ప్రధాన మంత్రి కార్యాలయం
18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
* భారత్‌లో సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి; శతాబ్దాలుగా భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు... పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు: పీఎం
* లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఖగోళ పరిశోధన శాలల్లో ఒకటి సముద్రమట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో.. నక్షత్రాలు చేతికి అందేంత దగ్గరగా ఉంది: పీఎం
* శాస్త్రీయ ఆసక్తిని ప్రోత్సహించడానికి, యువ మేధను శక్తిమంతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది: పీఎం
* ఈ విశ్వాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు.. భూమిపై ఉన్న ప్రజల జీవితాలను అంతరిక్ష శాస్త్రం ఎలా మెరుగుపరచగలదో ఆలోచించాలి: పీఎం
* అంతర్జాతీయ సహకార శక్తిని భారత్ విశ్వసిస్తుంది, ఆ స్ఫూర్తి ఈ ఒలింపియాడ్‌లో ప్రతిబింబిస్తుంది: పీఎం
Posted On:
12 AUG 2025 7:03PM by PIB Hyderabad
18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 64 దేశాలకు చెందిన సుమారు 300 మందిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ ఒలింపియాడ్ కోసం భారత్ వచ్చిన వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘‘భారత్‌లో సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి. శతాబ్దాలుగా, భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు’’ అని శ్రీ మోదీ తెలిపారు. సున్నాను కనుగొన్న, భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా చెప్పిన ఆర్యభట్టను ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘ఆయన సున్నా నుంచి ప్రారంభించి చరిత్రను సృష్టించారు!’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
‘‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఖగోళ పరిశోధన శాలల్లో ఒకటి భారత్‌లోని లదాఖ్‌లో ఉంది. సముద్రమట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో.. నక్షత్రాలు చేతికి అందేంత దగ్గరగా ఉంది!’’ అని శ్రీ మోదీ వివరించారు. అలాగే పుణేలో ఉన్న పెద్ద మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ గురించి వివరిస్తూ.. దీనిని ప్రపంచంలోనే అతి సున్నితమైన రేడియో టెలిస్కోపుల్లో ఒకటిగా వర్ణించారు. ఇది పల్సర్లు, క్వాసార్లు, గెలాక్సీల రహస్యాన్ని ఛేదించేందుకు దోహదపడుతోందని వివరించారు. అలాగే స్క్వేర్ కిలోమీటర్ అర్రే, లిగో-ఇండియా తరహా అంతర్జాతీయ మెగా సైన్సు ప్రాజెక్టులకు భారత్ సగర్వంగా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన మొదటి మిషన్‌గా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. ఆదిత్య-ఎల్1 సోలార్ అబ్జర్వేటరీ ద్వారా సూర్యునిపై భారత్ ఇప్పుడు దృష్టి సారించిందని వెల్లడించారు. ఇది సౌర జ్వాలలు, తుఫానులు, సూర్యునిలో వచ్చే మార్పులను గమనిస్తుందని తెలియజేశారు. అలాగే గత నెలలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన చరిత్రాత్మక యాత్రను పూర్తి చేశారని, ఇది భారతీయులందరికీ గర్వకారణమని, యువ పరిశోధకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
శాస్త్రీయ ఆసక్తిని ప్రోత్సహించడానికి, యువ మేధను శక్తిమంతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ద్వారా 10 మిలియన్ల మందికి పైగా విద్యార్థులు స్టెమ్ అంశాలను ప్రయోగాత్మకంగా అర్థం చేసుకుంటున్నారని వివరించారు. తద్వారా అభ్యాసం, ఆవిష్కరణలు అనే సంస్కృతి రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. అందరికీ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని ప్రారంభించామని శ్రీ మోదీ తెలిపారు. ఇది మిలియన్ల మంది విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ జర్నళ్ళను ఉచితంగా అందిస్తోందన్నారు. స్టెమ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. వివిధ కార్యక్రమాల ద్వారా పరిశోధనా రంగంలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. భారత్‌లో చదువుకోవాలని, పరిశోధనలు చేపట్టాలని, సహకారం అందించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ మేధావులను ప్రధాని ఆహ్వానించారు. ‘‘ఇలాంటి భాగస్వామ్యాల నుంచి అతి పెద్ద శాస్త్రీయ పురోగతి వస్తుందేమో! ఎవరు ఊహించగలరు?’’ అని పేర్కొన్నారు.
మానవాళికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని శ్రీ మోదీ ప్రోత్సహించారు. అలాగే అంతరిక్ష శాస్త్రం భూమి మీద ఉన్నవారి జీవితాలను ఎలా మెరుగుపరచగలదనే దిశగా ఆలోచించాలని కోరారు. రైతులకు మెరుగైన వాతావరణ సూచనలు ఎలా అందించవచ్చు? ప్రకృతి వైపర్యీత్యాలను ముందే గుర్తించగలమా? అటవీ అగ్ని ప్రమాదాలను, కరిగిపోతున్న హిమనీ నదాలను పర్యవేక్షించగలమా? మారుమూల ప్రాంతాల్లో మెరుగైన సమాచార వ్యవస్థను నిర్మించగలమా? అనే ముఖ్యమైన ప్రశ్నలను వారి ముందుంచారు. అలాగే సైన్సు భవిష్యత్తు యువ మేధావుల చేతుల్లోనే ఉందని, ఊహ, కరుణతో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘అక్కడ ఏముంది?’’ అనే ప్రశ్నించాలని, అది భూమిపై మానవాళి జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘అంతర్జాతీయ సహకార శక్తిని భారత్ విశ్వసిస్తుంది. ఆ స్ఫూర్తి ఈ ఒలింపియాడ్‌లో ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధానమంత్రి తెలియజేశారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇదే పెద్ద ఒలింపియాడ్ అని గుర్తించారు. ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసిన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని, పెద్ద కలలు కనాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సూచించారు. ‘‘భారత్‌లో ఆకాశమే హద్దు కాదని, అదే ప్రారంభమని విశ్వసిస్తామని గుర్తుంచుకోండి’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2155939)
Read this release in:
Odia
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada