నౌకారవాణా మంత్రిత్వ శాఖ
మర్చంట్ షిప్పింగ్ బిల్లు- 2025కు పార్లమెంటు ఆమోదం
· రాజ్యసభ అంగీకారం పొందిన బిల్లు
· ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నాలుగు కీలక నౌకా రవాణా సంస్కరణల బిల్లుల ఆమోదంతో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ చరిత్రాత్మక విజయం
· ఈ పునరుద్ధరించిన నౌకా రవాణా విధానం ఆత్మనిర్భర దృక్పథంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమైన ‘వికసిత భారత్’ దిశగా నడిపిస్తుంది: శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
11 AUG 2025 8:20PM by PIB Hyderabad
మర్చంట్ షిప్పింగ్ బిల్లు- 2025 రాజ్యసభలోనూ అంగీకారం పొందడంతో పార్లమెంటు ఆమోదం లభించినట్లయింది. దేశ నౌకా రవాణా వ్యవస్థ ఆధునికీకరణ, అంతర్జాతీయంగా అత్యుత్తమ పద్ధతులు- అంతర్జాతీయ నౌకా రవాణా సంస్థ (ఐఎంవో) ఒడంబడికకు అనుగుణంగా దేశీయ చట్టాలు ఉండేలా చూడడం, ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా భారత నౌకా రవాణా రంగం సర్వసన్నద్ధంగా ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా రూపొందించిన ఈ బిల్లు ఓ కీలకమైన శాసన చర్య.
ప్రస్తుత సమావేశాల్లో ఆగస్టు 6న లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడంతో.. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి (ఎంవోపీఎస్‌డబ్ల్యూ) శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ బిల్లును పరిశీలన కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
‘‘భారత్‌ను విశ్వసనీయ నౌకా వాణిజ్య కేంద్రంగా నిలిపే దిశగా ఓ నిశ్చయాత్మక ముందడుగు’’ అని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ బిల్లును అభివర్ణించారు. నియంత్రణపరమైన భారీ విధానాల నుంచి అనుకూలమైన విధాన వాతావరణం దిశగా ఈ బిల్లుతో భారీ మార్పులు రాబోతున్నాయి. ‘‘ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మన నౌకా రవాణా వ్యవస్థను కాపాడుతూ, సముద్ర శక్తిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది’’ అని శ్రీ సోనోవాల్ అన్నారు. “ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను ఇందులో స్వీకరించాం, ఇది అనుమతి భారాలను తగ్గిస్తుంది, మన అంతర్జాతీయ కట్టుబాట్లను సమగ్రంగా అందిపుచ్చుకుంటుంది... ఇవన్నీ ఈ రంగంలో వృద్ధిని, సుస్థిరతను ముందుకు తీసుకెళ్తాయి. కాలం చెల్లిన, భారంతో కూడిన వ్యవస్థను.. పురోగామి దృక్పథంతో, క్రమబద్ధీకరించిన ఏర్పాట్ల ద్వారా ఈ బిల్లు భర్తీ చేస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వం వల్లే ఇది సాధ్యమైంది. సముద్ర వాణిజ్య కేంద్రంగా భారత్ ఆర్థిక సామర్థ్యాన్ని ఈ బిల్లు పెంచుతుంది. మన నౌకల స్థూల పరిమాణాన్ని (టన్నేజ్ అండర్ అవర్ ఫ్లాగ్) పెంచుతుంది. అనుమతి సంబంధిత భారాలను తగ్గించడంతోపాటు మన తీర ప్రాంతానికి భద్రతనిస్తుంది.
ఒకే పార్లమెంటు సమావేశంలో రికార్డు సంఖ్యలో నౌకా రవాణా రంగ చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా.. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శాసన సంస్కరణల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. నౌకా రవాణా రంగంలో భారత్‌ను అంతర్జాతీయ అగ్రగామిగా నిలపడంలో, వికసిత భారత్‌కు బలమైన పునాదులను వేయడంలో ప్రభుత్వ అంకితభావాన్ని ఈ చరిత్రాత్మక బిల్లు స్పష్టం చేస్తోంది.
561 సెక్షన్లున్న 1958 నాటి భారీ, కాలంచెల్లిన మర్చంట్ షిప్పింగ్ చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును ఆమోదించారు. 16 విభాగాలు, 325 నిబంధనలతో క్రమబద్ధీకరించిన ఏర్పాట్లను ఇది అందిస్తుంది. ప్రధాన అంతర్జాతీయ ఒడంబడికల కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను భారత్ సమగ్రంగా స్వీకరించేలా చూస్తుంది. అనుమతి భారాలను తగ్గించి వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రయాణంలో భద్రతను పెంచడంతోపాటు మెరుగైన నౌకాయాన అనుభవాన్ని అందిస్తుంది. సముద్ర పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది. అత్యవసర సంసిద్ధతను, నౌకా సంబంధిత రక్షణ కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది. భారత నౌకల స్థూల పరిమాణాన్ని (టన్నేజ్ అండర్ ఇండియన్ ఫ్లాగ్) విశేషంగా పెంచుతుంది. భారత తీరప్రాంత, సముద్ర ప్రయోజనాలను కాపాడుతుంది.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలో మన నౌకా రవాణా రంగం ఆశాజనకంగా ముందుకు సాగుతోంది. సమర్థమైన విధానపరమైన ఏర్పాట్లు, భవిష్యత్ సన్నద్ధతతో శక్తిమంతంగా ఎదుగుతోంది. ప్రపంచంలో అగ్రగామి సముద్ర శక్తిగా భారత్‌ను నిలపడమే లక్ష్యం’’ అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. “మన ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో సింహభాగాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఆర్థిక వృద్ధిని ముందుకు నడుపుతుంది, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది, వికసిత భారత్ లక్ష్యానికి ప్రత్యక్షంగా దోహదపడుతుంది.”
మన దృష్టి కేవలం నియంత్రణా ధోరణి నుంచి సాధికారత దిశగా మళ్లుతోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తద్వారా దేశ సముద్ర పరిధితో ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాల కల్పన, సుస్థిరాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ఈ విధానాన్ని రూపొందించారు.
మంత్రిత్వ శాఖ చరిత్రలో అత్యంత సమగ్రమైన శాసనపరమైన చర్య ఇది. ప్రపంచంలోని సముద్రయానికుల సంఖ్య పరంగా అతిపెద్ద దేశాల్లో ఒకటిగా, అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలలో కీలక పాత్రధారిగా భారత్ ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది. “అంతర్జాతీయ సముద్ర ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌ను నిలపడమేకాకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే ప్రస్థానంలో మన ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు కీలక పాత్ర పోషించేలా ఈ సంస్కరణల ద్వారా వేదికను సిద్ధం చేస్తున్నాం” అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
****
(Release ID: 2155367)
Visitor Counter : 5