ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్తవ్య భవన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని


* ప్రజాసేవ పట్ల మా అచంచల నిబద్ధతకు అద్దంపడుతున్న కర్తవ్యభవన్: ప్రధానమంత్రి

* భవనం ప్రాంగణంలో మొక్కను నాటిన ప్రధాని.. పర్యావరణానుకూల పద్ధతిలో భవనాన్ని నిర్మించారంటూ ప్రశంసలు

Posted On: 06 AUG 2025 3:28PM by PIB Hyderabad

కర్తవ్య భవన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.  ప్రజాసేవ పట్ల దృఢసంకల్పానికి, నిరంతర కృషికి ఈ భవనంఒక ప్రతీక అని ఆయన అభివర్ణించారు.

విధానాలు, పథకాలను త్వరిత గతిన అమలుపరచడంలో కర్తవ్య భవన్ సహాయపడడంతో పాటు దేశాభివృద్ధికి సరికొత్త జోరును కూడా అందిస్తుందని ఆయన అన్నారు.

అభివృద్ధి చెందిన, స్వయంసమృద్ధ భారత్‌‌ను ఆవిష్కరించాలన్న తమ నిబద్ధతను కర్తవ్య భవన్ చాటిచెబుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కర్తవ్య భవన్‌ను సాకారం చేసింది మన శ్రమయోగులు.. వారి అలుపెరగని కఠిన శ్రమను, దృఢదీక్షను ఇవాళ దేశం కళ్లారా చూస్తోంది అని ప్రధాని అన్నారు. శ్రమయోగులతో ఆయన భేటీ అయ్యారు. వారితో మాట్లాడడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

భవన నిర్మాణంలో పర్యావరణానుకూల పద్ధతులను తూచా తప్పక అనుసరించారని ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా, కర్తవ్య  భవన్ ఆవరణలో ప్రధానమంత్రి ఒక మొక్కను కూడా నాటారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాని తన స్పందనను ఇలా పంచుకున్నారు:

 ‘‘కర్తవ్య పథ్‌ పక్కనే కర్తవ్య భవన్ ఏర్పాటు కావడం ప్రజాసేవలో తరించాలన్న మా తిరుగులేని సంకల్పానికి, నిరంతర కృషికి ప్రతీక. ఇది మా విధానాలను, పథకాలను వేగంగా ప్రజల చెంతకు చేర్చడంలో సాయపడడం ఒక్కటే కాకుండా, దేశాభివృద్ధికి కొత్త జోరును కూడా అందిస్తుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు కొలువుదీరిన ఈ  భవనాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో గౌరవమని నేను భావిస్తున్నా.’’

‘‘వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ .. ఈ ఆశయాల సాధన పట్ల మనకున్న నిబద్ధతను కర్తవ్య భవన్ చాటిచెబుతోంది. ఈ భవనాన్ని తీర్చిదిద్దిన మన శ్రమయోగుల అలుపెరగని శ్రమను, సంకల్ప శక్తిని మన దేశ ప్రజలు ఇవాళ గమనించారు. ఈ శ్రమయోగులతో మాట్లాడినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.’’

 ‘‘కర్తవ్య భవన్ నిర్మాణంలో పర్యావరణ సంరక్షణ పట్ల పూర్తి శ్రద్ధ కనబరిచారు. పర్యావరణ పరిరక్షణకు మన దేశం కట్టుబడి ఉంది. నా అదృష్టం.. ఇవాళ ఈ భవనం ప్రాంగణంలో ఒక మొక్కను నాటాను.’’‌


 

***


(Release ID: 2153132)