కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
యువత ఉపాధిని పెంచేందుకు ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రకటించిన మోదీ
దాదాపు రూ. 1 లక్ష కోట్ల వ్యయం, 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం
భారీగా ఉపాధి కల్పనకు మద్దతివ్వటం ద్వారా స్వతంత్ర భారత్, సమృద్ధి భారత్‌కు ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయనున్న పథకం
Posted On:
15 AUG 2025 2:32PM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుస్కరించుకొని చారిత్రక ఎర్రకోట నుంచి చేసిన తన 12వ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రకటించారు. ఈ పథకానికి రూ. 1 లక్ష కోట్ల వ్యయం కానుంది. రెండు సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతివ్వాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కొత్తగా ఉద్యోగం చేస్తోన్న యువతకు రెండు విడతలుగా రూ. 15,000 వరకు అందించనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే యాజమాన్యానికి ప్రతి కొత్త ఉద్యోగానికి నెలకు 3000 వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వనుంది.
ఈ పథకంలో ముఖ్యంశాలు:
విభాగం ఏ - మొదటిసారి ఉద్యోగులకు సహాయం:
ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఈ పథకం రెండు విడతలుగా రూ. 15,000 వరకు ఒక నెల జీతాన్ని ఈపీఎఫ్ అందిస్తుంది. రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు ప్రోత్సాహకాలకు అర్హులు. 6 నెలల ఉద్యోగం తర్వాత మొదటి విడత చెల్లిస్తారు. రెండో విడతను 12 నెలల ఉద్యోగం అనంతరం ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఇస్తారు. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సహాయంలో కొంత భాగాన్ని బ్యాంకు ఖాతాలో నిర్ణీత కాలానికి పొదుపు చేస్తారు. దీనిని గడువు అనంతరం ఉద్యోగి తీసుకోవచ్చు.
ఈ విభాగం కింద దాదాపు 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
విభాగం బీ - యాజమాన్యానికి ప్రోత్సాహకాలు:
ఈ భాగం అన్ని రంగాలలో అదనపు ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇది తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. రూ. లక్ష వరకు జీతం ఉన్న కొత్త ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యాలు ప్రోత్సాహకాలు పొందుతాయి. కనీసం ఆరు నెలల పాటు ఉండే ప్రతి అదనపు ఉద్యోగానికి నెలకు రూ. 3000 వరకు ప్రోత్సాహకాలను యాజమాన్యానికి ప్రభుత్వం అందిస్తుంది. తయారీ రంగం విషయంలో ప్రోత్సాహకాలు 3వ, 4వ సంవత్సరాలకు కూడా అందుతాయి.
ఈ భాగం దాదాపు 2.60 కోట్ల మందికి అదనపు ఉపాధి కల్పించడానికి యజమాన్యాలను ప్రోత్సహిస్తుందన్న అంచనా ఉంది.
ప్రోత్సాహక చెల్లింపు విధానం: పథకంలోని విభాగం- ఏ కింద మొదటిసారి ఉద్యోగులకు జరిగే చెల్లింపులు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ( ఆధార్ బేస్డ్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్- ఏబీపీఎస్) ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) పద్ధతిలో చేయనున్నారు. విభాగం- బీ కింద యజమానులకు అందే ప్రోత్సాహకాలను నేరుగా వారి పాన్ కార్డుకు అనుసంధానమై ఉన్న ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సహక పథకంతో ప్రభుత్వం అన్ని రంగాలలో, ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగ సృష్టిని వేగవంతం చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా మొదటిసారిగా పనిలో చేరే యువతను ప్రోత్సహించనుంది. ఈ పథకం కోట్లాది మంది యువతీయువకులకు సామాజిక భద్రతను అందించటం ద్వారా దేశ శ్రామిక శక్తిని వ్యవస్థీకృతం చేయడమే దీనిలోని ముఖ్యమైన అంశం.
***
(Release ID: 2156908)