రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 ఖరీఫ్ సీజన్‌లో తగినంత ఎరువుల లభ్యత

Posted On: 01 AUG 2025 4:07PM by PIB Hyderabad

ప్రస్తుత 2025 ఖరీఫ్ సీజన్‌లో దేశంలో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేఎస్ వంటి ఎరువుల లభ్యత తగినంతగా ఉంది.

దేశంలో సకాలంలో, తగినంతగా ఎరువులు లభ్యమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం ప్రతీ సీజన్‌లోనూ ఈ చర్యలు తీసుకుంటోంది:
ప్రతి పంట కాలం ప్రారంభానికి ముందు.. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ-ఎఫ్‌డబ్ల్యూ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రాల వారీగా, నెలవారీ ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తుంది.
అంచనా వేసిన అవసరాన్ని బట్టి.. నెలవారీ సరఫరా ప్రణాళిక ద్వారా ఎరువుల విభాగం రాష్ట్రాలకు తగిన పరిమాణంలో ఎరువులను కేటాయిస్తుంది. ఎరువుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
సమీకృత ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థ (ఐఎఫ్ఎంఎస్) అనే ఆన్లైన్ వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సబ్సిడీ ఎరువుల స్థితిగతులను పర్యవేక్షిస్తారు.
డీఏ-ఎఫ్‌డబ్ల్యూ, ఎరువుల విభాగం సంయుక్తంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఎరువుల పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటారు.
ఎరువును నిత్యావసర వస్తువుగా ప్రకటించి, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు- 1985, ఎరువుల (సరఫరా నియంత్రణ) ఉత్తర్వులు- 1973 కింద నోటిఫై చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు-1985 (ఎఫ్‌సీవో) నిబంధనలను ఉల్లంఘించి ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడిన ఎవరైనా వ్యక్తి/ ఎరువుల కంపెనీపై శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి ఎఫ్‌సీవో కింద రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత అధికారం ఉంది.
ప్రతి కొనుగోలుదారుకీ నెలకు 50 బస్తాల సబ్సిడీ ఎరువుల గరిష్ట పరిమితిని ఎరువుల విభాగం విధించింది. అంటే ఏడాదికి 600 బస్తాల సబ్సిడీ ఎరువులు. అంతేకాకుండా, ప్రతి జిల్లా నుంచి మొదటి 20 స్థానాల్లో ఉన్న కొనుగోలుదారుల నెలవారీ జాబితాను ఆయా జిల్లా మెజిస్ట్రేట్ల ఐఎఫ్ఎంఎస్ లాగిన్‌లో అందుబాటులో ఉంచుతారు. తద్వారా వారు తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది.

అంతేకాకుండా, ఓ డ్యాష్ బోర్డును కూడా ఎరువుల విభాగం రూపొందించింది. https://urvarak.nic.inలో ఆధీకృత వినియోగదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్యలు సులభంగా పర్యవేక్షించడానికి వీలుగా డ్యాష్ బోర్డును రూపొందించారు. ఐఎఫ్ఎంఎస్, ఇ-ఉర్వరక్ డ్యాష్ బోర్డు పోర్టళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎరువుల లభ్యత, సరఫరాను పర్యవేక్షిస్తున్నాయి.

రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2151589)