సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్త విడుదలకు ముందు న్యూఢిల్లీలో 'తన్వి ది గ్రేట్' ప్రీమియర్ ప్రదర్శించిన ఎన్ఎఫ్‌డీసీ, అనుపమ్ ఖేర్ ప్రొడక్షన్స్

Posted On: 14 JUL 2025 5:40PM by PIB Hyderabad


నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌డీసీ), అనుపమ్ ఖేర్ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన తాజా చలన చిత్రం 'తన్వి ది గ్రేట్' గ్రాండ్ రెడ్ కార్పెట్ ప్రీమియర్‌ను ఈనెల 13న న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని పీవీఆర్ ప్లాజాలో నిర్వహించారు. ఈ ప్రదర్శన రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది.

తన్వి ది గ్రేట్ ఒక హృదయ విదారకమైన, శక్తిమంతమైన కథ. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమిలో నిలబడి దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించాలనే తన దివంగత తండ్రి కలను.. మానసిక ఎదుగుదల సరిగా లేని కూతురు సైన్యంలో చేరి ధైర్యంగా సాకారం చేయడమే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో శుభాంగి, అనుపమ్ ఖేర్, ఇయాన్ గ్లెన్, పల్లవి జోషి, జాకీ ష్రాఫ్, బోమన్ ఇరానీ, నాజర్, కరణ్ టాకర్, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించారు.

ఈ ప్రీమియర్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి డాక్టర్ రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర, విదేశాంగ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిస్రీ, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ప్రభుత్వ.. చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ ప్రదర్శనను తిలకించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడం, సమ్మిళితత్వం, అజేయమైన మానవ స్ఫూర్తిని ప్రదర్శించే ఇలాంటి కథల ప్రాముఖ్యాన్ని వారు ప్రధానంగా ప్రస్తావించారు.

ఈనెల 18న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం.. అన్ని అడ్డంకులను అధిగమించి తన్వి సాధించిన అద్భుత విజయ ప్రయాణాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది.

ఎన్ఎఫ్‌డీసీ గురించి

జాతీయ ఆర్థిక విధానం, కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమను సమగ్రంగా, సమర్థంగా అభివృద్ధి చేసే ప్రణాళిక, ప్రోత్సాహం, నిర్వహణ లక్ష్యంగా 1975లో భారత ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ)ని ఏర్పాటు చేసింది.

ప్రేక్షకులను ఆకట్టుకునే కథలకు ఊతమిస్తూ, అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించే ఎన్ఎఫ్‌డీసీ దార్శనికతను ఈ ప్రీమియర్ పునరుద్ఘాటిస్తుంది. ఐదు దశాబ్దాలుగా సరికొత్త నిర్మాణాలు, దార్శనిక సహకారంతో ఎన్ఎఫ్‌డీసీ భారత సినీరంగాన్ని ముందుకు నడిపిస్తోంది. అద్భుతమైన, పరివర్తన కలిగించే కథలను సినీ తెరపైకి తీసుకురావడం పట్ల ఎన్ఎఫ్‌డీసీ నిబద్ధతకు.. ఈ సంస్థ 50వ వార్షికోత్సవ సందర్భంలో వస్తున్న తన్వి ది గ్రేట్ చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది.


 

***


(Release ID: 2144719)