అంతరిక్ష విభాగం
శ్రీహరికోట నుంచి ఈ నెల 30న ‘‘నిసార్’’ ప్రయోగం… మరింతగా పెరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్యాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
* భారత్-అమెరికా విజ్ఞానశాస్త్ర సహకారంలో ఇదొక ప్రపంచ ప్రమాణమని ఉద్ఘాటన
* విపత్తులు, వ్యవసాయం, వాతావరణం వంటి అంశాలపై కీలక సమాచారాన్ని ప్రపంచానికి అందించనున్న ‘నిసార్’
* ‘విశ్వబంధు’గా మారాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు లోబడి ఈ ప్రయోగం: డాక్టర్ జితేంద్ర సింగ్ మానవాళి సమష్టి హితం కోరుతూ ప్రపంచ భాగస్వామ్య దేశంగా పాటుపడడమే ‘విశ్వబంధు’ దార్శనికత
* నిసార్ ఒక ఉపగ్రహం మాత్రమే కాదు.. ఇది ప్రపంచంతో భారత్‌కున్న విజ్ఞానశాస్త్ర సహకారానికి నిదర్శనం: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
27 JUL 2025 5:01PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, జులై 27: శ్రీహరికోట నుంచి ఈ నెల 30న ప్రయోగించనున్న ‘‘నిసార్’’ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో- అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింతగా పెంచుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చాలా కాలంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘నాసా’-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నిసార్) ఉపగ్రహ మిషన్‌ను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇస్రోతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్-స్పేస్ అడ్మినిస్ట్రేషన్- నాసా- ఆధ్వర్యంలో చేపట్టిన తొలి సంయుక్త భూ పరిశీలక మిషనే... ‘నిసార్’. భారత్-అమెరికా అంతరిక్ష రంగ సహకారంలోనూ, మొత్తంమీద ఇస్రో అంతర్జాతీయ సహకార ప్రాజెక్టుల్లోనూ- నిసార్ ప్రయోగ కార్యక్రమం కీలక మలుపును సూచిస్తోందని ఆయన అన్నారు. భారత్‌కు చెందిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్ సాయంతో ఈ మిషన్‌ను పూర్తి చేస్తారు.

ఈ ప్రయోగం భూగ్రహ పరిశీలన సంబంధిత ఉన్నత వ్యవస్థల రంగంలో ఒక విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా భారత్ ఎదుగుదలకు, వ్యూహాత్మక విజ్ఞానశాస్త్ర సంబంధిత భాగస్వామ్యాల పరిణతికి అద్దం పడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మిషన్ పురోగతిని ఎప్పటికప్పుడు ఆయన నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని చూడాలని ఉందని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నందు వల్ల తాను ఢిల్లీలో ఉండిపోవలసి వస్తుందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఈ మిషన్ కేవలం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడానికే పరిమితం కాదు.. ఇది సైన్సు పురోగతికి, ప్రపంచ సంక్షేమానికి కట్టుబడి ఉన్న రెండు ప్రజాస్వామ్య దేశాలు ఒకదానితో మరొకటి చేతులు కలిపితే ఏమేమి సాధించగలవనే దానిని సూచించే సందర్బం. నిసార్ ఒక్క భారత్‌కు, అమెరికాకు సేవలను అందించడమనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కీలక సమాచారాన్ని .. ప్రత్యేకించి విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ పరిశీలన వంటి రంగాలకు చెందిన సమాచారాన్ని అందిస్తుంది’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఈ ప్రయోగం భారత్ ‘విశ్వబంధు’గా, మానవ జాతి ఉమ్మడి హితం కోసం పాటుపడే ఒక గ్లోబల్ పార్ట్‌నర్‌గా..మారాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణాన్ని సాకారం చేస్తుందని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
నాసా, ఇస్రో.. ఈ రెండు ఏజెన్సీల సాంకేతిక నైపుణ్యాలను కలబోసుకొన్న మిషన్ ‘నిసార్’. నాసా ఈ మిషన్‌కు ఎల్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ను, ఒక ఉన్నత రేటింగు కలిగి ఉన్న టెలికమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్‌ను, జీపీఎస్ రిసీవర్లతో పాటు 12 మీటర్ల విస్తరణ సామర్ధ్యం కలిగిన యాంటెన్నాను సమకూర్చింది. ఇస్రో తన వంతుగా, ఎస్-బ్యాండ్ ఎస్ఏఆర్ పేలోడు, రెండు పేలోడ్‌లను మోయగలిగిన స్పేస్క్రాఫ్టు- జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 రకం లాంచ్ వెహికిల్‌తో పాటు ప్రయోగానికి కావలసిన ఇతర సేవలన్నింటినీ అందించింది. ఈ ఉపగ్రహం బరువు 2,392 కిలోలు. దీనిని సౌర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది మొత్తం భూమితో పాటు మంచు ఉపరితలాలను ప్రతి 12 రోజులకు ఒకసారి చొప్పున చిత్రాలు తీసి, పంపుతుంది.
సేవల దృష్టికోణంలో నుంచి చూసినప్పుడు, నిసార్ శక్తిసామర్థ్యాలు సంప్రదాయ భూ పరిశీలనకు మించి ఉంటాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ఇది పర్యావరణ అనుబంధ విస్తారిత వ్యవస్థలో చోటుచేసుకొనే మార్పులను నిరంతర ప్రాతిపదికన పర్యవేక్షించడంలో తోడ్పడుతుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో సహాయకారి అవుతుంది. భూ పొర, ఉపరితల స్థితులలో సూక్ష్మస్థాయి మార్పులను కూడా ఇది పసిగట్టగలుగుతుంది. ముఖ్యంగా, ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని సముద్ర మంచు వర్గీకరణ, నౌకల ఆనవాళ్లను గుర్తించడం, సముద్రతీర పర్యవేక్షణ, తుఫానులపై దృష్టి సారించడం, పంటల మ్యాపింగ్, నేలలోని తేమ స్థాయి ఎలాంటి మార్పు వస్తున్నదీ తెలుసుకోవవచ్చు. ఈ అంశాలు ప్రభుత్వాలకు, పరిశోధకులకు, విపత్తుల నిర్వహణ సంస్థలకు చాలా ముఖ్యం’’ అని ఆయన వివరించారు.
నిసార్ ఇచ్చే సమాచారాన్నంతటినీ పరిశీలించిన తరువాత ఒకటి రెండు రోజుల లోపల ఉచితంగా అందుబాటులో ఉంచడమనేది ఈ మిషన్‌లో ఒక ముఖ్యాంశం. అత్యవసర సందర్భాల్లో అయితే దాదాపు రియల్-టైం ప్రాతిపదికన సమాచారాన్ని సమకూర్చనున్నారు. డేటాను అన్ని సంబంధిత వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రపంచ దేశాల్లో విజ్ఞానశాస్త్ర సంబంధిత పరిశోధనతో పాటు నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో సహాయం లభించగలదని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ విధమైన సమాచారం అందుబాటులోలేని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ డేటా లభ్యత సానుకూలంగా ఉంటుంది.
ఉపగ్రహాన్ని సౌర-సమకాలిక ధృవ కక్ష్యలో ఉంచడానికి నిసార్ మిషన్‌లో మొదటిసారిగా జీఎస్ఎల్‌వీ రాకెట్‌ను ఉపయోగించటం గమనించదగ్గ విషయం. ఇది విభిన్న స్పేస్ మిషన్లకు అండదండలను అందించడంలో ఇస్రో సాంకేతిక పరిణతి అంతకంతకూ వృద్ధి చెందుతోందని సూచిస్తోంది. నిసార్‌కు జతచేసిన జంట రాడార్ పేలోడ్‌లు.. భూ పైభాగంలో 242 కి.మీ. మేర విస్తృత క్షేత్రాన్ని అన్ని రుతువులలోనూ, పగలూ-రాత్రి సమయాల్లోనూ అధిక స్పష్టతను కలిగి ఉండే చిత్రాలను తీయడానికి (ఇమేజింగ్) స్వీప్ ఎస్ఏఆర్ టెక్నాలజీని ఉపయోగించుకొంటాయి.
సుస్థిర అభివృద్ధి సాధన, వాతావరణ మార్పుల ఆటుపోట్లకు తట్టుకోగలగడం.. ఈ విషయాల్లో భూ పరిశీలక మిషన్లకున్న ప్రాధాన్యాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ‘‘నిసార్ లాంటి మిషన్లు ఇక విజ్ఞానశాస్త్ర పరమైన ఆసక్తికే పరిమితం కావు.. ప్రణాళిక రచన, నష్టభయ అంచనాలతో పాటు విధానాలను రూపొందించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. వాతావరణ మార్పు ప్రభావాలు తీవ్రతరం అవుతున్న కొద్దీ, ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడంలో నిసార్ వంటి ఉపగ్రహాల నుంచి సకాలంలో, కచ్చితమైన సమాచారాన్ని రాబట్టుకోవడం ఎంతైనా అవసరం’’ అని ఆయన అన్నారు.
ఈ మిషన్ తుదిరూపాన్ని పొందడానికి పది సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పట్టింది. దీనికోసం భారత్, అమెరికాలు కలిసి 1.5 బిలియన్ డాలర్లకు పైగానే పెట్టుబడి పెట్టాయి. అయితే ప్రపంచ దేశాలకు కలిగే మేలు, సాంకేతికంగా సాధించిన పురోగతి.. వీటి కోణంలో నుంచి చూసినప్పుడు దీని ఫలితాలు పెనుమార్పును తీసుకురాగలవని ఆశిస్తున్నారు. నిసార్‌ను ఎప్పుడు రోదసిలోకి పంపిస్తారా అని ప్రపంచమంతటా అంతరిక్ష సంస్థలతో పాటు పర్యావరణ రంగ పరిశోధకులు, విధాన రూపకర్తలు ఎదురుచూస్తున్నారు.
జులై 30 ఇక ఎంతో దూరంలో లేదు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారత్ అంతరిక్ష కార్యక్రమం సంప్రదాయ వినియోగ-ఆధారిత మిషన్ల స్థాయి నుంచి మెల్లమెల్లగా వేగాన్ని అందుకుని, ప్రపంచ దేశాలకు ఉపయోగపడే ఉమ్మడి వనరులకు దన్నుగా నిలిచే ఒక జ్ఞాన ప్రదాతగా మన దేశం ముందడుగు వేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. ‘‘నిసార్ ఒక ఉపగ్రహం మాత్రమే కాదు.. ఇది ప్రపంచంతో భారత్ విజ్ఞానశాస్త్ర సహకారానికి నిదర్శనం’’ అని ఆయన అభివర్ణించారు.
***
(Release ID: 2149283)