ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన 2024 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్రైనీలు
విశ్వబంధుగా భారత్ పోషిస్తోన్న పాత్ర గురించి వారితో మాట్లాడిన ప్రధాని
అవసరంలో ఉన్న దేశాల విషయంలో మొదట స్పందించే దేశంగా భారత్ మారిన తీరును ఉదాహరణలతో సహా వివరించిన ప్రధాని
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నందున భవిష్యత్తులో
దౌత్యవేత్తలుగా భావి ఆఫీసర్ ట్రైనీల ప్రాముఖ్యతను చర్చించిన ప్రధాని
సాంకేతికత ఆధారిత ప్రపంచంలో కమ్యూనికేషన్ పాత్ర ముఖ్యమన్న ప్రధాని
వివిధ దేశాల యువతలో భారత్ పట్ల ఉత్సుకతను క్విజ్‌లు, చర్చల ద్వారా పెంపొందించాలని కోరిన మోదీ
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ఈ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్న ప్రధాని
Posted On:
19 AUG 2025 8:34PM by PIB Hyderabad
2024 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం 7- లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను కలిశారు. ఈ బ్యాచ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 33 మంది అధికారులు ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న బహుళ ధృవ ప్రపంచం గురించి మాట్లాడారు. అందరితో స్నేహంగా మెలుగుతూ విశ్వబంధుగా భారత్‌కు ఉన్న ప్రత్యేక పాత్ర గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అవసరంలో ఉన్న దేశాల విషయంలో మొదట స్పందించే దేశంగా భారత్ అవతరించిన తీరును ఉదాహరణలతో సహా వివరించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు సహాయం చేసేందుకు భారత్ చేపట్టిన సామర్థ్య నిర్మాణ పనులు, ఇతర కార్యక్రమాలను ప్రధానంగా పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో కొత్తగా వస్తున్న తీరుతెన్నులను, ప్రపంచ స్థాయి సంస్థల్లో వాటి ప్రాముఖ్యత గురించి ప్రధాని చర్చించారు. ప్రపంచ స్థాయి వేదికలపై విశ్వబందుగా భారత్ చేస్తోన్న ప్రయాణంలో దౌత్యవేత్తలు పోషిస్తున్న కీలక పాత్ర గురించి ఆయన మాట్లాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు భవిష్యత్తులో దౌత్యవేత్తలుగా ఉండే ఆఫీసర్ ట్రైనీల ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు.
ఆఫీసర్ ట్రైనీలతో ప్రధానమంత్రి చాలా సేపు పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇప్పటి వరకూ వారు గడించిన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తమ శిక్షణ, పరిశోధన కార్యక్రమాల నుంచి నేర్చుకున్న విషయాలను, అనుభవాలను వారు ప్రధానితో పంచుకున్నారు. వాటిలో సముద్రాల విషయంలో దౌత్యం, ఏఐ - సెమీకండక్టర్, ఆయుర్వేదం, సాంస్కృతిక సంబంధాలు, ఆహారం, సాఫ్ట్ పవర్ వంటి అంశాలు ఉన్నాయి.
మీ భారత్ గురించి తెలుసుకోండి (నో యువర్ భారత్) క్విజ్‌లు, చర్చలతో వివిధ దేశాలలోని యువతలో భారత్ పట్ల ఉత్సుకతను పెంపొందించాలని ప్రధాని కోరారు. ఈ క్విజ్‌లోని ప్రశ్నలను తప్పకుండా తాజాగా మార్చాలని అన్నారు. మహాకుంభ్, గంగైకొండ చోళపురం ఆలయానికి 1000 సంవత్సరాల పూర్తి తదితర విషయాలతో దేశానికి సంబంధించిన సమకాలీన అంశాలను చేర్చాలని కూడా ఆయన తెలిపారు.
సాంకేతికతతో నడిచే ప్రపంచంలో కమ్యూనికేషన్‌కు ఉన్న ముఖ్యమైన పాత్రను ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. దేశం చేపడుతోన్న అనేక ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వెబ్‌సైట్‌లను చూడాలని.. ప్రవాసులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం ఈ వెబ్‌సైట్‌లను ఏ విధంగా మెరుగుపరచవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని వారిని కోరారు.
అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించడంపై ఆయన మాట్లాడారు. ఈ రంగంలోని భారతీయ అంకురాల పరిధిని విస్తరించడానికి ఇతర దేశాలలో అవకాశాలను అన్వేషించే అంశంపై ప్రధానంగా పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి అన్నారు.
(Release ID: 2158249)
Read this release in:
Gujarati
,
Malayalam
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada