ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 10 AUG 2025 4:20PM by PIB Hyderabad

నమస్కారం. 

बेंगळूरु नगरदा आत्मीया नागरिका बंधु-भगिनियरेनिमगेल्ला नन्ना नमस्कारगळु! 

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...

కర్ణాటకలో అడుగు పెట్టగానే మనకు ఓ ఆత్మీయానుభూతి కలుగుతుంది. ఇక్కడి సంస్కృతి, ఇక్కడి ప్రజల ప్రేమ, కన్నడ భాషా మాధుర్యం మన హృదయాలను తాకుతాయి. ముందుగా బెంగళూరు నగర అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయ్‌కు పాదాభివందనం. శతాబ్దాల కిందట నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది వేశారు. సంప్రదాయాలతో పెనవేసుకోవడంతోపాటు పురోగతిలోనూ ఈ నగరం అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆయన స్వప్నించారు. బెంగళూరు ఆ స్ఫూర్తిని నిలబెట్టుకుంది. ఎల్లవేళలా దానిని కాపాడుకుంది. మరి నేడు బెంగళూరు నగరం ఆ కలను సాకారం చేసుకుంటోంది.

మిత్రులారా, 

మనం చూస్తున్నాం... నవ భారత పురోగమనానికి ప్రతీకగా నిలిచిన నగరంగా బెంగళూరు నేడు వెలుగొందుతోంది. తాత్విక జ్ఞానాన్ని చెక్కుచెదరనీయక.. కార్యాచరణలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచ ఐటీ పటంలో భారత పతాక సగర్వంగా రెపరెపలాడేలా నిలిపిన నగరం బెంగళూరు. బెంగళూరు విజయగాథ వెనుక ఎవరైనా ఉన్నారంటే అదిక్కడి ప్రజలే. మీ కృషి, మీ ప్రతిభ వల్లే ఇది సాధ్యపడింది.

మిత్రులారా, 

21వ శతాబ్దంలో నగరాల అభివృద్ధి ప్రణాళికలు, పట్టణ మౌలిక వసతులు అత్యంత కీలకమైన అవసరాలు. బెంగళూరు వంటి నగరాలను భవిష్యత్తు పయనానికి సిద్ధం చేయాలి. ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం బెంగళూరుకు వేల కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులను అందించింది. ఈ రోజు మరో ముందడుగు పడింది. బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ఈరోజు ప్రారంభమైంది. మెట్రో మూడో  దశకూ పునాది పడింది. అలాగే, దేశంలోని విభిన్న ప్రాంతాలను అనుసంధానించే మూడు కొత్త వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపాం. బెంగళూరు- బెలగావి వందే భారత్ సేవల  ప్రారంభంతో  బెలగావిలో వాణిజ్య, పర్యాటక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. దీనితోపాటు నాగ్‌పూర్ నుంచి పూణేకు, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి అమృత్‌సర్‌కు కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఇవి లక్షలాది భక్తులకు ప్రయోజనం చేకూర్చి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ ప్రాజెక్టులు, కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా బెంగళూరు, కర్ణాటకతోపాటు యావద్దేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఆపరేషన్ సిందూర్ తర్వాత నేను ఈరోజు మొదటిసారి బెంగళూరుకు వచ్చాను. సరిహద్దు వెంబడి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయగల మన సత్తా, ఉగ్రవాదులను రక్షించేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్‌ను కొన్ని గంటల్లోనే మోకరిల్లేలా చేయగల మన సమర్థత... ఇలా ఆపరేషన్ సిందూర్‌లో భారత బలగాల విజయం నవ భారతావని కొత్త రూపాన్ని ప్రపంచానికి చాటింది. రక్షణ రంగంలో సాంకేతిక శక్తి, మేకిన్ ఇండియా బలం ఈ విజయానికి ప్రధాన కారణం. బెంగళూరు, కర్ణాటక యువత కూడా దీనికి ఎంతగానో దోహదపడ్డారు. మీ అందరికీ అభినందనలు.

మిత్రులారా,

ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా బెంగళూరు గుర్తింపు పొందింది. భారత్ ప్రపంచస్థాయిలో పోటీపడడమే కాకుండా ముందంజలో నిలవాలి. మన నగరాలు అధునాతనంగా, వేగంగా, సమర్థంగా మారినప్పుడే పురోగతి సాధ్యపడుతుంది. అందుకే ఆధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తిచేయడంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ఈరోజు ప్రారంభమైంది. ఇది బెంగళూరులోని అనేక ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తుంది. బసవనగుడి - ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ప్రయాణ సమయం కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గుతుంది. ఇది లక్షలాది మందికి జీవన సౌలభ్యాన్ని అందించడంతోపాటు పని సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.

మిత్రులారా,

నేడు యెల్లో లైన్ ప్రారంభంతోపాటు మెట్రో మూడో దశ- అంటే ఆరెంజ్ లైన్‌కు కూడా శంకుస్థాపన చేశాం. ఇది కూడా అందుబాటులోకి వస్తే రెండింటితో కలిపి రోజూ 25 లక్షల ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది.. 25 లక్షల ప్రయాణికులుఇది బెంగళూరు రవాణా వ్యవస్థను మరింత శక్తిమంతం చేసి కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.

మిత్రులారా, 

దేశంలో ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి బెంగళూరు మెట్రో ఆదర్శంగా నిలిచింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, బయోకాన్, డెల్టా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు పలు ముఖ్యమైన స్టేషన్లకు కొంతమేర నిధులు సమకూర్చాయి. ఈ వినూత్న సీఎస్‌ఆర్‌ ప్రయత్నం ఓ సరికొత్త ప్రేరణను అందిస్తుంది. ఈ సహకారాన్నందించిన కార్పొరేట్ రంగానికి అభినందనలు.

మిత్రులారా, 

భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. గత పదకొండు సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పదో స్థానం నుంచి ప్రపంచంలోని అయిదు అగ్రగామి వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడు తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారే దిశగా వేగంగా పయనిస్తున్నాం. ఈ వేగం మనకెలా వచ్చింది? సంస్కరణ - ఆచరణ - పరివర్తన... ఈ స్ఫూర్తే మనకు ఈ వేగాన్నిచ్చింది. కచ్చితమైన సంకల్పం, నిజాయితీతో కూడిన కృషి వల్లే మనం ఈ వేగాన్ని సాధించాం. ఓసారి గుర్తుచేసుకోండి.. 2014లో మెట్రో సేవలు కేవలం అయిదు నగరాలకే పరిమితమై ఉన్నాయి. ఈ రోజు 24 నగరాల్లో 1,000 కి.మీకుపైగా మెట్రో నెట్వర్క్ విస్తరించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్ నిలిచింది.  2014కు ముందు- అదీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు రైల్వే మార్గాల్లో కేవలం 20,000 కి.మీ మాత్రమే విద్యుదీకరణ జరగగా.. గత పదకొండు సంవత్సరాల్లోనే 40,000 కి.మీ.కుపైగా రైల్వే మార్గాలను మేం విద్యుదీకరించాం.

మిత్రులారా, 

నీరు, భూమి, ఆకాశం... భారత విజయాలు సర్వత్రా విస్తరించాయి. మిత్రులారా, భారత్ విజయాలు పుడమికే పరిమితం కాలేదు. మన విజయ కేతనం ఆకాశంలోనూ రెపరెపలాడుతోంది. 2014 వరకు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండగా, నేడు ఆ సంఖ్య 160 దాటింది. వాయు, భూ మార్గాల మాదిరిగాన జలమార్గాల్లోనూ అద్భుత పురోగతి సాధించాం. 2014లో కేవలం మూడు జాతీయ జలమార్గాలే కార్యకలాపాలు నిర్వహిస్తూండగా.. ఇప్పుడా సంఖ్య 30కి పెరిగింది.

మిత్రులారా,

ఆరోగ్య, విద్యా రంగాల్లోనూ భారత్ విశేషంగా పురోగమించింది. 2014 వరకు దేశంలో కేవలం 7 ఎయిమ్స్, 387 వైద్య కళాశాలలే ఉండేవి. ఈ రోజు 22 ఎయిమ్స్, 704 వైద్య కళాశాలలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వైద్య విద్యలో లక్షకు పైగా కొత్త సీట్లు పెరిగాయి. మన మధ్యతరగతి పిల్లలు దీనిద్వారా ఎంతగా లాభపడ్డారో మీరే ఊహించండిగత 11 సంవత్సరాల్లో ఐఐటీల సంఖ్య కూడా 16 నుంచి 23కు, ట్రిపుల్ ఐటీల సంఖ్య 9 నుంచి 25కు, ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కు పెరిగింది. అంటే ఈ రోజు విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

మిత్రులారా,

ఈరోజు దేశం ఎంత వేగంగా పురోగమిస్తోందో పేదలు, అణగారిన వర్గాల జీవితాలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లను అందించాం. ప్రభుత్వం మరో 3 కోట్లు ఇళ్లు నిర్మించడానికి సిద్ధంగా ఉంది. 11 సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించాం. ఇది కోట్లాది తల్లులు, అక్కాచెల్లెళ్లకు గౌరవాన్ని, శుభ్రత, భద్రతను అందించింది.

మిత్రులారా,

దేశంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి భారత ఆర్థిక వృద్ధే ప్రధాన కారణం. 2014కు ముందు భారత మొత్తం ఎగుమతులు 468 బిలియన్ డాలర్లు ఉండగా.. ఈరోజు అది 824 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతంలో భారత్ మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు మొబైల్ హ్యాండ్‌సెట్లను ఎగుమతి చేసే అయిదు అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మార్పులో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. 2014కు ముందు భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు 6 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడవి దాదాపు 38 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

మిత్రులారా, 

పదకొండు సంవత్సరాల కిందట భారత ఆటోమొబైల్ ఎగుమతులు సుమారు 16 బిలియన్ డాలర్లు ఉండగా, ఈరోజు అవి రెండింతలకు పైగా పెరిగి.. భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా నిలిపాయి. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. కలిసికట్టుగా ముందుకు సాగుతూ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుకుందాం.

మిత్రులారా,

ఈ వికసిత భారత, నవభారత ప్రస్థానం.. డిజిటల్ ఇండియాతో దశలవారీగా పూర్తవుతుంది. ఇండియా ఏఐ మిషన్ వంటి పథకాలతో ఆ రంగంలో అంతర్జాతీయ అగ్రగామిగా నిలిచే దిశగా భారత్ నేడు ముందుకు సాగుతోంది. సెమీకండక్టర్ మిషన్ కూడా వేగం పుంజుకుంటోంది. భారత్‌కు త్వరలోనే మేడిన్ ఇండియా చిప్‌లు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో కూడిన హైటెక్ అంతరిక్ష కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా భారత్ నేడు మారుపేరుగా నిలిచింది. అంటే, భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అన్ని అవకాశాల్లోనూ భారత్ ముందుకు సాగుతోంది. భారత్ సాధించిన ఈ పురోగతిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే- పేదల సాధికారత! మీరే చూడండి, నేడు డిజిటలైజేషన్ దేశంలో ఊరూరికీ చేరుకుంది. ప్రపంచంలోని రియల్ టైమ్ లావాదేవీల్లో 50 శాతానికిపైగా భారత్‌లోనే యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచంలో 50శాతం! సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య దూరాన్ని మేం తగ్గిస్తున్నాం. నేడు దేశంలో 2200 కన్నా ఎక్కువ ప్రభుత్వ సేవలు మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉమాంగ్ యాప్ సాయంతో.. సగటు పౌరుడు ఇంటి దగ్గరినుంచే ప్రభుత్వ పనులను పూర్తి చేసుకుంటున్నాడు. డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్ల నిర్వహణలోని ఇబ్బందులు తొలగిపోయాయి. భారత్ ఇప్పుడు ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపు వంటి సాంకేతికతల్లోనూ పెట్టుబడులు పెడుతోంది. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకూ చేరేలా చేయడమే మా లక్ష్యం. ఈ దిశగా బెంగళూరు క్రియాశీలంగా కృషిచేస్తోంది.

మిత్రులారా, 

మన తదుపరి ప్రధాన లక్ష్యం సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడమే. భారతీయ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. మొత్తం ప్రపంచానికీ సాఫ్ట్‌వేర్, ఉత్పత్తులను అభివృద్ధి చేశాయి. ఇప్పుడు భారత్ సొంత అవసరాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధిలో మనం మరింత వేగంగా ముందుకెళ్లాలి. నేడు ప్రతి రంగంలోనూ సాఫ్ట్‌వేర్, యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ రంగంలో భారత్ ఉన్నత శిఖరాలను చేరుకోవాల్సిన అవసరముంది. అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ ముందంజలో ఉండేలా మనం కృషిచేయాలి. మేక్ ఇన్ ఇండియాలో, తయారీ రంగాల్లో బెంగళూరు, కర్ణాటక పాత్రను మరింత బలమైన పాత్ర పోషించాలి. అలాగే మన ఉత్పత్తులు ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ ప్రమాణాలతో అత్యంత నాణ్యంగా ఉండాలని కోరుతున్నాను. అంటే అవి నాణ్యతా లోపంలేకుండా, వాటి తయారీ పర్యావరణ హితంగా ఉండాలి. ప్రతిభావంతులైన కర్ణాటక వాసులు ఆత్మనిర్భర భారత్ లక్ష్యం దిశగా ముందుండి నడిపిస్తారన్న నమ్మకం నాకుంది.

మిత్రులారా, 

కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాం. దేశప్రజల అభ్యున్నతి కోసం మనం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి. కొత్త సంస్కరణల అమలు ఈ దిశగా ఓ కీలక బాధ్యత. గత దశాబ్దం కాలంలో మేం ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలను రూపొందించాం. ఉదాహరణకు, చట్టాలను డీక్రిమినలైజ్ చేయడానికి జన విశ్వాస్ బిల్లును ఆమోదించాం. జనవిశ్వాస్ 2.0ను కూడా ఆమోదించబోతున్నాం. అవసరం లేని క్రిమినల్ నిబంధనలతో ఉన్న చట్టాలను గుర్తించి, వాటిని తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రాలు కూడా తమ అధికారుల కోసం ఈ అభ్యసన వ్యవస్థను స్వీకరించవచ్చు. ఆశావహ జిల్లాల కార్యక్రమం, ఆశావహ బ్లాక్ కార్యక్రమంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. అలాగే, రాష్ట్రాలు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమైన ప్రాంతాలను గుర్తించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనూ నిరంతర సంస్కరణలను మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ సమష్టి కృషి కర్ణాటకను అభివృద్ధిలో అత్యున్నతంగా నిలుపుతుందన్న నమ్మకం నాకుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సమష్టిగా నెరవేర్చుకుందాం. ఈ ఆకాంక్షతో.. అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

***


(Release ID: 2154964)