వ్యవసాయ మంత్రిత్వ శాఖ
తగ్గుతున్న పత్తి దిగుబడి సమస్య పరిష్కారం కోసం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి
Posted On:
09 JUL 2025 6:11PM by PIB Hyderabad
ఇటీవల బీటీ పత్తిని ఆశించిన టీఎస్‌వీ వైరస్ ప్రభావం కారణంగానూ, మొత్తంగా దేశంలో పత్తి దిగుబడి తగ్గడం పట్ల కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సమస్యలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. సాగు ఖర్చులను తగ్గిస్తూనే పత్తి దిగుబడిని పెంచడం పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
ఈ లక్ష్యం దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టడం కోసం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు కోయంబత్తూరులో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పత్తి రైతులు, సంబంధిత అధికారులు, సంస్థలు, నిపుణులు సహా ఈ రంగానికి సంబంధించిన ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు:
పత్తి సాగుచేసే రైతులు, రైతు సంఘాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నుంచి డైరెక్టర్ జనరల్ సహా సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రధానంగా పత్తి సాగు చేసే రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి నిపుణులు, పత్తి పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
"వైరల్ దాడులను, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే అధిక-నాణ్యత గల విత్తనాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దేశంలో పత్తి దిగుబడినీ, నాణ్యతను పెంచడానికి శాస్త్రీయమైన, ఆచరణీయ పరిష్కారాలను కనుగొనడం లక్ష్యంగా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోంది" అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పత్తి రైతులు, సంబంధిత వ్యక్తులు సూచనలు ఇవ్వాల్సిందిగా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానించారు. మంత్రిత్వ శాఖ టోల్-ఫ్రీ నంబర్ 1800 180 1551 ద్వారా సూచనలు అందించవచ్చని తెలిపారు.
"మీరు చేసిన సూచనలన్నీ పూర్తి శ్రద్ధతో నేను స్వయంగా సమీక్షిస్తాను. దేశంలో పత్తి సాగు భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం మనమంతా ఐక్యంగా ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకుందాం" అని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
రైతులకు అండగా ఉండటంతో పాటు పత్తి సాగులో సుస్థిరమైన వృద్ధిని సాధించడం పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
***
(Release ID: 2143513)