ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సెమికాన్ ఇండియా-2025 నాలుగో ఎడిషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
· న్యూఢిల్లీలోని యశోభూమిలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు దేశంలో అతిపెద్ద సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన
· 33 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా సీఎక్స్‌వోలు, 350 ఎగ్జిబిటర్లు, 50కి పైగా దూరదృష్టి కలిగిన వక్తలను స్వాగతించనున్న భారత్
· స్థానికంగా సెమీకండక్టర్ అనుకూల వ్యవస్థ బలమైన విస్తరణ, పారిశ్రామిక పోకడలను చాటేలా కార్యక్రమం
· ఆత్మనిర్భర భారత్ దిశగా సెమీకండక్టర్ వ్యవస్థలో సహకారాన్ని పెంపొందిస్తూనే సంక్లిష్టమైన భవిష్యత్ సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా ‘సెమికాన్ ఇండియా’
Posted On:
22 AUG 2025 7:45PM by PIB Hyderabad
సెమికాన్ ఇండియా-2025 నాలుగో ఎడిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని యశోభూమి (భారత అంతర్జాతీయ సమావేశ వేదిక, ప్రదర్శన కేంద్రం)లో అధికారికంగా ప్రారంభిస్తారు. భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా.. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వ స్థానంలో ఉన్నవారు, సెమీకండక్టర్ పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు సహా కీలక భాగ్వాములందరినీ సెమికాన్ ఇండియా- 2025 నాలుగో ఎడిషన్ సమావేశపరుస్తుంది.
సెమికాన్ ఇండియా కార్యక్రమం కింద భారత సెమీకండక్టర్ ప్రస్థానం బలంగా ఊపందుకుంటోంది. ఇప్పటివరకు భారీ ఫాబ్రికేషన్ యూనిట్లు, 3డీ హెటెరోజీనస్ ప్యాకేజింగ్, సమ్మిళిత సెమీకండక్టర్లు (సిలికాన్ కార్బైడ్‌తోపాటు), అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ (ఓఎస్ఏటీ) సహా వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న రంగాలలో 10 ప్రాజెక్టులను భారత ప్రభుత్వం ఆమోదించింది. సెమీకండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి ప్రతీ దశలో అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక విజయాలుగా నిలుస్తాయి.
సెమీకండక్టర్లను ప్రాథమిక పరిశ్రమగా గుర్తిస్తూ.. 280కి పైగా విద్యాసంస్థలు, 72 అంకుర సంస్థలకు అత్యాధునిక డిజైన్ సాధనాలను అందించడం ద్వారా.. పరిశోధన, ఆవిష్కరణ, డిజైన్ పరంగా ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోంది. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక (డీఎల్ఐ) పథకం కింద 23 అంకుర సంస్థలు ఆమోదం పొందాయి. భారతీయ ఆవిష్కర్తలు కీలక అప్లికేషన్లపై పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా.. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ), నావిగేషన్ వ్యవస్థలు, మోటార్ కంట్రోలర్లు, కమ్యూనికేషన్ చిప్స్, మైక్రోప్రాసెసర్ యూనిట్ల వంటి అప్లికేషన్ల కోసం సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ పురోగమిస్తోంది. ఈ చర్యలన్నీ ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో బలమైన, సమగ్రమైన సెమీకండక్టర్ వ్యవస్థను నెలకొల్పడంలో నిశ్చయాత్మక ముందడుగు.
భారత సెమీకండక్టర్ విప్లవాన్ని వేగవంతం చేసేలా.. సెమీండక్టర్ పరిశ్రమ, భారత సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లకు ప్రోత్సాహాన్నిచ్చే సెమీ (SEMI), ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘సెమికాన్ ఇండియా-2025’ కార్యక్రమాన్ని ప్రకటించాయి.
‘బిల్డింగ్ ది నెక్ట్ సెమీ కండక్టర్ పవర్ హౌస్’ ఇతివృత్తంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఫాబ్రికేషన్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, అధునాతన తయారీ, కృత్రిమ మేధ, సరఫరా వ్యవస్థ నిర్వహణ, సుస్థిరత, కార్మిక శక్తిని పెంచడం, డిజైన్లు – అంకుర సంస్థల వంటి కీలక రంగాల్లో ఆవిష్కరణలు, ప్రస్తుత ధోరణులపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో 6 దేశాల రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉంటాయి.
“సెమికాన్ ఇండియా ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమలోని ప్రతీ దశకు చెందిన దాదాపు 350 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 దేశ ప్రదర్శన వేదికలుంటాయి. కార్యక్రమంలో 9 రాష్ట్రాల భాగస్వామ్యం ఉంటుంది. 15,000కు పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో తాజా పురోగతులను ప్రదర్శించేందుకు దక్షిణాసియాలో అతిపెద్ద వేదికను సెమికాన్ ఇండియా అందిస్తోంది” అని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ తెలిపారు.
"ప్రపంచ ఎలక్ట్రానిక్స్ డిజైన్, తయారీ, సరఫరా వ్యవస్థ అంతటా సభ్య కంపెనీల ఉమ్మడి నైపుణ్యం సామర్థ్యాలను సెమీకాన్ ఇండియాకు తీసుకువస్తోంది, ఇది భారత్ లో సెమీకండక్టర్ రంగం విస్తరణ, పరిశ్రమ సరఫరా వ్యవస్థ సుస్థిరత - రెండింటినీ ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది" అని సెమీ అధ్యక్షుడు, సీఈఓ అజిత్ మనోచా అన్నారు. "ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, వ్యాపార అభివృద్ధిలో సెమికాన్ అవకాశాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. సాంకేతికత, మార్కెట్ ధోరణులపై ప్రముఖ పరిశ్రమ నిపుణులు ఈ కార్యక్రమంలో విలువైన ఆలోచనలను అందిస్తారు” అని చెప్పారు.
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో సాంకేతిక పురోగతిని గరిష్ట స్థాయికి చేర్చడం, అలాగే భారతదేశ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి దృష్టి సారించిన విధానాలను వెలుగులోకి తీసుకురావడం సెమీకాన్ ఇండియా 2025 ఉద్దేశం.
ఈ కార్యక్రమం ఆలోచనలు, భాగస్వామ్యం, ఆవిష్కరణల విశిష్ట సమ్మేళనం. రేపటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించడంతో పాటు, సెమీకండక్టర్ రంగం అంతటా సహకారాన్ని పెంపొందిస్తుంది. ఈ సంవత్సరం పాల్గొనేవారి సంఖ్య విశేష స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఐఎస్ఎం సీఈఓ శ్రీ అమితేష్ కుమార్ సిన్హా తెలిపారు.
“భారత సెమీకండక్టర్ పరిశ్రమ ఒక విప్లవాత్మక దశకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. దేశీయ విధానాలు, ప్రైవేట్ రంగ సామర్థ్యాలు కలిసి, దేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు నడిపిస్తున్నాయి. ఈ మార్పు దశలో, మరింత వృద్ధి, కొత్త ఆవిష్కరణలను సాధించడానికి భాగస్వామ్యాన్ని, ఒక బలమైన సానుకూల వ్యవస్థను నిర్మించడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలో సెమీకాన్ ఇండియా 2025 ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది” అని సెమీ ఇండియా, ఐఈఎస్ఏ అధ్యక్షుడు అశోక్ చందక్ అన్నారు.
ఈ సంవత్సరం కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు, అప్లయిడ్ మెటీరియల్స్, ఏఎస్ఎంఎల్, ఐబీఎం, ఇన్ఫినియాన్, కేఎల్ఏ, లామ్ రీసెర్చ్, మెర్క్, మైక్రాన్, పీఎస్ఎంసీ, రాపిడస్, శాన్డిస్క్, సిమెన్స్, ఎస్కే హైనిక్స్, టాటా ఎలక్ట్రానిక్స్, టోక్యో ఎలక్ట్రాన్, మరెన్నో అగ్రశ్రేణి కంపెనీల నుంచి కూడా పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంలో, సెమీకండక్టర్ రంగంలో తదుపరి ఆవిష్కరణలను, వృద్ధిని ముందుకు నడిపించనున్న ఉన్నత స్థాయి కీలక ప్రసంగాలు, ప్యానల్ చర్చలు, ఫైర్‌సైడ్ చాట్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, ఆరు అంతర్జాతీయ రౌండ్ టేబుల్ సమావేశాలు, మరెన్నో విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.
ఈ కార్యక్రమంలో ‘వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ పెవిలియన్’ కూడా ఉంటుంది, ఇది మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలను ప్రదర్శించడానికి, కొత్త ప్రతిభను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది.
సెమీకాన్ ఇండియా 2025 కోసం సందర్శకుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
semiconindia.org లో రిజిస్టర్ చేసుకోండి.
సెమీకాన్ ఇండియా గురించి
సెమీకాన్ ఇండియా, సెమీ ఆధ్వర్యంలో ఏటా జరిగే ఎనిమిది సెమీకాన్ ప్రదర్శనలలో ఒకటి. ఇది ప్రపంచ సెమీకండక్టర్ డిజైన్, తయారీ రంగంలో ఉన్న కార్యనిర్వహణాధికారులను, ప్రముఖ నిపుణులను ఒకచోట చేర్చే వేదికగా ఉంది. ఈ ప్రస్తుత కార్యక్రమం సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్తు దిశగా ఒక ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తూ, ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భాగస్వామ్యాన్ని, సుస్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.
సెమీ గురించి
సెమీ అనేది సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ డిజైన్, తయారీ సరఫరా శ్రేణి లో ప్రపంచవ్యాప్తంగా 3,000 పైగా సభ్య కంపెనీలను, 1.5 మిలియన్ల నిపుణులను కలిపే గ్లోబల్ ఇండస్ట్రీ అసోసియేషన్. ఇది సానుకూల మద్దతు, శ్రామిక వనరుల అభివృద్ధి, సుస్థిరత, సరఫరా వ్యవస్థ నిర్వహణ మొదలైన కార్యక్రమాల ద్వారా సభ్య సంస్థల మధ్య సహకారాన్ని పెంచి, పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు పరిష్కారాలను వేగవంతం చేస్తుంది.
ఐఎస్ఎం గురించి
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) అనేది ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (ఎంఈఐటీవై) కింద పని చేసే స్వతంత్ర సంస్థ. ఇది భారతదేశంలో సుస్థిరమైన, ప్రపంచస్థాయిలో పోటీపడే సెమీకండక్టర్, డిస్ప్లే తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ కోసం నోడల్ ఏజెన్సీగా పని చేస్తుంది. ప్రతిపాదనలను అంచనా వేయడం, సాంకేతిక భాగస్వామ్యాలకు సహకరించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడం, ఆర్థిక ప్రోత్సాహకాలను పంపిణీ చేయడాన్ని ఐఎస్ఎం పర్యవేక్షిస్తుంది.ఆర్థిక భద్రత, సాంకేతిక స్వావలంబన దిశగా భారత్ ను సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక నమ్మకమైన ప్రపంచ కేంద్రంగా నిలపడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.
(Release ID: 2160056)