ప్రధాన మంత్రి కార్యాలయం
రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· “భారత్ సాధించిన ఘనతలు.. విజయాలు ప్రపంచంలో కొత్త ఆశలు చిగురింపజేశాయి”
· “ప్రపంచ వృద్ధికి నేడు సారథ్యం వహిస్తున్నది భారతదేశమే”
· “నేటి భారత్ గొప్పగా ఆలోచిస్తుంది.. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని అద్భుత ఫలితాలు సాధిస్తుంది”
· “దేశంలోని గ్రామీణుల గృహ ఆస్తి హక్కు నిర్ధారణ లక్ష్యంగా స్వామిత్వ పథకానికి శ్రీకారం చుట్టాం”
· “యువతరమే నేటి భారత ‘ఎక్స్’ ఫ్యాక్టర్.. అంటే- ఎక్స్‌పెరిమెంటేషన్.. ఎక్సలెన్స్.. ఎక్స్‌పాన్షన్”
· “ప్రభావ శూన్య పరిపాలనను గత దశాబ్ద కాలంలో ప్రభావశీలమైనదిగా మార్చేశాం”
· “ఇళ్ల నిర్మాణం లోగడ ప్రభుత్వ చోదకంగా ఉండేది... దాన్ని మేమివాళ యజమాని సారథ్యం కిందకు మార్పు చేశాం”
Posted On:
06 MAR 2025 10:08PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రిపబ్లిక్ టీవీ ఇవాళ నిర్వహించిన ‘రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా- అట్టడుగు స్థాయి యువతకు ఇందులో భాగస్వామ్యం కల్పించడంతోపాటు కీలక హ్యాకథాన్ పోటీ నిర్వహణతో రిపబ్లిక్ టీవీ వినూత్న మార్గం అనుసరించిందని అభినందించారు. దేశ యువతరం జాతీయ స్థాయిలో చర్చలో పాల్గొన్నపుడు ఆలోచనలు కొత్తదనం సంతరించుకుంటాయని ప్రధాని అన్నారు. అంతేగాక కార్యక్రమం ఆద్యంతం యువశక్తి చురుకుదనం, ఉత్తేజం ఉప్పొంగుతాయని అభివర్ణించారు. ఈ సమావేశంలో ఆ శక్తిని, ఉత్తేజాన్ని అనుభూతి చెందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల అవరోధాలు, చిక్కులను అధిగమించి ఆకాశమే హద్దుగా సాగిపోవడంలో యువశక్తి తోడ్పడుతుందని చెప్పారు. అలాగే ప్రతి లక్ష్యాన్ని సాధించగలిగేలా, ప్రతి గమ్యాన్నీ చేరుకునేలా చేయగలదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం కోసం కొత్త భావనను రూపొందించి, విజయవంతం చేయడంపై రిపబ్లిక్ టీవీని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను భారత రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే తన ఆలోచనను ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
“ఈ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచం గుర్తిస్తోంది. ఆ మేరకు మన దేశం సాధించిన ఘనతలు, విజయాలు యావత్ ప్రపంచంలో కొత్త ఆశలు చిగురింపజేశాయి” అని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకానొక సమయంలో భారత్‌ను ‘మునిగే-ముంచే’ దేశంగా ప్రపంచం పరిగణించేదని గుర్తుచేశారు. అలాంటి దుస్థితి నుంచి నేడు ప్రపంచ వృద్ధికి సారథ్యం వహించే స్థాయికి భారత్ ఎదిగిందన్న గుర్తింపును సాధించిందని సగర్వంగా ప్రకటించారు. నేటి కృషి, విజయాల ఫలితంగా భారత్ భవిష్యత్ దిశ ప్రస్ఫుటం అవుతున్నదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి, 65 ఏళ్లు దాటిన తర్వాత కూడా మన దేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయిని దాటలేదని ప్రధాని పేర్కొన్నారు. కానీ, గత దశాబ్ద కాలంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ఇప్పుడు మూడో స్థానంలో దూసుకెళ్లటానికి వేగంగా పయనిస్తున్నదని చెప్పారు.
భారత స్థూల దేశయోత్పత్తి (జిడిపి) 18 ఏళ్ల కిందట.. అంటే- 2007నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగా, అప్పట్లో వార్షిక ఆర్థిక కార్యకలాపాలు అంతకుమించలేదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, కేవలం ఒక్క త్రైమాసికానికి మన ఆర్థిక కార్యకలాపాల పరిమాణం నేడు ఆ స్థాయిలో ఉన్నదని వివరించారు. భారత్ శరవేగంగా పురోగమిస్తున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. గత దశాబ్దంలో తెచ్చిన గణనీయ మార్పులు, సాధించిన విజయాలు, అందివచ్చిన ఫలితాలను ఆయన సోదాహరణంగా విశదీకరించారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరిక విముక్తం చేశామని, అనేక దేశాల జనసంఖ్యకన్నా ఇది ఎక్కువేనని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే పేదలకు చేరితే, మిగిలిన 85 పైసలు అవినీతితో ఆవిరైపోయే దుస్థితి ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. తద్విరుద్ధంగా గత దశాబ్దంలో రూ.42 లక్షల కోట్లకు సొమ్ము ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) విధానంలో పేదల ఖాతాలకు 100 శాతం లబ్ధి నేరుగా బదిలీ అయిందని తెలిపారు.
అలాగే పదేళ్ల కిందట సౌరశక్తి విషయంలో భారత్ వెనుకబడి ఉండేదని, ప్రధానమంత్రి అన్నారు. కానీ, “నేడు సౌర విద్యుదుత్పాదనలో అగ్రస్థానానగల 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉంది. ఉత్పాదన సామర్థ్యం 30 రెట్లు కావడమేగాక సౌర ఫలకాల తయారీ కూడా 30 రెట్లు పెరిగింది” అని వివరించారు. ఇక పదేళ్లకు ముందు చివరకు ‘హోలీ వాటర్ గన్’ వంటి పిల్లల ఆటబొమ్మలు కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, ఇవాళ మన బొమ్మల ఎగుమతులు 3 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల కిందట మన సైన్యం కోసం రైఫిళ్లను కూడా దిగుమతి చేసుకుంటుండగా నేడు భారత రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు.
గత 10 సంవత్సరాల్లో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా, రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా, 3వ అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాలపై మన మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని, దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని, కార్యకలాపాల్లోగల ‘ఎయిమ్స్’ సంఖ్య 3 రెట్లు పెరిగిందని ఆయన ఏకరవు పెట్టారు. గడచిన దశాబ్దంలో వైద్య కళాశాలలు-సీట్ల సంఖ్య కూడా దాదాపు రెట్టింపయ్యాయని వివరించారు.
“నేటి భారత్ సమున్నతంగా ఆలోచిస్తూ... ప్రతిష్టాత్మక లక్ష్యనిర్దేశంతో గణనీయ ఫలితాలు సాధిస్తోంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశం మానసిక ధోరణిలో మార్పు ఫలితంగా ఉన్నత ఆకాంక్షలతో భారత్ ముందడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు. గతంలో యథాతథ స్థితికి అలవాటుపడాల్సిన దుస్థితి ఉండగా- ఇప్పుడు ఎవరు సత్ఫలితాలు చూపగలరో ప్రజలకు అవగతమైందని వ్యాఖ్యానించారు. కరవు సహాయ పనుల కోసం అభ్యర్థన నుంచి భారత్ అనుసంధానం సహా అంతర్జాతీయ విమానాశ్రయాల కోసం డిమాండ్ చేసేదాకా ప్రజాకాంక్షల విస్తృతిని ఈ ఉదాహరణలు విశదం చేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ప్రజల ఆకాంక్షలు అణచివేతకు గురికావడంతో వారు తమ అంచనాలను తగ్గించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇవాళ ఆ దుస్థితి సమసిపోగా, మానసిక ధోరణి కూడా వేగంగా మారడంతో ప్రజలు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్నారని అభివర్ణించారు.
పౌరులకు హద్దులను, అడ్డంకులను తొలగించినప్పుడు ఏ సమాజం లేదా దేశం బలం పెరుగుతుందని, ఇది పౌరుల సామర్థ్యాలను పెంచుతుందని, అప్పుడు ఆకాశం కూడా చిన్నదిగా కనిపిస్తుందని శ్రీ మోదీ అన్నారు. గత పాలకులు సృష్టించిన అడ్డంకులను ప్రభుత్వం నిరంతరం తొలగిస్తోందని అంటూ, ఇందుకు అంతరిక్ష రంగాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. మొదట్లో అన్ని అంశాలు ఇస్రో పరిధిలో మాత్రమే ఉండేవని, ఇస్రో ప్రశంసనీయమైన కృషి చేసినప్పటికీ, దేశంలో అంతరిక్ష విజ్ఞానం, వ్యాపార అవకాశాల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని, అయితే ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని యువ ఆవిష్కర్తలకు తెరిచిన కారణంగా, దేశంలో 250కి పైగా అంతరిక్ష స్టార్టప్‌లు ఏర్పడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ స్టార్టప్ లు ఇప్పుడు విక్రమ్-ఎస్, అగ్నిబాన్ వంటి రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. భారత్ లో మ్యాప్ లను రూపొందించడానికి గతంలో ప్రభుత్వ అనుమతి అవసరమయ్యే మ్యాపింగ్ సెక్టార్ గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ నిబంధన తొలగించిన తర్వాత, జియోస్పేషియల్ మ్యాపింగ్ డేటా కొత్త స్టార్టప్ లకు మార్గం సుగమం చేస్తోందని ఆయన తెలిపారు. అణు ఇంధన రంగం గతంలో వివిధ ఆంక్షలతో ప్రభుత్వ నియంత్రణలో ఉండేదని, ఈ ఏడాది బడ్జెట్ లో ఈ రంగాన్ని ప్రైవేటు రంగానికి తెరిచామని, 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని జోడించడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వెలిబుచ్చారు.
దేశంలోని గ్రామాల్లో రూ.100 లక్షల కోట్లకు పైగా వినియోగంలోకి రాని ఆర్థిక సామర్ధ్యం ఉందని, ఈ సామర్థ్యం గ్రామాలలోని ఇళ్ల రూపంలో ఉండగా, వీటికి చట్టపరమైన పత్రాలు, సరైన మ్యాపింగ్ లేకపోవడంతో గ్రామస్తులు బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారని ఆయన వివరించారు. ఈ సమస్య భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని, అనేక పెద్ద దేశాలలో కూడా అక్కడి పౌరులకు ఆస్తి హక్కులు లేవని ఆయన పేర్కొన్నారు. తమ పౌరులకు ఆస్తి హక్కులు కల్పించే దేశాలు జీడీపీలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని అన్నారు. "భారతదేశంలో గ్రామీణ ప్రాంత గృహాలకు ఆస్తి హక్కులు కల్పించడానికి స్వామిత్వ పథకం ప్రారంభమైంది. గ్రామాల్లోని ప్రతి ఇంటిని సర్వే చేయడానికి, మ్యాప్ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు" అని ప్రధాన మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఆస్తి (ప్రాపర్టీ) కార్డులను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే రెండు కోట్లకు పైగా ప్రాపర్టీ కార్డులు జారీ అయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. గతంలో ప్రాపర్టీ కార్డులు లేకపోవడం వల్ల గ్రామాల్లో అనేక వివాదాలు, కోర్టు కేసులు ఉండేవని, వాటిని ఇప్పుడు పరిష్కరించామని తెలిపారు. ఈ ప్రాపర్టీ కార్డులను ఉపయోగించి ఇప్పుడు గ్రామస్తులు బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారని, తద్వారా వారు వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి పొందడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు.
తాను పేర్కొన్న ఈ మార్పుల నుంచి అత్యధిక లాభం పొందుతున్నవారు దేశ యువతేనని శ్రీ మోదీ తెలిపారు. "వికసిత భారత్ లో యువతే అతి పెద్ద భాగస్వాములు. వారు ఈరోజు భారతదేశపు ఎక్స్ -ఫాక్టర్. ఇక్కడ ఎక్స్ అంటే ప్రయోగాలు,ప్రతిభ, విస్తరణకు సంకేతం“ అని ప్రధానమంత్రి వివరించారు. పాత పద్ధతులను దాటి, ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా, 140 కోట్ల మంది భారతీయులకు ఆవిష్కరణలను పెంచడం ద్వారా యువత కొత్త మార్గాలను సృష్టించిందని ఆయన వివరించారు. దేశంలోని ప్రధాన సమస్యలకు యువత పరిష్కారాలను అందించగలదని, అయితే ఈ సామర్థ్యాన్ని ఇంతకు ముందు ఉపయోగించుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ను నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు 10 లక్షలమంది యువత పాల్గొన్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు పరిపాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఈ యువ భాగస్వాములకు అందించాయని, వారు సుమారు 2,500 పరిష్కారాలను అభివృద్ధి చేశారని శ్రీ మోదీ తెలిపారు. హ్యాకథాన్ సంస్కృతిని రిపబ్లిక్ టీవీ కూడా ప్రోత్సహిస్తుండటం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
" గడచిన దశాబ్దంలో, దేశం కొత్త తరం పాలనను అనుభవించింది, ప్రభావం లేని పరిపాలనను ప్రభావవంతమైన పాలనగా మార్చింది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గతంలో ఈ పథకాలు ఉన్నప్పటికీ తొలిసారిగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నామని ప్రజలు తరచూ చెబుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడున్న తేడా చివరి లబ్దిదారు వరకు సేవలు చేరడమే అని ఆయన అన్నారు. గతంలో పేదల కోసం ఇళ్లు కేవలం కాగితాలపై మంజూరు అయ్యేవని, కానీ ఇప్పుడు వాటిని నిజంగా నిర్మిస్తున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉండేదని, , డిజైన్, నిర్మాణ సామగ్రి మొదలైన అన్నింటినీ ప్రభుత్వమే నిర్ణయించేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇంటి డిజైన్ ను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించి లబ్ధిదారుడి ఖాతాకు నగదు బదిలీ చేస్తోందని ప్రధాని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఇళ్ల డిజైన్ల కోసం దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించామని, దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం పెరిగిందని ప్రధాని అన్నారు. గతంలో అసంపూర్తి ఇళ్లను అందచేసేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం పేదలకు వారు కోరుకున్న విధంగా ఇళ్లను నిర్మించి, నీటి కనెక్షన్లు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, సౌభాగ్య పథకం కింద విద్యుత్ కనెక్షన్లు ఇస్తోందన్నారు. “మేము కేవలం నాలుగు గోడలు కట్టలేదు, ఈ ఇళ్లకు జీవం పోశాం” అని పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి జాతీయ భద్రత ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భద్రతను పెంపొందించడానికి గత దశాబ్దంలో చేసిన గణనీయమైన కృషిని వివరించారు. ఇంతకుముందు టీవీల్లో వరుస బాంబు పేలుళ్ల బ్రేకింగ్ వార్తలు, స్లీపర్ సెల్ నెట్ వర్క్ లపై ప్రత్యేక కార్యక్రమాలు సర్వసాధారణమని, కానీ నేడు టీవీ తెరలపైగానీ, భారత గడ్డపై గానీ ఇలాంటి ఘటనలు లేవని ఆయన అన్నారు. తీవ్రవాదం ఇప్పుడు తుది శ్వాస విడిచిందని, ప్రభావిత జిల్లాల సంఖ్య వందకు పైగా నుంచి రెండు డజన్లకు తగ్గిందని ఆయన చెప్పారు. దేశమే తొలి ప్రాధాన్యం - స్ఫూర్తితో పనిచేయడం, పాలనను క్షేత్రస్థాయికి తీసుకురావడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. ఈ జిల్లాల్లో వేల కిలోమీటర్ల రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, 4జీ మొబైల్ నెట్వర్క్లను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.ఈ ఫలితాలు ఇప్పుడు అందరూ చూసే స్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సాహసోపేతమైన ప్రభుత్వ చర్యల కారణంగా నక్సలిజాన్ని అటవీ ప్రాంతాల నుండి పూర్తిగా తరిమికొట్టగలిగారు, కానీ ఇప్పుడు అది పట్టణ కేంద్రాలకు వ్యాపిస్తోందని ఆయన హెచ్చరించారు. “అర్బన్ నక్సల్స్” అనే పేరుతో వేగంగా విస్తరిస్తూ, గతంలో తమను వ్యతిరేకించి భారత వారసత్వంలో పాతుకుపోయిన గాంధేయ భావజాలంతో ప్రేరణ పొందిన రాజకీయ పార్టీల్లోకి ప్రవేశిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అర్బన్ నక్సల్స్ స్వరాలు, భాష ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయని, ఇది వారి లోతైన ఉనికిని సూచిస్తుందని, అర్బన్ నక్సల్స్ భారతదేశ అభివృద్ధి, వారసత్వానికి గట్టి వ్యతిరేకులని ఆయన హెచ్చరించారు. అర్బన్ నక్సల్స్ ను బహిర్గతం చేయడంలో శ్రీ అర్నబ్ గోస్వామి చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి అభివృద్ధిని, వారసత్వాన్ని రెండింటినీ బలోపేతం చేయడం అవసరమని స్పష్టం చేశారు. అర్బన్ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
"ప్రతి సవాలును ఎదుర్కోవడం ద్వారా నేటి భారతదేశం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది" అని శ్రీ మోదీ అన్నారు, ‘ దేశమే తొలి ప్రాధాన్యం‘ స్ఫూర్తితో రిపబ్లిక్ టీవీ నెట్వర్క్ జర్నలిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. రిపబ్లిక్ టీవీ జర్నలిజం అభివృద్ధి చెందిన భారతదేశ ఆకాంక్షలను ఉత్తేజపరుస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.
(Release ID: 2158707)
Read this release in:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam