతు ఇవ్వడానికి తమిళనాడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ప్రోగ్రామ్ (ఫేజ్ 3) పేరుతో జపాన్ యెన్ రుణ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలపై రెండు దేశాలు సంతకం చేశాయి.
కీలక ఖనిజాలు
● ఖనిజ భద్రతా భాగస్వామ్యం, ఇండో - పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ , క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్స్ ద్వారా భారత్, జపాన్ దేశాలు కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తున్నాయి.
● భారతదేశ గనుల మంత్రిత్వ శాఖ, జపాన్ ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఈటీఐ) ఖనిజ వనరుల రంగంలో సహకారం కోసం ఆగస్టు 2025లో ఒక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి.
● ఆంధ్రప్రదేశ్‌లో టయోటా సుషో చేపట్టిన రేర్ ఎర్త్ రిఫైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం, జపాన్ తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ భూమికి సంబంధించిన అరుదైన పదార్థాల కోసం ఒక స్థిరమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)
● జపాన్‌కు చెందిన అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ (ఎంఐసీ) భారతదేశంలో ఓపెన్ రాన్ పైలట్ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇచ్చింది. ఈ రంగంలో తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
● ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ముఖ్యంగా 5జీ టెక్నాలజీ, ఓపెన్ రాన్ పై సహకరించుకోవడానికి ఎన్ఈసీ, రిలయన్స్ జియో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి.
● ఎన్ఈసీ తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేబొరేటరీ ద్వారా చెన్నైలో ఓపెన్ రాన్ సిస్టమ్ అభివృద్ధిని ప్రోత్సహించింది.
● అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న భారత్–జపాన్ ఐసీటీ సహకార ప్రణాళిక క్రింద, 2022 మేలో 7వ భారత్–జపాన్ ఐసీటీ సంయుక్త అధ్యయన బృందం సమావేశాన్ని భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ, జపాన్ ఎంఐసీ నిర్వహించాయి.
● భారత్, జపాన్ దేశాలు జపాన్ ఐసిటి ఫండ్ (జేఐసీటి), జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) ద్వారా ఉమ్మడి ప్రాజెక్టులలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటాయి.
● జేఐసీటి, జేబీఐసీ ద్వారా పెట్టుబడి, ఆర్థిక సహాయాన్ని అమలు చేయడం ద్వారా దాని డేటా సెంటర్ వ్యాపారాన్ని (ప్రస్తుతం 20 డేటా సెంటర్లు) విస్తరించాలని ఎన్ఐటీ యోచిస్తోంది.
స్వచ్ఛ ఇంధనం
● ఆగస్టు 2025లో జరిగిన 11వ భారత్, జపాన్ ఇంధన చర్చల సంయుక్త ప్రకటనను భారత్, జపాన్ స్వాగతించాయి.
*భారత్, జపాన్ దేశాలు సంయుక్త క్రెడిటింగ్ మెకానిజం (జేసీఎం) పై సహకార ఒప్పందంపై సంతకం చేయడాన్ని భారత్, జపాన్ దేశాలు స్వాగతించాయి.
● భారత నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, జపాన్ మేటీ స్వచ్ఛ హైడ్రోజన్, అమ్మోనియాపై ఉమ్మడి లక్ష్యాల ప్రకటనను జారీ చేశాయి.
● ఐహెచ్ఐ కార్పొరేషన్, కోవా, అదానీ పవర్ సంస్థ కలసి గుజరాత్‌లోని ముంద్రా పవర్ ప్లాంట్‌లో అమ్మోనియా కో-ఫైరింగ్ ప్రదర్శన కోసం ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
● క్లీన్ మాక్స్‌తో కలిసి క్లీన్ మాక్స్ ఒసాకా గ్యాస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక సహ-పెట్టుబడి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి జేబీఐసీ, ఒసాకా గ్యాస్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ద్వారా, ప్రధానంగా కర్ణాటకలో, ఇప్పటికే ఉన్న, కొత్తగా అభివృద్ధి చేసే ఆస్తులతో సహా, 400 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను రాబోయే మూడు సంవత్సరాలలో సొంతం చేసుకొని నిర్వహిస్తాయి.
● గ్లోబల్ బయో ఫ్యూయెల్స్ అలయన్స్ వంటి అంతర్జాతీయ విభాగాల ద్వారా జీవ ఇంధనాల్లో భారత్, జపాన్ దేశాలు తమ సహకారాన్ని కొనసాగిస్తాయి.
● బ్యాటరీ సరఫరా వ్యవస్థపై సహకారాన్ని ప్రోత్సహించే ప్రయత్నాన్ని భారత్, జపాన్ స్వాగతించాయి. ఇందులో భాగంగా జెట్రో, జపాన్ ప్రభుత్వం బ్యాటరీ, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థపై భారతదేశంలో నిర్వహించిన వ్యాపార అనుసంధాన కార్యక్రమం, రౌండ్‌టేబుల్ సమావేశంలో 70కి పైగా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నాయి.
● భారత ప్రభుత్వం, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) ఏర్పాటు చేసిన భారత్ - జపాన్ నిధి ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఇతర రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించడాన్ని రెండు దేశాలు స్వాగతించాయి.
● జేబీఐసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జపాన్ కరెన్సీలో 60 బిలియన్ల వరకు రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నిధులు అసోం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వెదురు ఆధారిత బయోఇథనాల్ ఉత్పత్తి ప్రాజెక్టుకు సహాయపడతాయి.
● జపాన్‌లోని ఆటోమోటివ్ విడిభాగాల సంస్థలైన యోకోహామా రబ్బర్, యాజాకి కార్పొరేషన్ వంటి వాటి పెట్టుబడి ప్రాజెక్టులకు, జేబీఐసీ ఆర్థిక సహాయ చర్యలను అమలు చేసింది. జపాన్ ఆటోమొబైల్ తయారీదారుల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి (పర్యావరణ అనుకూల వాహనాలు), జపాన్‌లోని లాజిస్టిక్స్ సంస్థల రైల్వే కంటైనర్ రవాణా వ్యాపారానికి (కోనోయికి రవాణా) రుణాలు ఇవ్వడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలను భారతదేశంలో రవాణా మార్పులకు దోహదం చేయడానికి ఉద్దేశించారు.
శాస్త్రీయ సహకారం
● సైన్స్, టెక్నాలజీ రంగంలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్, జపాన్ దేశాలు ఈ సంవత్సరాన్ని సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మార్పిడి సంవత్సరంగా జరుపుకుంటున్నాయి,
● భారత్, జపాన్ దేశాలు జూన్ 2025లో సైన్స్, టెక్నాలజీ సహకారంపై 11వ సంయుక్త కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీలు, బయోటెక్నాలజీ, వాతావరణ మార్పు సంబంధిత టెక్నాలజీ, అంతరిక్షం వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో పూర్తిస్థాయి శాస్త్రీయ సహకారం గురించి చర్చలు జరిపాయి.
● భారత్, జపాన్ దేశాలు వెహికల్-టు-ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్ ) పై అనేక ఉమ్మడి ప్రదర్శన ప్రయోగాలు నిర్వహించాయి. అలాగే, 2019 నుంచి వీ2ఎక్స్ సిస్టమ్ పై వార్షిక సాంకేతిక వర్క్‌షాప్‌లను నిర్వహించాయి. వీ2ఎక్స్ టెక్నాలజీలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థలపై సహకరించడానికి అవకాశాలను పరిశీలించాయి.
● భారత్, జపాన్ దేశాలు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ ) మధ్య ఎస్ఐసీఓఆర్పీ ద్వారా అత్యాధునిక రంగాలలో అంతర్జాతీయ ఉమ్మడి ప్రతిపాదనల అభ్యర్థనలను అమలు చేస్తాయి.
● భారత్, జపాన్ దేశాలు ఏఐ లో సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇది ఉమ్మడి పరిశోధనలు, విశ్వవిద్యాలయాలు, కంపెనీల మధ్య కార్యక్రమాల ప్రోత్సాహం, పెద్ద భాషా నమూన (లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ - ఎల్ఎల్ఎం) అభివృద్ధిలో సహకారం, విశ్వసనీయ ఏఐ సానుకూల వ్యవస్థను పెంపొందించడానికి సహకారం వంటి వాటి ద్వారా ఏఐలో వ్యూహాత్మక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
● 2025లో డిజిటల్ భాగస్వామ్యం 2.0 (పై అవగాహన ఒప్పందాన్ని రెండు దేశాలు పునరుద్ధరించాయి. దీని ద్వారా సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశోధన, అభివృద్ధి, అంకుర సంస్థల వంటి డిజిటల్ రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించనున్నారు.
● భారత్, జపాన్ దేశాలు అగ్రశ్రేణి రంగాలలో మానవ వనరుల మార్పిడిని బలోపేతం చేశాయి. ఇందుకోసం భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా పీజీ, డాక్టరేట్ విద్యార్థులు జపాన్‌లో పరిశోధనలు చేయడానికి లోటస్ ప్రోగ్రామ్, సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా మద్దతు అందిస్తున్నారు. అదేవిధంగా, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా జపాన్ కంపెనీలతో విద్యార్థుల అనుసంధానాన్ని సులభతరం చేస్తున్నారు.
● జపాన్ విద్యా, సంస్కృతి, క్రీడలు, సైన్స్ , టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఎక్స్టీ) భారత సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో విజ్ఞాన మార్పిడి, పరిశోధన, అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రయోజనాల ప్రకటన (జేఎస్ఓఐ) పై సంతకం చేసింది.
● ఎన్‌టీటీ డేటా, క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నేసా నెట్‌వర్క్స్, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.
ఫార్మాస్యూటికల్స్
*జపాన్ వ్యూహాత్మక అంతర్జాతీయ సహకార పరిశోధన కార్యక్రమం కింద జపాన్ వైద్య పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, భారతీయ వైద్య పరిశోధనా మండలి ఆరోగ్యం, వైద్య పరిశోధనలో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తాయి.
● భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
● భారత్, జపాన్ దేశాలు ఒకే విధమైన ఆలోచనలు ఉన్న దేశాల మధ్య బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ ద్వారా బలమైన సరఫరా వ్యవస్థను నిర్మించడానికి తమ ప్రయత్నాలలో సహకరించుకుంటాయి.
● జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) రసాయన, ఔషధ పరిశ్రమలలోని చిన్న, మధ్య తరహా సంస్థల కోసం జపాన్ కంపెనీల పెట్టుబడి ప్రాజెక్టులకు రుణాలు అందిస్తోంది.
భాగస్వామ్య విస్తరణ
మారుతున్న ప్రపంచ సవాళ్ళ నేపథ్యంలో క్లిష్టమైన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంపై ఉమ్మడి ఆసక్తిని గుర్తించిన భారత్, జపాన్ ఆర్థిక భద్రతా రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. ఇండో - పసిఫిక్ ప్రాంతంలోనే కాకుండా దాని వెలుపల కూడా నియమాల ఆధారిత ఆర్థిక వ్యవస్థపై తమ ఉమ్మడి దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని, ఇరు దేశాలు ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా రంగాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయనున్నాయి. దీని ద్వారా వ్యూహాత్మక రంగాలలో ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంపొందించడం, సాంకేతిక, మౌలిక వసతుల భద్రతను మెరుగుపరచడంతోపాటు విశ్వసనీయమైన పారదర్శకమైన వ్యవస్థలను ప్రోత్సహిస్తారు.
***
(Release ID: 2162146)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam