ప్రధాన మంత్రి కార్యాలయం
నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
09 JUL 2025 10:14PM by PIB Hyderabad
గౌరవ స్పీకర్ గారు,
గౌరవ ప్రధాన మంత్రి గారు,
గౌరవ ఉప ప్రధాన మంత్రి గారు,
గౌరవ ఉప సభాపతి గారు,
గౌరవ పార్లమెంటు సభ్యులు,
ప్రియమైన సోదర సోదరీమణులారా...
ఓంవా ఉహలా పో నవా?
శుభ మధ్యాహ్నం!
గౌరవనీయ సభనుద్దేశించి ప్రసంగించే అవకాశం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.. కృతజ్ఞతలు!
ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ కి ప్రతినిధి గా మీ ముందు నిలుచున్నాను. 1.4 కోట్ల భారతీయుల శుభాకాంక్షలను నా వెంట తీసుకుని వచ్చాను.
ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.
మిత్రులారా..
కొన్ని నెలల క్రితం మీరొక చారిత్రక సందర్భాన్ని జరుపుకొన్నారు. నమీబియా తొలిసారి మహిళా రాష్ట్రపతిని ఎన్నుకుంది. ఈ సందర్భంలో మీ ఆనందాన్ని, గర్వాన్నీ మేం పంచుకుంటున్నాం. ఎందుకంటారా... భారత దేశంలో మేమూ మా రాష్ట్రపతిని మేడం ప్రెసిడెంట్ అనే సంబోధిస్తాం కనుక!
మా దేశ రాజ్యాంగం కల్పించిన అవకాశం వల్ల ఒక పేదింటి గిరిజన కుటుంబానికి చెందిన బిడ్డ ఈనాడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. మా రాజ్యాంగం బలానికి మరో ఉదాహరణను నేనే - నిరుపేద కుటుంబంలో జన్మించిన నేను, వరుసగా మూడో సారి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాను. ఏమీ లేని వారి దగ్గర మా రాజ్యాంగం అందించే గ్యారంటీ ఉండి తీరుతుంది. ఏమీ లేని వారికి అన్నీ రాజ్యాంగమే అందిస్తుంది.
గౌరవ సభ్యులారా,
ఈ ప్రతిష్ఠాత్మక సభలో నిలుచున్న సందర్భంలో ఈ దేశ తొలి అధ్యక్షుడు, నమీబియా వ్యవస్థాపకుడు, ఈ ఏడాది మొదట్లో కీర్తి శేషులు అయిన ప్రెసిడెంట్ సామ్ నుయోమాను తలుచుకుంటున్నాను. ఆయన అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను...
“మన స్వాతంత్య్రం మనపై గొప్ప బాధ్యతను మోపింది. మనం కష్టపడి దక్కించుకున్న ఈ స్వాతంత్ర్యాన్ని భద్రంగా కాపాడుకోవడమే కాక... తెగ, జాతి, రంగు భేదాలను విడనాడి, అందరికీ సమాన న్యాయం, అవకాశాలు అందించే ఉన్నత స్థాయి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.”
సమాన న్యాయం, స్వాతంత్య్రం కలిగిన జాతి గురించి ఆయన దార్శనికత నేటికీ మనందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. హోసియా కుటాకో, హెండ్రిక్ విట్బూయి, మండుమే యా ఎన్డెమూఫాయో వంటి ఎందరో స్వాతంత్య్ర సమార యోధుల స్మృతి పట్ల మా గౌరవాన్ని ప్రకటిస్తున్నాను.
స్వాతంత్య్రం కోసం మీరు సంఘర్షణ పడుతున్నప్పుడు భారత్ మీ వెంటే నిలిచింది. నిజానికి మాకు స్వాతంత్య్రం రాక ముందే మేం ఐక్యరాజ్య సమితిలో నైరుతి ఆఫ్రికా అంశాన్ని లేవనెత్తాం.
మీ స్వాతంత్య్ర పోరు సందర్భంలో మేం స్వాపోకు మద్దతునందించాం. స్వాపో తొలి విదేశీ దౌత్య కార్యాలయం న్యూఢిల్లీలో ఏర్పాటైందన్న విషయం మీకు తెలుసు. ఇక ఐరాస శాంతి దళానికి భారత్ కు చెందిన లెఫ్ట్ నెంట్ జనరల్ దివాన్ ప్రేమచంద్ నేతృత్వం వహించడమూ విదితమే!
నమీబియా పట్ల స్నేహాన్ని మాటలకే పరిమితం చేయక క్రియాపూర్వకంగా వ్యవహరించడం మాకు గర్వకారణం. సుప్రసిద్ధ నమీబియా కవి ఏమ్వులా యా నాన్గోలో మాటల్లో చెప్పాలంటే:
"మా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాడు మేం చరిత్రలోని అత్యుత్తమమైన స్మారక స్థూపాలని ఏర్పాటు చేసుకుంటాం”
ఈ పార్లమెంటు, ఈ సర్వస్వతంత్ర నమీబియా ఆయన మాటల్లోని సజీవ స్థూపాలే కదూ!
గౌరవ సభ్యులారా,
భారత్ నమీబియా దేశాలకు దగ్గరి పోలికలున్నాయి. మన రెండు దేశాలు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడాయి. వ్యక్తి గౌరవానికి, స్వేచ్ఛకి మనం ఎంతో విలువనిస్తాం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే సూత్రాలకు మన రాజ్యాంగాలు దన్నుగా నిలుస్తాయి. మనమంతా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలోని వారం. మనందరి ఆశలు, ఆకాంక్షలు ఒక్కటే!
ఇరుదేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహానికి గుర్తుగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడం నన్నెంతో ఉద్వేగానికి గురి చేస్తోంది. నమీబియాలో పెరిగే అందమైన దృఢమైన మొక్క వంటి మన స్నేహం కాలపరీక్షకు తట్టుకుని బలంగా నిలబడింది. నీరు అందని క్షామ పరిస్థితుల్లో కూడా ఆ మొక్క విరబూస్తూనే ఉంటుంది. మీ జాతీయ మొక్క అయిన వెల్విట్షియా మిరాబిలిస్ మాదిరిగానే కాలం గడుస్తున్న కొద్దీ మన స్నేహం కూడా బలపడుతోంది. మీ దేశపు అత్యున్నత పురస్కారంతో నన్ను సన్మానించినందుకు, 1.4 బిలియన్ల భారతీయుల తరఫున నేను మరొక్కమారు నమీబియా ప్రజలకు, రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా..
నమీబియాతో చారిత్రక సంబంధాలకు భారత్ ఎంతో ప్రాముఖ్యాన్నిస్తుంది. గత బంధాలకే పరిమితమవక, మన ఉమ్మడి భవిష్యత్తు సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాలని భావిస్తున్నాం. నమీబియా విజన్ 2030, హరంబీ ప్రాస్పెరిటీ ప్లాన్‌పై కలిసి పనిచేయడంఎంతో ప్రయోజనకరమని భావిస్తున్నాం.
నిజానికి మన ప్రజలే మన భాగస్వామ్యానికి కేంద్రంగా ఉన్నారు. 1700 మందికి పైగా నమీబియన్లు భారతదేశంలోని స్కాలర్‌షిప్‌లు, సామర్థ్య పెంపు కార్యక్రమాల వల్ల ప్రయోజనం పొందారు. తదుపరి తరం నమీబియా శాస్త్రవేత్తలు, వైద్యులు, నాయకులను తీర్చిదిద్దే అవకాశం కలగడం భారత్ కు గర్వకారణం. నమీబియా విశ్వవిద్యాలయంలోని ‘జెడ్స్’ క్యాంపస్, ఇండియా వింగ్ లోని ఐటీ ఎక్సలెన్స్ సెంటర్.. రక్షణ, భద్రతా రంగాల్లో శిక్షణ వంటివి, సామర్థ్యమే ఉత్తమమైన మార్గం అన్న మా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక కరెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రాంతంలో భారతదేశ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) విధానాన్ని ఆమోదించిన మొదటి దేశాల్లో నమీబియా కూడా ఒకటన్నది మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలో "టాంగి ఉనేన్" అని మీరనే లోపే డబ్బు వేగంగా బదిలీ అయిపోతుంది. అతి త్వరలో, కునేనేలోని హింబా అమ్మమ్మ గారో, కటుతురాలోని ఒక దుకాణదారో స్ప్రింగ్‌బాక్ (అతివేగంగా పరిగెట్టే జింక) కంటే వేగంగా, కేవలం ఒక ట్యాప్‌తో డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోగలుగుతారు.
మన ద్వైపాక్షిక వాణిజ్య స్థాయి 800 మిలియన్ (అంటే 80 కోట్ల) డాలర్ల కన్నా ఎక్కువగా ఉంది. అయితే, క్రికెట్ మైదానంలో మాదిరిగానే, మనం ఇప్పటికీ ఇంకా సన్నాహాల్లో నిమగ్నం అయిఉన్నాం. మనం మరింత వేగంగా ఇంకా ఎక్కువ పరుగులు రాబట్టుకోబోతున్నాం.
కొత్త ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటరును ఏర్పాటు చేసి నమీబియా యువతకు అండదండలను అందించడమనేది మాకు దక్కిన గౌరవం. ఈ కేంద్రంలో వ్యాపార ఆశయాలకు మార్గదర్శకత్వం అందించడంతో పాటు నిధులు, స్నేహం కూడా లభించనున్నాయి.
మన ఉమ్మడి ప్రాధాన్యాల్లో ఆరోగ్యం అనేది మరొక ముఖ్యాంశం. ఇండియా తీసుకువచ్చిన ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ దాదాపు 500 మిలియన్ (50 కోట్ల) మంది ప్రజలకు సేవలను అందిస్తోంది. అయితే, ఆరోగ్యం విషయంలో భారత్ ఆలోచనలు ఒక్క భారతీయులకే పరిమితం కావు.
భారత్ అనుసరిస్తున్న ‘‘వన్ ఎర్త్, వన్ హెల్త్’’ (‘అందరి కోసం, ఆరోగ్యం కోసం’) అనే సిద్ధాంతం ఆరోగ్య సంరక్షణను ప్రపంచ ఉమ్మడి బాధ్యతగా చూస్తోంది.
మహమ్మారి విజృంభించిన కాలంలో, మేం ఆఫ్రికా వెన్నంటి నిలిచాం.. ఇతరులు సాయమందించడానికి ముందుకు రాకపోయినా సరే, టీకామందులతో పాటు మందులను కూడా అందిస్తూవచ్చాం. మా ‘‘ఆరోగ్య మైత్రి’’ కార్యక్రమం ఆసుపత్రులు, సామగ్రి, మందులను సమకూర్చడంతో పాటు శిక్షణను ఇస్తూ ఆఫ్రికాకు దన్నుగా నిలబడుతోంది. కేన్సర్‌లో ఉన్నత స్థాయి సంరక్షణ సేవలకు గాను భాభాట్రాన్ ఎక్స్‌రే చికిత్స యంత్రాలను నమీబియాకు సమకూర్చడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్‌లో తయారు చేసిన ఈ యంత్రాలను ఇప్పటికే 15 దేశాలలో ఉపయోగిస్తున్నారు. కేన్సర్ వ్యాధి ముదిరిపోయి బాధపడుతున్న సుమారు 5 లక్షల మంది రోగులను ఈ యంత్రాలు ఆదుకొన్నాయి.
నాణ్యమైన మందులను తక్కువ ధరల్లో అందజేస్తున్న జన్ ఔషధి కార్యక్రమంలో చేరాల్సిందిగా నమీబియాను మేం కోరుతున్నాం. భారత్‌లో మందులకు పెట్టే ఖర్చులు ఈ కార్యక్రమం వల్ల 50 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు రోగులు వారి ఆరోగ్యసంరక్షణ ఖర్చులలో సుమారు 4.5 బిలియన్ (450 కోట్ల) అమెరికన్ డాలర్ల వరకు ఆదా చేసుకోవడానికి ఈ కార్యక్రమం తోడ్పడింది.
మిత్రులారా,
సహకారం, సంరక్షణ, కరుణ.. వీటితో ముడిపడ్డ ఒక శక్తిమంతమైన గాధ భారత్, నమీబియాలది. చీతాలను మా దేశంలోకి పున:ప్రవేశపెట్టే విషయంలో మీరు సాయం చేశారు. మీరు ఇచ్చిన ఈ కానుకకు గాను మీకు మేం అనేకానేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. చీతాలను కునో జాతీయ ఉద్యానవనంలో విడిచిపెట్టే భాగ్యం నాకు దక్కింది.
అవి మీకొక సందేశాన్ని పంపించాయి: ఆ సందేశమే ‘ఇనిమా ఆయిశే ఓయిలీ నావా’.. (ఈ మాటలకు, ‘అంతా బాగుంది’ అని అర్థం.)
అవి సంతోషంగా ఉన్నాయి. అవి వాటి కొత్త ఇంటికి చక్కగా అలవాటుపడిపోయాయి కూడా. వాటి సంఖ్య సైతం పెరిగింది. అంటే అవి భారత్‌లో ఆనందంగా మసలుకొంటున్నాయని స్పష్టమైపోతోంది.
మిత్రులారా,
మనం అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), ఇంకా సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) వంటి కార్యక్రమాలను అమలుపరుస్తూ మనం కలిసి ముందుకుపోతున్నాం. ఈ రోజు, నమీబియా ప్రపంచ జీవ ఇంధన వేదిక (గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్)లోనూ, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్)లోనూ చేరింది.
భవిష్యత్తుకేసి దృష్టి సారిస్తూ, మనం నమీబియా జాతీయ పక్షి ‘ఆఫ్రికన్ ఫిష్ ఈగిల్’ నుంచి మార్గదర్శకత్వాన్ని స్వీకరిద్దాం.. రండి. ఈ పక్షి తన నిశితమైన చూపులకు, భవ్యమైన ఆకాశయానానికి పెట్టింది పేరు. ఇది మనకు నేర్పుతున్న అంశాలు ఏమిటీ అంటే అవి...:
నాతో కలిసి నింగికెగరండి,
దిగంతాన్ని స్కాన్ చేయండి, ఇంకా
అవకాశాలను సాహసోపేతంగా సద్వినియోగపరుచకోండి.. అనేవే!.
మిత్రులారా,
2018లో, నేను ఆఫ్రికాతో మా అనుబంధానికి పది సిద్ధాంతాలను నిర్దేశించాను. ఈ రోజున వీటి విషయంలో భారత్ పూర్తి నిబద్ధతతో ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నాను. గౌరవం, సమానత్వంలతో పాటు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి రూపొందించిన సిద్ధాంతాలు ఇవి. మనం సహకరించుకోవాలనే కోరుకుంటాం తప్ప, పోటీపడాలని కోరుకోం. మన లక్ష్యం ఐకమత్యంతో ఉంటూ ఆశయాన్ని సాధించుకోవాలనేదే. ఒకరి వద్ద నుంచి లాగేసుకోవడాని కి బదులు ఒకరితో ఒకరం కలిసి ముందంజవేయడం మన ధ్యేయం.
ఆఫ్రికాలో మా అభివృద్ధి భాగస్వామ్యం స్థాయి 12 బిలియన్ (1200 కోట్ల) డాలర్ల కన్నా ఎక్కువ. అయితే దీని వాస్తవిక విలువను ఉమ్మడి వికాసం, ఉమ్మడి ప్రయోజనం.. వీటిని ఆధారంగా తీసుకొని లెక్కించాలి. మేం స్థానిక నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతుండడాన్ని, స్థానికంగా ఉద్యోగావకాశాలను కల్పిస్తూఉండడాన్ని, స్థానిక నవకల్పనలను ప్రోత్సహిస్తూ ఉండడాన్ని ఇక ముందూ కొనసాగిస్తుంటాం.
ఆఫ్రికా ఒక్క ముడిపదార్థాల సరఫరాదారుగానే మిగిలిపోకూడదని మేం నమ్ముతున్నాం. ఆఫ్రికా విలువ జోడింపులోనూ, నిలకడగా వృద్ధిని నమోదు చేస్తుండడంలోనూ మార్గదర్శకంగా నిలిచితీరాలి. ఈ కారణంగానే మేం పారిశ్రామికీకరణ విషయంలో ఆఫ్రికా ప్రతిపాదించిన ‘2063 అజెండా’కు పూర్తి మద్దతును ఇస్తున్నాం. రక్షణ, భద్రత .. ఈ రంగాల్లో మా సహకారాన్ని మరింతగా విస్తరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ వ్యవహారాల్లో ఆఫ్రికా పోషించే పాత్రకు భారత్ విలువిస్తోంది. మేం జీ20 అధ్యక్ష పదవి సమయంలో ఆఫ్రికా వినిపించిన వాణిని సమర్ధించాం. జీ20లో ఆఫ్రికా యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని కూడా మేం సగర్వంగా స్వాగతించాం.
మిత్రులారా,
భారత్ ప్రస్తుతం తన అభివృద్ధితో పాటే ప్రపంచ స్వప్నాలకు కూడా ఒక మార్గాన్ని చూపిస్తోంది.
దీనిలో కూడా, అభివృద్ధి చెందుతున్న దేశాలకే మేం ప్రాధాన్యాన్నిస్తున్నాం.
ఇరవయ్యో శతాబ్దంలో, భారత్ స్వాతంత్య్ర సాధన పరంగా ఒక నిప్పురవ్వను రగిల్చింది. అది ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా స్వాతంత్య్ర ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ఇరవైఒకటో శతాబ్దిలో, భారత్ సాధిస్తున్న అభివృద్ధి ఒక కొత్త దారిని చూపిస్తోంది. అది..అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నతి చెందగలవు, నాయకత్వం వహించగలగడంతో పాటు తమ సొంత భవిష్యత్తుకు రూపురేఖలను దిద్దుకోగలవు.. అనే మార్గం. ఈ సందేశం తాత్పర్యం ఏమిటంటే, మీరు గెలవగలరు.. అదీ మీవైన సొంత షరతుల పైన, మీ గుర్తింపును కోల్పోకుండానే మీరు విజయాన్ని అందుకోగలరు.. అనేదే.
మీరు మీదైన మార్గంలో పయనిస్తూ, మీ సంస్కృతి, మీ ఆత్మగౌరవంలతో విజయాన్ని అందుకోగలుగుతారు.. అనేదే భారత్ ఇచ్చే సందేశం.
ఈ సందేశాన్ని మరింత బిగ్గరగా వినిపించడానికి, మనం కలిసికట్టుగా పనిచేసితీరాలి.
- శక్తి మాధ్యమం ద్వారా కాక, భాగస్వామ్య మాధ్యమం ద్వారా,
- ఆధిపత్య భావన ద్వారా కాక, చర్చల మార్గం ద్వారా,
- బహిష్కరించడం ద్వారా కాక, సమానత్వ సాధన మార్గానుసరణ ద్వారా భవిష్యత్తును ఆవిష్కరించుకొందాం.. రండి.
ఇది మన ఉమ్మడి దార్శనిక భావనగా రూపొందనుంది:
‘‘స్వాతంత్య్రం నుంచి భవిష్యత్తు వరకు’’ - స్వతంత్రతా సే సమృద్ధి, సంకల్ప్ సే సిద్ధి.
స్వాతంత్య్ర నిప్పురవ్వ నుంచి మొదలుపెట్టి ఉమ్మడి ప్రగతి వెలుతురు వరకు.. రండి, మనం అందరం కలిసి ఈ మార్గంలో నడుద్దాం. రెండు దేశాలు స్వాతంత్య్ర జ్వాలల వేడిమిని భరించి వెలికివచ్చి తళుకులీనుతున్న క్రమంలో, ఇక మనం ఆత్మగౌరవం, సమానత్వం, అవకాశాలు పొంగిపొరలే భవిష్యత్తును గురించి కలలు కందాం రండి. అలాంటి భవితను ఆవిష్కరిద్దాం. ఒక్క మన ప్రజల కోసమే కాక, యావత్తు మానవాళి కోసం ఆ పనిని చేద్దాం.
శాంతి, ప్రగతి, సమృద్ధి.. వీటిని సాధించడానికి భాగస్వాములుగా మారి, ముందుకు సాగిపోదాం రండి. మనం పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్నే కాకుండా, మనం కలిసికట్టుగా తీర్చిదిద్దే భవిష్యత్తును కూడా వారసత్వంగా మన సంతానం అందుకొనేటట్లు చూద్దాం రండి. ఇవాళ ఇక్కడ నిల్చున్న నా లోలోపల ఆశ ఉప్పొంగుతూ ఉంది.. భారత్- నమీబియా సంబంధాల్లో చాలా మంచి కాలం మన ముందుంది.
మిత్రులారా,
నమీబియా 2027 క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణలో పాలుపంచుకోవడంలో గొప్పగా సఫలం అవ్వాలని కోరుకుంటూ, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఒకవేళ మీ ఈగిల్స్‌కు క్రికెట్‌లో ఏవైనా మెలకువలు అవసరపడితే, ఎవరిని సంప్రదించాలో మరి మీకు తెలుసు కదూ!
ఈ గౌరవాన్ని కట్టబెట్టినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు చెబుతున్నాను.
తాంగీ ఉనేనే (Tangi Unene!)
(Release ID: 2143707)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam