ప్రధాన మంత్రి కార్యాలయం
రైతులు దేశానికి వెన్నెముక: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ప్రశంస
Posted On:
15 AUG 2025 12:02PM by PIB Hyderabad
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ రైతులకు ప్రశంసలు అందించారు. పరాధీనత నుంచి స్వావలంబన దిశగా జరిగిన జాతి ప్రయాణంలో వారు వెన్నెముకగా నిలిచారన్నారు. వలస పాలన దేశాన్ని పేదరికంలో ముంచిందనీ, అయితే, రైతుల అవిశ్రాంత కృషి వల్లే భారత ధాన్యాగారాలు నిండి, దేశం పూర్తి స్వతంత్రతను సాధించిందన్నారు. రైతుల పట్ల కృతజ్ఞతా భావం, భారత వ్యవసాయం భవిష్యత్తు దార్శనికత ఆయన ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.
రైతులు - భారత ప్రగతికి వెన్నెముక
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రైతులు, పశు పోషకులు, మత్స్యకారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. వివిధ రంగాల్లో భారత్ స్థానం నేడు ఇలా ఉంది:
-
పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం.
-
బియ్యం, గోధుమలు, పత్తి, పండ్లు, కూరగాయల్లో రెండో స్థానం.
వ్యవసాయ ఎగుమతులు ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లు దాటాయి. ప్రాంతీయంగా అంతరాలను మరింత తగ్గించడం కోసం ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనను ప్రభుత్వం ప్రకటించింది. 100 అత్యంత వెనుకబడిన వ్యవసాయ జిల్లాల అభివృద్ధి దీని లక్ష్యం.
“రైతులు, మత్స్యకారులు, పశు పోషకులకు మోడీ ఎప్పుడూ రక్షణ కవచంగా ఉంటాను” అంటూ తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సింధు జలాల ఒప్పందం - దేశ ప్రయోజనాలే ప్రధానం
సింధూ జలాల ఒప్పందం న్యాయబద్ధంగా లేదన్న శ్రీ మోదీ.. ఇప్పుడున్న ఒప్పందం భారత రైతులకు కీడు చేసిందన్నారు. భారత్ ఇకపై ఈ తరహా ఏకపక్ష ఒప్పందాన్ని అంగీకరించబోదని, సొంత వ్యవసాయ క్షేత్రాలు, ప్రజల కోసం తనకు హక్కుగా ఉన్న నీటి వాటాను తిరిగి పొందుతుందని ఆయన ప్రకటించారు.
వ్యవసాయ స్వావలంబన – ఎరువులు, ఉత్పాదకాలు
ఆహార భద్రత కోసం దిగుమతులపై ఆధారపడకూడదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. భారత రైతులు సాధికారత సాధించేలా, దేశంలో వ్యవసాయం స్వతంత్ర అభివృద్ధికి భరోసానిస్తూ... ఎరువులు, కీలక ఉత్పాదకాలను దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రైతుల సంక్షేమానికే కాకుండా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయడానికి కూడా కీలకమని ఆయన అన్నారు.
మన పథకాలతో... మరింత నమ్మకంతో రైతులు:
చిన్న రైతులు, పశు పెంపకందారులు లేదా మత్స్యకారులు.. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా అందరూ ప్రయోజనం పొందుతున్నారన్నారు. రైతు శక్తియుక్తులను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వర్షపు నీటి సంరక్షణ, నీటిపారుదల ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాల పంపిణీ, సకాలంలో ఎరువుల సరఫరా వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
రైతులకు రక్షణ కవచం
“భారత్‌లోని రైతులు, పశు పోషకులు, మత్స్యకారులకు కీడు చేసే ఏ విధానాలకు మోదీ అడ్డుగోడలా నిలుస్తాడు. భారత్ రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడదు” అంటూ శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఈ అంశానికి సంబంధించిన ప్రసంగాన్ని ఆయన ఇక్కడితో ముగించారు.
***
(Release ID: 2156798)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam