రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో మానవ రహిత ఏరియల్ వెహికిల్ నుంచి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే క్షిపణి -వీ3 ప్రయోగ పరీక్ష విజయవంతం

Posted On: 25 JUL 2025 2:47PM by PIB Hyderabad

భారత రక్షణ సత్తాకు ఒక ప్రధాన అండ దొరికింది... మానవ రహిత వాయుమార్గ  వాహనం  నుంచి ప్రయోగించిన,  లక్ష్యాన్ని కచ్చితంగా గురిచూసి మరీ  ఛేదించే క్షిపణి (అన్‌మాన్డ్ ఏరియల్  వెహికిల్ లాంచ్‌డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3ని రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో గల నేషనల్ ఓపెన్  ఏరియా రేంజి (ఎన్ఓఏఆర్) నుంచి ప్రయోగించింది. ఈ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. డీఆర్‌డీఓ ఇదివరకు అభివృద్ధిచేసి, అందించిన యూఎల్‌పీజీఎం-వీ2 క్షిపణికి కొన్ని మరింత మెరుగైన మార్పుచేర్పులు చేసి మరీ ఈ తాజా క్షిపణిని రూపొందించారు.

 సరికొత్త యూఎల్‌పీజీఎం-వీ3కి హై డెఫినిషన్ హంగులున్న రెండు చానళ్లు కలిగిన సీకర్‌ను జతచేశారు. ఇది వివిధ లక్ష్యాలను గురిచూసి దాడి చేయగలుగుతుంది. దీనిని బహిరంగ క్షేత్రాల్లోనూ, ఎత్తయిన ప్రాంతాల్లోనూ దాడి చేయడానికి ఉపయోగించవచ్చు. దీనికి రాత్రి, పగలు కూడా అప్పగించిన పనిని పూర్తి చేసే సామర్థ్యంతో పాటు ప్రయోగానంతరం లక్ష్యాన్ని గాని, లక్ష్య బిందువును గాని మార్చడానికి వీలుగా రెండు వైపుల డేటా లింకును కూడా జోడించారు. ఈ  క్షిపణిలో మూడు వార్‌హెడ్ ఐచ్ఛికాలున్నాయి: అవి.. ఆధునిక తరానికి చెందిన సాయుధ శకటాలను ధ్వంసం చేయగలిగిన రోల్డ్ హోమోజీనస్ ఆర్మర్ (ఆర్‌హెచ్ఏ)..  పేలుడుకు ప్రతిస్పందించే కవచాన్ని (ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్.. ఈఆర్ఏ) కూడా దీనికి తోడుగా సమకూర్చారు. బంకరును నాశనం చేసే సత్తా కలిగిన ఒక భేదక, విస్ఫోటక వార్‌హెడ్ జోడించారు. ఉన్నతమైన ఘాతక పరిధి కలిగిన ప్రి-ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ కూడా దీనికి అమర్చారు. 

 

ఈ క్షిపణిని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు అయిదు కలిసికట్టుగా అభివృద్ధిపరిచాయి. వాటిలో.. రిసర్చ్ సెంటర్ ఇమారత్, డిఫెన్స్ రిసర్చ్-డెవలప్‌మెంట్ లేబరేటరీ, టర్మినల్ బాలిస్టిక్స్ రిసర్చ్ లేబరేటరీ, హై-ఎనర్జీ మెటీరియల్స్ రిసర్చ్ లేబరేటరీ, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసర్చ్ లేబరేటరీ.. ఉన్నాయి. ప్రస్తుత పరీక్షలను యాంటి-ఆర్మర్ కాన్ఫిగరేషన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించారు.

ఈ క్షిపణిని మానవ ప్రమేయం ఉండని ఏరియల్ వెహికిల్ (యూఏవీ) నుంచి ప్రయోగించారు. దీనిని మన దేశానికి చెందిన ఒక అంకుర సంస్థ దేశవాళీ పరిజ్ఞానంతో రూపొందించింది. న్యూస్పేస్ రిసర్చ్ టెక్నాలజీస్ పేరుతో ఉన్న ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. డీఆర్‌డీఓ అనేక ఇతర భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న దూర శ్రేణి- అధిక సామర్థ్యం కలిగిన యూఏవీలతో పాటు యూఎల్‌పీజీఎం ఆయుధాల ఏకీకరణ ప్రక్రియను చురుకుగా ముందుకు తీసుకుపోతోంది. ఈ విశిష్ట ప్రాజెక్టును డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్‌నర్స్ (డీసీపీపీస్) అయిన అదానీ డిఫెన్స్, హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ (బీడీఎల్)లతో  పాటు 30 వరకు ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు తమ వంతు పాత్రను పోషించి, ఘనవిజయం దిశగా తీసుకుపోతున్నాయి.

యూఎల్‌పీజీఎం-వీ3 వ్యవస్థను అభివృద్ధిచేయడంతో  పాటు పరీక్షలను విజయవంతంగా ముగించినందుకు డీఆర్‌డీఓతో పాటు పరిశ్రమ భాగస్వాములకు, డీసీపీపీలకు, ఎంఎస్ఎంఈలకు, అంకుర సంస్థలకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. కీలక రక్షణ టెక్నాలజీలను భారత పారిశ్రామిక రంగం అవగాహన చేసుకొని ఉత్పత్తి చేయడానికి  ఇక సిద్ధంగా ఉందనడానికి ఈ విజయం నిరూపించిందని ఆయన అభివర్ణించారు.

 బృందాలను, డీసీపీపీలను, అంకుర సంస్థలను రక్షణ విభాగం పరిశోధన-అభివృద్ధి కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అభినందించారు. ఇలాంటి ఆయుధాన్ని తయారు చేయడం ప్రస్తుత తక్షణావసరమని ఆయన అన్నారు.

 

***


(Release ID: 2148559)