నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఒకే రోజు రెండు కీలక నౌకా వాణిజ్య బిల్లులను ఆమోదించిన పార్లమెంటు
నౌకాయాన మంత్రిత్వ శాఖ చరిత్రలో మొదటిసారి ఈ పరిణామం
భారత ఆధునిక నౌకాయానం కోసం మోదీ ప్రభుత్వం చేస్తోన్న కృషికి పార్లమెంటు రెట్టింపు ఆమోదం ఇచ్చింది: శ్రీ
శర్బానంద సోనోవాల్
నౌకా వాణిజ్యం విషయంలో భారత్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునికీకరించనున్న ‘వాణిజ్య నౌకాయాన బిల్లు - 2025’కు ఆమోదం తెలిపిన లోక్‌సభ
ఆధునిక, అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా ఉన్న వాణిజ్య నౌకాయాన బిల్లు
సులభతర వ్యాపారాన్ని పెంపొందించటం, దేశ నౌకాయాన రంగాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా తయారు చేసే ‘సముద్రాల ద్వారా వస్తు రవాణా బిల్లు, 2025’ను ఆమోదించిన రాజ్యసభ
Posted On:
06 AUG 2025 6:16PM by PIB Hyderabad
భారత పార్లమెంటు చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. బుధవారం ఒకే రోజు నౌకా వాణిజ్యానికి సంబంధించిన రెండు కీలక బిల్లులను ఆమోదించింది. ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటి సారి. వీటి ఆమోదంతో పార్లమెంటు.. దేశంలో ఆధునిక, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి విధానానికి మార్గం సుగమం చేసింది. ఆధునిక, అంతర్జాతీయ అనుకూల నౌకా వాణిజ్య అధికారిక ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన 'వాణిజ్య నౌకాయాన బిల్లు- 2025 (మర్చంట్ షిప్పింగ్ బిల్లు)'ను లోక్‌సభ ఆమోదించింది. 'నౌకల ద్వారా వస్తు రవాణా బిల్లు, 2025'ను రాజ్యసభ ఆమోదించింది. శతాబ్దాల నుంచి ఉన్న వలసరాజ్యాల నాటి చట్టం స్థానంలో దీనిని తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించటంతో పాటు భారతదేశ నౌకాయాన రంగాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా తయారుచేయనుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఓడరేవులు, నౌకాయనం, జలమార్గాల మంత్రి (ఎంఓపీఎస్‌డబ్ల్యూ) శ్రీ శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. "మంత్రిత్వ శాఖలోని అందరికీ ఈ రోజు చారిత్రాత్మకమైనది. వాణిజ్య నౌకాయాన బిల్లు- 2025, నౌకల ద్వారా వస్తు రవాణా బిల్లు - 2025.. ఈ రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. విధానపరంగా, కార్యాచరణపరంగా భారత నౌకా వాణిజ్యాన్ని ఆధునికీకరించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఇది తెలియజేస్తోంది. ఆధునిక భారత నౌకాయానం విషయంలో మోదీ ప్రభుత్వం చేస్తోన్న కృషికి ఈ రెండు బిల్లులకు పార్లమెంట్ నుంచి రెట్టింపు ఆమోదం లభించింది” అని అన్నారు.
1958 నాటి పాత చట్టం స్థానంలో ప్రగతిశీల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న చట్టాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో వాణిజ్య నౌకాయాన బిల్లు-2025ను రూపొందించారు. నౌకావాణిజ్యంలో భారత చట్టాలు, నిబంధనలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చటంతో పాటు విశ్వసనీయ నౌకావాణిజ్యంలో కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ బిల్లు ఒక ప్రధాన మెట్టుగా పరిగణిస్తున్నారు.
వాణిజ్య నౌకాయాన బిల్లు-2025ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్.. “నౌకావాణిజ్యం, నియంత్రణకు సంబంధించి భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబెట్టే దిశగా ఈ బిల్లు ఒక నిర్ణయాత్మక పురోగతి అవుతుంది. అంతర్జాతీయ నౌకా వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా, ఈ రంగంలో ప్రముఖంగా ఉన్న దేశాల ఉత్తమ పద్ధతులను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన ప్రగతిశీల, అధునాతన చట్టం ఇది” అని అన్నారు.
నౌకాయానం, నౌకావాణిజ్యంలో గణనీయమైన వృద్ధి సాధించాలనే ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా చేపడుతోన్న వరుస కీలక చట్ట సంస్కరణల్లో ఇది ఒకటి. ఈ సంస్కరణలు సామర్థ్యం, పారదర్శకత, ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచాయి. ఆధునికీకరించిన ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని మంత్రి ప్రధానంగా పేర్కొంటూ.. 561 సెక్షన్‌లతో ఉన్న వాణిజ్య నౌకాయాన చట్టం-1958 భారీగా, అతుకుల బొంతలా, పాతదిగా మారిందని అన్నారు. నౌకా వాణిజ్యంలో సమకాలీన సవాళ్లను పరిష్కరించడంలో, కీలకమైన పలు అంతర్జాతీయ నౌకావాణిజ్య సంస్థల (ఐఎంఓ) ఒప్పందాల ప్రకారం బాధ్యతలను పూర్తిగా నిర్వహించటంలో ఇది విఫలమౌతోందని అన్నారు.
“16 భాగాలు, 325 నిబంధనలతో ఉన్న వాణిజ్య నౌకాయాన బిల్లు-2025.. సముద్రాల్లో భద్రతను పెంచటం, అత్యవసరంగా స్పందించే వ్యవస్థను మెరుగుపరచటం, పర్యావరణ పరిరక్షణను నిర్ధారించటం ద్వారా అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా భారత నౌకా వాణిజ్య చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునికీకరిస్తుంది. ఇది చట్టపరమైన భారాన్ని తగ్గించి భారత టన్నేజిని ప్రోత్సహించటంతో పాటు నావికుల సంక్షేమం, నౌకా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. నౌకా వాణిజ్యంలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా భారత్‌ను మార్చాలని..ఈ రంగంలో సుస్థిర వృద్ధి, పెట్టుబడులు, ఆవిష్కరణల సామర్థ్యపు ద్వారాలు తెరవాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.” అని శ్రీ సోనోవాల్ తెలిపారు.
మరోవైపు శతాబ్దాల నాటి పాత చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో తీసుకొచ్చిన సముద్రాల ద్వారా వస్తు రవాణా బిల్లు-2025ను రాజ్యసభ ఆమోదించింది. కాలం చెల్లిన వలస కాలం నాటి చట్టాలను తొలగించటం ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో ఉన్న ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా దేశ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న విస్తృత చర్యల్లో ఈ బిల్లు ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా నౌకా వాణిజ్య ప్రమాణంగా ఉన్న, బ్రిటన్ లాంటి దేశాలు అనుసరిస్తోన్న హేగ్-విస్బీ నియమాలను ఈ బిల్లులో పొందుపరిచారు. సంక్లిష్టత స్థానంలో స్పష్టతను తీసుకురావటం ద్వారా ఈ చట్టం సముద్ర వాణిజ్య నిబంధనలను సరళీకృతం చేస్తుందని, వ్యాజ్యాలు నమోదయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. సముద్రాల ద్వారా సరుకు రవాణాలో పారదర్శకత, వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లును ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ.. “రాజ్యాంగానికి ముందు నాటి ఈ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం అనేది వలసవాద మనస్తత్వానికి సంబంధించిన అన్ని అవశేషాలను తొలగించేందుకు.. సరళమైన, హేతుబద్ధమైన చట్టాల ద్వారా అర్థం చేసుకోవటం, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యల్లో ఒకటి. ఈ బిల్లు కేవలం చట్టబద్ధమైన సంస్కరణ కాదు. ఇది సంక్లిష్టత స్థానంలో స్పష్టత, పాత నిబంధనల స్థానంలో ఆధునిక ప్రామాణిక నిబంధనలు, వలసవాద చట్టాల స్థానంలో ముందు చూపుతో కూడిన, దేశ ప్రయోజనాలకు సంబంధించిన చట్టాలను తీసుకురావాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విస్తృత ఆలోచనను తెలియజేస్తోంది” అని అన్నారు.
భారతదేశ నౌకా వాణిజ్య చట్టాలను భవిష్యత్తుకు సిద్ధంగా తయారుచేయటం, బ్రిటన్‌తో సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందంతో (సీఈటీఏ) సహా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా మార్చడంలో ఈ బిల్లు ఒక కీలక ముందడుగు. ఈ బిల్లును 2025 మార్చి 28న లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభలో చర్చ సందర్భంగా సముద్ర భద్రత, స్మగ్లింగ్ వంటి సమస్యల గురించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వీటిని చట్టపరమైన, నిర్వహణ నిబంధనల ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలలో అధికార, విపక్షాల విస్తృత మద్దతు లభించింది.
***
(Release ID: 2153432)