మంత్రిమండలి
‘ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల (ఎస్‌డీపీ)’ కింద అసోం, త్రిపుర రాష్ట్రాల్లో నాలుగు కొత్త కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం
మొత్తం వ్యయం రూ. 4,250 కోట్లు
Posted On:
08 AUG 2025 4:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర పథకమైన ‘ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల (ఎస్డీపీ)’ ద్వారా మొత్తం రూ. 4,250 కోట్ల వ్యయంతో అసోం, త్రిపుర రాష్ట్రాల్లో నాలుగు కొత్త కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది.
వివరాలు:
అసోం ఆదివాసీ ప్రజలతో భారత ప్రభుత్వం, అసోం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు.. అక్కడి ఆదివాసీ నివాస గ్రామాలు/ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.500 కోట్లు.
అసోంకు చెందిన దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) / దిమాసా పీపుల్స్ సుప్రీం కౌన్సిల్ (డీపీఎస్సీ) గ్రూపులతో భారత ప్రభుత్వం, అసోం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. అసోంలోని ఆ గ్రూపుల నివాస గ్రామాలు/ ప్రాంతాలున్న నార్త్ కేచర్ హిల్స్ స్వయంపాలిత మండలి (ఎన్సీహెచ్ఏసీ) ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు.
అసోం ఉల్ఫా గ్రూపులతో భారత ప్రభుత్వం, అసోం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అసోంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,000 కోట్లు.
త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ట్విప్రా (ఎన్ఎల్ఎఫ్‌టీ), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ఏటీటీఎఫ్) గ్రూపులతో భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. త్రిపుర గిరిజనుల అభివృద్ధికి రూ.250 కోట్లు.
ఆర్థిక అంశాలు:
ప్రతిపాదిత నాలుగు కొత్త కార్యక్రమాల మొత్తం వ్యయం రూ.7,250 కోట్లు. ఇందులో రూ.4,250 కోట్లను ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల’ పథకం ద్వారా (అసోంకు రూ. 4,000 కోట్లు, త్రిపురకు రూ. 250 కోట్లు) అందిస్తారు. మిగతా రూ.3,000 కోట్లను అసోం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
భారత ప్రభుత్వం, అసోం - త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత తెగ సమూహాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఈ రూ.4,250 కోట్ల కేటాయింపులు ఉంటాయి. అసోంలో చేపట్టిన మూడు కార్యక్రమాలకు 2025-26 నుంచి 2029-30 వరకు అయిదేళ్ల కాలానికి రూ.4,000 కోట్లను అందిస్తారు. అలాగే త్రిపురలోని ఒక కార్యక్రమానికి 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి రూ. 250 కోట్లను కేటాయిస్తారు.
ఉపాధి కల్పన, ఇతర అవకాశాలు:
మౌలిక సదుపాయాలు, జీవనోపాధి ప్రాజెక్టులతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
నైపుణ్యాభివృద్ధి, ఆదాయ కల్పన, పరిశ్రమలను నెలకొల్పే దిశగా స్థానికులను ప్రోత్సహించడం ద్వారా యువత, మహిళలకు ప్రయోజనం కలుగుతుంది.
ప్రభావిత సమూహాలకు స్థిరత్వాన్నివ్వడంతోపాటు వారిని ప్రధాన స్రవంతిలోకి తెస్తుందని భావిస్తున్నారు.
ప్రయోజనాలు:
ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది కింది అంశాల ద్వారా సమానావకాశాలను ప్రోత్సహిస్తుంది:
ఇప్పుడున్న వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా తగినంత ప్రయోజనం పొందని అత్యంత దుర్బల, అణగారిన వర్గాల ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం,
యువత, మహిళలకు జీవనోపాధి కార్యకలాపాల ద్వారా.. ఉపాధి అవకాశాలను పెంచడం, ఆరోగ్య సేవలను అందించడం, విద్య – నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం, ఆదాయ మార్గాలను పెంచడం,
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక పెరిగేలా చేయడం.. తద్వారా ఈశాన్య ప్రాంత ప్రజలకు అదనపు ఉపాధి, జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి.
దీని ద్వారా అసోంలోని ఆదివాసీ, దిమాసా సమూహాలకు చెందిన లక్షలాది ప్రజలకు, ఆ రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారికి, త్రిపురలోని గిరిజన తెగలకు చెందిన లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వ ‘ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు (ఎస్డీపీ)’ పథకం కింద చేపట్టిన కొత్త కార్యక్రమమిది. ఒప్పందాల మేరకు గతంలో చేపట్టిన కార్యక్రమాలు (ఉదా: బోడో, కర్బీ గ్రూపులు) శాంతిని నెలకొల్పే దిశగానూ అభివృద్ధిలోనూ సానుకూల ఫలితాలనిచ్చాయి.
నేపథ్యం:
భారత ప్రభుత్వం, అసోం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా తెగ సమూహాలతో (ఆదివాసీ గ్రూపులు - 2022, డీఎన్ఎల్ఏ/ డీపీఎస్సీ- 2023, ఉల్ఫా - 2023, ఎన్ఎల్ఎఫ్‌టీ/ ఏటీటీఎఫ్ - 2024) ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. మౌలిక సదుపాయాలు, సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల ద్వారా శాంతి, సమ్మిళిత అభివృద్ధి, పునరావాసాన్ని ప్రోత్సహించడం వీటి లక్ష్యం.
***
(Release ID: 2154308)
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam