ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-మారిషస్ సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి పత్రికా ప్రకటన

Posted On: 12 MAR 2025 3:03PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులాం గారికి, ఇరుదేశాల ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, నమస్కారం, బోంజోర్!


మారిషస్ జాతీయ దినోత్సవ సందర్భంగా 140కోట్ల మంది భారతీయుల తరపున మారిషస్ ప్రజలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరోసారి జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా మారిషస్‌ను సందర్శించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సదవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులాం గారికి అలాగే మారిషస్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


మిత్రులారా,

మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కూడా మనల్ని కలిపి ఉంచుతున్నాయి. ఆర్థిక, సామాజిక వృద్ధిలో భాగస్వాములుగా ఉన్న మన ఇరుదేశాలు.. ప్రకృతి విపత్తులు, కోవిడ్ మహమ్మారి వంటి కష్ట సమయాలను పరస్పర సహకారంతో ధైర్యంగా ఎదుర్కొన్నాయి. భద్రత, విద్య, ఆరోగ్యం, అంతరిక్షం ఇలా ఏ రంగంలోనైనా ఇరుదేశాలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. గత దశాబ్ధ కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగ్గా కొనసాగిస్తూ అభివృద్ధిలో సహకారం, సామర్థ్యాలను మెరుగుపరిచే రంగాల్లోనూ మనం సరికొత్త రికార్డులను నమోదు చేశాం.

మారిషస్ కు సరికొత్త వేగాన్ని జోడించిన మెట్రో ఎక్స్‌ప్రెస్,

న్యాయాన్ని అందించే అత్యున్నత వేదికగా సుప్రీం కోర్టు భవనం,

సౌకర్యవంతమైన నివాసం కోసం సామాజిక గృహాలు,

మంచి ఆరోగ్యం కోసం ఈఎన్‌టీ ఆసుపత్రి,

వాణిజ్యం, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేందుకు యూపీఐ, రూపే కార్డులు;

చౌకైన, నాణ్యమైన ఔషధాల కోసం జన్ ఔషధీ కేంద్రాలు,

ఇలాంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను మనం సకాలంలో పూర్తి చేసుకున్నాం. అగాలేగాలో కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా చిడో తుఫాను సమయంలో బాధితులకు మానవతా సాయాన్ని వేగంగా అందించగలిగాం, ఎంతో మంది ప్రాణాలను సైతం కాపాడగలిగాం. ఇంతకుముందే మేం క్యాప్ మల్హ్యూరెక్స్ ఏరియా ఆసుపత్రితో పాటు ఇరవై కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాం. మరికాసేపట్లో “అటల్ బిహారీ వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నేవేషన్” సంస్థను నా చేతుల మీదుగా ప్రారంభించి, మారిషస్‌కు అప్పగించే అరుదైన గౌరవం నాకు లభించింది.

మిత్రులారా,

ఈ రెండు దేశాల బంధాన్ని “మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య” హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, నేను నిర్ణయించాం. మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లివంటి భారత్ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం. మారిషస్‌లోని 100కిలోమీటర్ల పొడవైన నీటి పైపు ఆధునికీకరణకు కృషి చేయనున్నాం.

రెండో దశ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో భాగంగా 500 మిలియన్ మారిషియన్ రూపాయల విలువైన పనులను ప్రారంభించనున్నాం. రానున్న ఐదేళ్ల కాలంలో ఐదువందల మంది సివిల్ సర్వెంట్స్ భారత్‌లో శిక్షణ పొందనున్నారు. అలాగే, ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీని వినియోగించాలని ఒప్పందం చేసుకున్నాం.

మిత్రులారా,

రక్షణ రంగంలో సహకారం, సముద్ర భద్రతలు మా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైనవిగా ప్రధానమంత్రి, నేను గుర్తించాం. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన, భద్రతకు హామీ గల, సురక్షితమైన హిందూ మహాసముద్రం మా ఉమ్మడి ప్రాధాన్యంగా ఉంది. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతకు పూర్తి మద్దతునందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇందుకోసం తీరప్రాంత భద్రతా దళాలకు సహకారాన్ని సాధ్యమైనంత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.

మారిషస్‌లో పోలీస్ అకాడమీ, నేషనల్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, వైట్ షిప్పింగ్, బ్లూ ఎకానమీ అలాగే హైడ్రోగ్రఫీలో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నాం.

చాగోస్ విషయంలో మారిషస్ సార్వభౌమత్వాన్ని మేం పూర్తిగా గౌరవిస్తాం. కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అలాగే ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వంటి వేదికల ద్వారా మా సహకారాన్ని విస్తరిస్తాం.

మిత్రులారా,

ఇరుదేశాల ప్రజల మధ్య బంధం మా భాగస్వామ్యానికి పునాది. డిజిటల్ హెల్త్, ఆయుష్ కేంద్రాలు, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, మొబిలిటీ వంటి రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించనున్నాం. మానవాళి అభివృద్ధి కోసం ఏఐ, డీపీఐ అంటే డిజిటల్ ప్రజా మాలికసదుపాయాలను ఉపయోగించుకునేందుకు మేం కలిసి పనిచేస్తాం.

చార్‌ధామ్ యాత్ర, రామాయణ్ యాత్ర కోసం భారత్‌లో పర్యటించే మారిషస్ ప్రజల కోసం అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ప్రాచీన గిర్మితీయ సంస్కృతి పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రాధాన్యమిస్తాం.


మిత్రులారా,

గ్లోబల్ సౌత్, హిందూ మహాసముద్రం, ఆఫ్రికా ఖండం ఇలా ప్రాంతం ఏదైనా మారిషస్ ఎల్లప్పుడూ మా ముఖ్య భాగస్వామిగా ఉంది. పది సంవత్సరాల క్రితం ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్’ అంటే సంక్షిప్తంగా ‘సాగర్‌’కు మారిషస్ నుంచే పునాది వేశాం. ఈ ప్రాంత శ్రేయస్సు, స్థిరత్వం కోసం ‘సాగర్’ విజన్‌తో ముందుకు వచ్చాం.

గ్లోబల్ సౌత్ దేశాల కోసం ‘మహాసాగర్’ అంటే ‘మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్’ విజన్‌ను ప్రకటిస్తున్నాం. వాణిజ్యం, పరస్పర భద్రత అంశాలపై దానికింద పనిచేస్తాం. అభివృద్ధి కోసం వాణిజ్యం, స్థిరమైన వృద్ధి కోసం సామర్థ్యాలను మెరుగుపరచడం అలాగే ఉమ్మడి భవిష్యత్తు కోసం పరస్పర భద్రత అనే అంశాలు దీనిలో భాగంగా ఉంటాయి. దీనికోసం టెక్నాలజీ షేరింగ్, రాయితీ రుణాలు, గ్రాంట్‌ల ద్వారా సహకారాన్ని విస్తరిస్తాం.

గౌరవనీయా,
ఎంతో ప్రేమ, ఆదరణతో నన్ను స్వాగతించిన మీకు, మారిషస్ ప్రజలకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత్‌ను సందర్శించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీకు స్వాగతం పలికేందుకు భారత్ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటుంది.

అందరికీ ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2158703) Visitor Counter : 9