ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధార్ డేటాబేస్ కచ్చితత్వం-సమగ్రత పరిరక్షణపై ‘యూఐడీఏఐ’ ముందుచూపు...

మృతుల ఆధార్ చెల్లుబాటు ఆపివేతకు నిర్ణయం

· ఈ దిశగా 1.55 కోట్ల మంది మరణ రికార్డుల పరిశీలన కోసం రిజిస్ట్రార్ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సహకారం

· మొత్తం 24 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలలో ‘మైఆధార్‌’ పోర్టల్‌లో ‘కుటుంబ సభ్యుల మరణ సమాచార నివేదన’ సేవకు ‘యూఐడీఏఐ’ శ్రీకారం

· మరణ సమాచార విస్తృత సేకరణకు ‘యూఐడీఏఐ’ ఏర్పాట్లు: బ్యాంకులు.. ఆధార్ నమోదు సంస్థలతో ఒప్పందం; వందేళ్లు నిండినవారి తనిఖీ... ఆధార్ కార్డుల చెల్లుబాటు నిలిపివేత ధ్రువీకరణ బాధ్యత రాష్ట్రాలకు అప్పగింత

Posted On: 16 JUL 2025 7:22PM by PIB Hyderabad

దేశంలోని ఆధార్ కార్డుదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ గుర్తింపు ధ్రువీకరణకు విశిష్ట గుర్తింపు జారీ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రత్యేక గుర్తింపు సంఖ్య, డిజిటల్ వేదిక ద్వారా వెసులుబాటు కల్పించింది. భారత పౌరులతోపాటు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) అందరికీ 12 అంకెలతో ప్రత్యేక డిజిటల్ గుర్తింపు సంఖ్యను ‘యూఐడీఏఐ’ జారీచేస్తుంది. ఇది ఎలాంటి మేధా ప్రక్రియతో నిమిత్తం లేకుండా యాదృచ్ఛికంగా రూపొందించే సంఖ్య కావడం వల్ల 12 అంకెలున్న ఇతర సంఖ్యలేవీ ఆధార్ నంబర్లుగా చలామణీ కావు. ఆధార్ సంఖ్యను ఒకసారి.. ఒకరికి మాత్రమే కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మృతుల ఆధార్‌ దుర్వినియోగం కాకుండా చూడటమేగాక గుర్తింపు పరమైన మోసాల నిరోధం దిశగా వారి ఆధార్‌ చెల్లుబాటు నిలిపివేత అవశ్యం.

 

 

అయితే, ఈ చర్యకు ముందు సదరు మృతుల ఆధార్‌ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులు పూర్తిచేసుకోవాల్సిన కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మరణ నిర్ధారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అందుకే, ఆధార్ డేటాబేస్ నిరంతర కచ్చితత్వం కొనసాగే విధంగా వివిధ వనరుల ద్వారా మరణ రికార్డులు సేకరించి, ధ్రువీకరణ తర్వాతనే వారి ఆధార్ నంబర్ల చెల్లుబాటును నిలిపివేయాలని ‘యూఐడీఐఏ’ నిర్ణయించింది.

 

1. ఇందులో భాగంగా ఆధార్ అనుసంధానిత మరణ రికార్డుల వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ)ని ఇటీవల అభ్యర్థించింది. దీంతో ఇప్పటిదాకా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్‌) ద్వారా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సమీకరించిన సుమారు 1.55 కోట్ల మరణ రికార్డులను ‘ఆర్‌జీఐ’ అందజేసింది. ఈ సమాచారాన్ని సముచిత రీతిలో తనిఖీ చేసిన అనంతరం వీటిలో దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్ల చెల్లుబాటును ‘యూఐడీఏఐ’ నిలిపివేసింది. మరోవైపు ‘సీఆర్‌ఎస్‌’ పరిధిలో లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనూ ఈ చర్యలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటిదాకా దాదాపు 6.7 లక్షల రికార్డులు అందగా, వాటి పరిశీలన-నిలిపివేత ప్రక్రియ కొనసాగుతోంది.

 

2. ప్రస్తుతం ‘సీఆర్‌ఎస్‌’ వ్యవస్థను వినియోగించే 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల నమోదు కోసం 2025 జూన్ 9 నుంచి ‘మైఆధార్‌’ (myAadhaar) పోర్టల్‌లో “కుటుంబ సభ్యుల మరణ సమాచార నివేదన” పేరిట కొత్త సేవను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా మృతుల వివరాలను కుటుంబ సభ్యులు నివేదించవచ్చు. ముందుగా కుటుంబ సభ్యులు తమ గుర్తింపును ధ్రువీకరించుకుని, అటుపైన ఆధార్ నంబరు, మరణ నమోదు ధ్రువీకరణ నంబరు సహా మృతుల జనసంఖ్యా సంబంధ వివరాలను నివేదించాలి. ఈ సమాచార ఆధారంగా సముచిత ధ్రువీకరణతో మృతుల ఆధార్ నంబరు చెల్లుబాటు నిలిపివేత లేదా ఇతరత్రా చర్యలు చేపడతారు. ఈ నేపథ్యంలో ‘సీఆర్‌ఎస్‌’ వ్యవస్థ లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోర్టల్‌ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది.

 

3. దీంతోపాటు బ్యాంకులు, ఆధార్‌ నమోదు-సమాచార నిర్వహణ వ్యవస్థలు, సంస్థల నుంచి మరణ రికార్డుల సమాచారం సేకరణ అవకాశాన్ని కూడా ‘యూఐడీఏఐ’ అన్వేషిస్తోంది.

 

4. అంతేకాకుండా మరణించిన ఆధార్ కార్డుదారుల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డుదారులు సజీవులేనా కాదా అన్నది నిర్ధారించుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు 100 సంవత్సరాలు పైబడిన కార్డుదారుల జనసంఖ్యా సంబంధ వివరాలను రాష్ట్రాల నుంచి సేకరిస్తోంది. ఈ మేరకు ధ్రువీకరణ అందిన తర్వాత సదరు ఆధార్ నంబర్‌ చెల్లుబాటు నిలిపివేత కోసం నిర్ధారణ ప్రక్రియ చేపడతారు.

 

 

ఎవరైనా మరణించినపుడు వారి ఆధార్‌ నంబరు దుర్వినియోగం కాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలని ‘యూఐడీఐఏ’ దేశ ప్రజలకు సూచిస్తోంది. మృతుల ఆధార్ దుర్వినియోగం నిరోధం దిశగా కుటుంబ సభ్యులు సంబంధిత అధికారి నుంచి మరణ ధ్రువీకరణ పత్రం స్వీకరించిన తర్వాత మరణ సమాచారాన్ని ‘మైఆధార్‌’ (myAadhaar) పోర్టల్‌లో నివేదించాలని కోరింది.

 

****


(Release ID: 2145414)