అంతరిక్ష విభాగం
శుభాంశు శుక్లా చారిత్రక పునరాగమనంపై భారత్ ఆనందోత్సాహాలు
· అంతరిక్ష రంగంలో శాశ్వత స్థానం పొందిన భారత్: కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
· “కక్ష్యలో విశ్వబంధు... ప్రపంచ అంతరిక్ష భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించిన భారత్”
· “ఇవి మన దేశం మునుపెన్నడూ చేయని ప్రయోగాలు”
Posted On:
15 JUL 2025 6:40PM by PIB Hyderabad
ఆక్సియం-4 అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా తిరిగి వచ్చారు. దీనిపై మంగళవారం కేంద్ర అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ- “ఇది యావత్ ప్రపంచానికీ గర్వకారణం... భారత్ కీర్తిపతాక అంతర్జాతీయంగా రెపరెపలాడిన క్షణం” అని అభివర్ణించారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో మన దేశం తనదైన శాశ్వత స్థానం సముపార్జించుకున్నదని పేర్కొన్నారు.
శుభాంశు శుక్లా పునరాగమనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో ఆయన ముచ్చటించారు. “ఆదర్శప్రాయుడైన భరతమాత ప్రియ పుత్రులలో ఒకరు క్షేమంగా తిరిగి వచ్చారు. దీంతో అంతరిక్ష రంగంలో భారత్ తనదైన శాశ్వత స్థానాన్ని సాధించింది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఆక్సియం-4 వాణిజ్య నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన నలుగురు వ్యోమగాములలో కీలక సభ్యుడు, భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్రూప్ కెప్టెన్ శుక్లా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత భూమికి తిరిగివచ్చారు. ఈ మేరకు ‘స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ గ్రేస్’ వారిని శాన్ డియాగో తీరంలో పసిఫిక్ మహా సముద్రంలో క్షేమంగా దింపింది. దీంతో ‘ఐఎస్‌ఎస్’లో 18 రోజులున్న ఈ అంతరిక్ష నౌక 22.5 గంటల తిరుగు ప్రయాణాన్ని పూర్తి చేసింది.
ప్రపంచ అంతరిక్ష పరిశోధనలలో ఇనుమడిస్తున్న భారత్ స్థాయిని ఈ మిషన్ ప్రస్ఫుటం చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. “ఇవి మునుపెన్నడూ చేయని ప్రయోగాలు. ప్రస్తుత ఘనత భారత్ శాస్త్రవిజ్ఞాన, సాంకేతిక స్వప్నాల సాకారంలో కొత్త శకారంభాన్ని సూచిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమ విజయం మానవాళిపై దీర్ఘకాలిక ప్రభావం చూపగలదని చెప్పారు.
ఆక్సియం-4లో వెళ్లిన అంతరిక్ష బృందంలో అనుభవజ్ఞులైన అమెరికా వ్యోమగామి, మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్ వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీ ప్రతినిధి టిబోర్ కాపు, భారత్ ప్రతినిధి శుక్లా ఉన్నారు. వీరి తిరుగు ప్రయాణంలో భాగంగా సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఈ అంతరిక్ష నౌక ‘ఐఎస్‌ఎస్’ నుంచి వేరుపడింది.
వీరి పునరాగమన అనంతర ప్రక్రియను వివరిస్తూ- ఈ నలుగురు వ్యోమగాములు జూలై 23 దాకా క్వారంటైన్‌లో ఉండి వైద్య, భూమిపై పరిస్థితులకు అలవాటు పడతారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. “అటుపైన 24వ తేదీ నుంచి వారు ఇస్రోతో చర్చలు ప్రారంభిస్తారు. అలాగే అంతరిక్షంలో నిర్వహించిన కార్యక్రమాలపై ఆక్సియం, నాసాతో సవివర సమీక్ష ఉంటుంది” అని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించే ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) దృక్పథానికి అనుగుణంగా ప్రపంచ శాస్త్రవిజ్ఞాన సహకారంలో భారత్ నిబద్ధతను ఈ మిషన్ పునరుద్ఘాటిస్తుందని డాక్టర్ సింగ్ అన్నారు. అంతరిక్షంలో సార్వత్రిక సౌభ్రాత్ర స్ఫూర్తిని చాటిన భారత వ్యోమగామి శుక్లా ఇప్పుడు నిజమైన విశ్వబంధు-ప్రపంచ పౌరుడని ఆయన అభివర్ణించారు. “ఇది కేవలం శాస్త్రవిజ్ఞాన లక్ష్యసాధనలో భాగంగానే కాకుండా మానవాళి ఉమ్మడి పయనంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ పాత్రను ఈ ఘనత ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ మిషన్ నేపథ్యంలో అవసరమైన విధివిధానాలు సహా విదేశాల్లో చర్చలు, సమీక్షలు ముగిసిన అనంతరం ఆగస్టు 17న శుక్లా మాతృభూమికి తిరిగి వస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
సురక్షిత పునరాగమనం శాస్త్రవిజ్ఞాన, ప్రతీకాత్మక విజయమంటూ- “ఆకాశమే హద్దుగా భారీ స్వప్నాలను నిర్దేశించుకోవాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు సాకారం కావడం ప్రారంభించింది. ప్రస్తుత విజయం దానికి నాంది మాత్రమే. శాస్త్రవిజ్ఞాన, అంతరిక్ష రంగంలో భవిష్యత్తును అన్వేషించుకోవడంలో నవతరం భారతీయులకు ఇది స్ఫూర్తినిస్తుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
భవిష్యత్ గగన్‌యాన్ మిషన్‌తో సహా ప్రపంచ మానవ అంతరిక్ష యాత్రా కార్యక్రమాల్లో భారత్ పాత్ర పెరుగుతుండటాన్ని ఆక్సియం-4లో శుక్లా భాగస్వామ్యం మరింత స్పష్టంగా చాటింది. అంతరిక్ష కార్యక్రమంకన్నా శుక్లా క్షేమంగా తిరిగి రావడం భారత్‌కు మరెంతో ప్రధానాంశం. భవిష్యత్ అంతర్జాతీయ అంతరిక్ష సహకారం దిశగా ఒక విశ్వసనీయ ముందడుగుకు ఇదొక సంకేతం.
****
(Release ID: 2145108)
Visitor Counter : 3