భారత ఎన్నికల సంఘం
అన్ని పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే తక్కువ మంది ఓటర్లున్న మొదటి రాష్ట్రంగా నిలిచిన బీహార్.. కొత్తగా 12,817 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని, ఉన్న చిరునామాలో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను గుర్తింపు పొందిన 12 ప్రధాన రాజకీయ పార్టీలకు అందించిన అధికారులు
ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఆగస్టు 1 నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్న ఈఆర్ఓలు… నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియ
Posted On:
21 JUL 2025 8:30PM by PIB Hyderabad
1,200 కంటే తక్కువ మంది ఓటర్లతో అన్ని పోలింగ్ కేంద్రాలు (పీఎస్) కలిగిన ఉన్న మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. పోలింగ్ స్టేషన్ల వద్ద పొడవైన వరుసలను నివారించేందుకు ఆ రాష్ట్రంలో కొత్తగా 12,817 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1500 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్న క్రితం నిబంధనను మారుస్తూ 2025 జూన్ 24 న ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం (బీహార్ ఎస్ఐఆర్ ఆర్డర్‌లోని పేజీ2లో పాయింట్ 6/7, పేజీ7 లో పాయింట్ 2(ఏ)) ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లే ఉండాలి. రాష్ట్రంలో కొత్తగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం పీఎస్‌ల సంఖ్య 77,895 నుంచి 90,712కి పెరిగింది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా బీహార్ బాటన నడవనున్నాయి.
2. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ, డీఈఓ, ఈఆర్‌ఓ, బీఎల్‌ఓలు సమావేశాలు నిర్వహించి.. ఇప్పటివరకు ఫారాలు అందని 29.62 లక్షల మంది ఓటర్ల వివరాలను, ఇచ్చిన చిరునామాలలో అందుబాటులో లేని దాదాపు 43.93 లక్షల మంది ఓటర్ల జాబితాను వారికి అందించారు. 12 ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా సంబంధిత జిల్లాల అధ్యక్షులు, ఆయా పార్టీలకు చెందిన సుమారు 1.5 లక్షల మంది బీఎల్ఓల ద్వారా ఓటర్లను చేరుకోవాలని అధికారులు కోరారు. 2025 ఆగస్టు 1న ప్రచురితం కానున్న ముసాయిదా ఓటరు జాబితాలో అర్హత కలిగిన అందరూ ఉండేలా రాజకీయ పార్టీలతో సహా మొత్తం ఎన్నికల యంత్రాంగం ఒక మిషన్ తరహాలో కలిసి పనిచేసేందుకు ఈసీఐ ఈ చర్యలు తీసుకుంటోంది.
***
(Release ID: 2146746)