రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నౌకా దళ సిబ్బంది 47వ వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ఎం, ఎన్ఎం గ్రహీత వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్

Posted On: 01 AUG 2025 11:21AM by PIB Hyderabad

నౌకాదళ సిబ్బంది వైస్ చీఫ్ (వీసీఎన్ఎస్)గా ఏవీఎస్ఎం, ఎన్ఎం గ్రహీత వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు.

పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 71వ కోర్సు పూర్వ విద్యార్థి అయిన వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ భారత నౌకాదళంలో 1988 జనవరి 1న చేరారు. శతఘ్నులు, క్షిపణి వ్యవస్థల్లో నిపుణులైన ఆయన మూడు దశాబ్దాలకు పైగా ఉద్యోగ జీవితంలో విస్తృత శ్రేణిలో కమాండ్, నిర్వహణ, స్టాఫ్ అసైన్మెంట్లలో బాధ్యతలు చేపట్టారు.

నౌకాదళంలో గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ నిశాంక్‌తో సహా వివిధ యుద్ధ నౌకల్లో కమిషనింగ్ సిబ్బందిగా, తీర భద్రతా దళానికి చెందిన ఓపీవీ ఐసీజీఎస్ సంగ్రామ్‌లో ప్రి-కమిషనింగ్ సిబ్బందిగా పనిచేశారు. ఐఎన్ఎస్ మైసూర్‌కు ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేశారు. కోస్ట్ గార్డు నౌక సీ - 05, క్షిపణి నౌకలు ఐఎన్ఎస్ విభూతి, ఐఎన్ఎస్ నాశక్, క్షిపణి ప్రయోగ నౌక ఐఎన్ఎస్ కుథార్‌, గైడెడ్ క్షిపణి వాహక నౌక ఐఎన్ఎస్ సహ్యాద్రి (కమిషనింగ్ కమాండింగ్ అధికారి) లకు నాయకత్వం వహించారు. 2020, ఫిబ్రవరిలో, తూర్పు నౌకాదళానికి ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గాల్వాన్ ఘటన అనంతరం సముద్ర వాణిజ్య భద్రతను పెంపొందించేలా నిర్వహించిన వివిధ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.

వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కళాశాల, గోవాలోని నేవల్ వార్ కళాశాల, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. కీలకమైన వ్యూహాత్మక, విధాన ఆధారిత బాధ్యతల్లో తన ప్రతిభ కనబరిచారు. నౌకాదళ ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ పర్సన్ (విధానం), డైరెక్టర్ నేవల్ ప్లాన్స్ (నిర్ధిష్ట ప్రణాళిక), నౌకాదళ ప్రణాళిక ప్రిన్సిపల్ డైరెక్టర్ సహా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.

తూర్పు నావికా దళానికి నాయకత్వం వహించడానికంటే ముందు 2018 ఫిబ్రవరిలో నౌకాదళ సిబ్బంది అసిస్టెంట్ చీఫ్ (విధాన, ప్రణాళికలు)గా పదోన్నతి పొందారు. అసాధారణ నాయకత్వం, అత్యుత్తమ సేవలకు గాను 2021లో అతి విశిష్ట సేవా పతకం అందుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేశారు. 2021, డిసెంబరులో తూర్పు నావికా కమాండ్‌ (ఈఎన్‌సీ)కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియామకం పొందారు. ఈ హోదాలో ఈఎన్‌సీ కార్యనిర్వహణ సంసిద్ధత, సిబ్బంది అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.
వీసీఎన్ఎస్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఐడీఎస్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (డీసీఐడీఎస్)గా, డీసీఐడీఎస్ (విధానం, ప్రణాళికలు, సిబ్బంది అభివృద్ధి) పనిచేశారు. ఈ సమయంలో త్రివిధ దళాల్లో ఆపరేషన్ల సమన్వయం, ఏకీకరణ, సహకారాల విస్తరణ, దళాల అభివృద్ధి, స్వదేశీకరణను పెంపొందించడానికి విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌కు సరితతో వివాహమైంది. ఆయన కుమారుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కుమార్తె హ్యుమానిటీస్‌లో పట్టభద్రురాలు.

 

***


(Release ID: 2151423)