ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..‌

Posted On: 07 JUL 2025 9:53AM by PIB Hyderabad

యువర్ హైనెస్,

ఎక్స్‌లెన్సీస్,

బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్  అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీ‌చ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా‌కు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

బ్రిక్స్ సమూహంలో భిన్నత్వంతో పాటు బహుళ విధ ఆలోచనా విధానాలను కలిగి ఉండేందుకు ఉన్న ఆస్కారమే మనకున్న అతి గొప్పదైన బలం. ప్రస్తుతం, ప్రపంచం అన్ిన వైపుల నుంచి ఒత్తిడులకు లోనవుతోంది. ప్రపంచానికి ఎన్నో సవాళ్లు, అనిశ్చితులు ఎదురవుతున్నాయి. ఈ సన్నివేశంలో బ్రిక్స్‌కు సందర్భశుద్ధి, ఈ కూటమి ప్రసరించగల ప్రభావం అంతకంతకు పెరుగుతున్నాయి. రాబోయే కాలంలో బ్రిక్స్ ఏ విధంగా బహుళధ్రువ ప్రపంచ మనుగడకు ఒక మార్గదర్శిగా మారగలదో మనమంతా కలసి కూర్చొని ఆలోచన లు చేద్దాం.

ఈ విషయంలో కొన్ని సూచనలు, సలహాలను నేను చెప్పదలచుకొన్నాను:

ఒకటోది, బ్రిక్స్ గొడుగు నీడన.. మన ఆర్థిక సహకారం నిలకడగా పురోగమిస్తోంది. ఈ విషయంలో బ్రిక్స్ వ్యాపార మండలి, బ్రిక్స్ మహిళా వ్యాపార కూటమి ఒక ప్రత్యేక భూమికను పోషించాయి. బ్రెజిల్ అధ్యక్షతన, అంతర్జాతీయ ఆర్థిక సహాయ వ్యవస్థలో సంస్కరణలను తీసుకు వచ్చే అంశంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. దీనిని మేం స్వాగతిస్తున్నాం.

బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రూపంలో, మనం ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) ప్రగతి సాధన భరిత ఆకాంక్షలకు దన్నుగా నిలిచే ఒక బలమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని తెర మీదకు తెచ్చాం. ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపే ప్రక్రియలో ఎన్‌డీబీ.. అవసరాలకే ప్రాధాన్యాన్ని ఇచ్చే విధానాలకు, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆర్థిక సహాయాన్ని అందజేసే సందర్భాల్లో ఆ ఉద్దేశం నెరవేరుతుందా అనే అంశం, నష్ట భయానికి తావు ఇవ్వని రుణ రేటింగు.. ఈ విషయాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. బహుపాక్షిక సంస్థలలో సంస్కరణలు అవసరమని మనం మన వాణిని వినిపిస్తున్నాం.. మరి మన అంతర్గత వ్యవస్థలను బలపరచుకొంటే ఈ వాదనకు విశ్వసనీయత మరింతగా పెరుగుతుంది.

రెండోది, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం బ్రిక్స్ పైన కొన్ని ప్రత్యేక ఆశలను, ఆకాంక్షలను పెట్టుకొన్నాయి. వాటిని నెరవేర్చడానికి మనం కృషి చేయవచ్చు. ఉదాహరణకు, భారత్‌లో ఏర్పాటు చేసిన ‘బ్రిక్స్ అగ్రికల్చరల్ రిసర్చ్ ప్లాట్‌ఫాం’ (బ్రిక్స్ వ్యావసాయిక పరిశోధన వేదిక)నే తీసుకొంటే, వ్యవసాయ పరిశోధనలో సహకారాన్ని ఇదివరకటి కంటే పెంచడానికి తోడ్పడే ఒక విలువైన కార్యక్రమం ఇది అని నేను చెబుతాను. దీనికి అగ్రి-బయోటెక్, ప్రిసిజన్ ఫార్మింగ్‌లతో పాటు వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండే పద్ధతులను అనుసరించడం వంటి అంశాల్లో పరిశోధన, ఉత్తమ పద్ధతులను ఇతరులతో పంచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడే స్తోమత ఉంది. ఈ ప్రయోజనాలను మనం గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా అందజేయవచ్చు.. కదా.

ఇదే విధంగా, విద్యారంగానికి చెందిన పత్రికలను దేశమంతటా అందుబాటులో ఉంచాలన్న దృష్టితో ‘వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్’ ‘ ‘ఒకే దేశం, ఒకే చందా’) కార్యక్రమాన్ని మా దేశంలో ప్రారంభించాం. బ్రిక్స్‌ సభ్య దేశాల్లోనూ ఇదే తరహా ప్రయత్నాలు చేపట్టారు. ‘బ్రిక్స్ సైన్స్ అండ్ రిసర్చ్ రిపాజిటరీ’ని (బ్రిక్స్ విజ్ఞానశాస్త్ర, పరిశోధక భాండాగారం) ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయో మనమంతా పరిశీలించాలి అని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక విలువైన వనరుగా కూడా ఉపయోగపడవచ్చని నేను అనుకుంటున్నాను.

మూడోది, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), టెక్నాలజీ.. వీటి అందజేత వ్యవస్థలను సురక్షితంగా, ఆధారపడదగ్గవిగా తీర్చిదిద్దడానికి మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ వనరులను ఏ దేశమూ తన స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం గాని, లేదా ఇతర దేశాలపైన ఒక ఆయుధంగా ప్రయోగించడం గాని చేయకుండా తగిన చర్యలను తీసుకోవడం ముఖ్యం.

నాలుగోది, 21వ శతాబ్దంలో ప్రజల పురోగతి, శ్రేయస్సు చాలావరకు ఆధారపడేది టెక్నాలజీపైనే, అందులోనూ మరీముఖ్యంగా కృ‌త్రిమ మేధ (ఏఐ) పైనే. ఒక వైపు, ఏఐ రోజువారీ జీవనాన్ని ఎంతగానో మెరుగుపరచగలదు.. మరో వైపు, అది నష్టభయాలు, నైతికత, పక్షపాతం వంటి అంశాలపై ఆందోళనలకు కూడా చోటిస్తుంది. ఈ విషయంలో భారత్ విధానం స్పష్టంగా ఉంది. మేం ఏఐని మానవ విలువలను, మానవ శక్తియుక్తులను మరింతగా పెంచే ఒక సాధనంగా చూస్తున్నాం. ‘‘ఏఐ ఫర్ ఆల్ (‘‘అందరి కోసం ఏఐ’’).. ఈ సూత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని పనిచేస్తూ, భారత్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన రంగాల్లో ఏఐని మేం విస్తారంగా ఉపయోగించుకొంటున్నాం.

నవకల్పనకు ప్రోత్సాహానిస్తూ, సమస్యలను పరిష్కరించడానికి ఏఐ గవర్నెన్సులో సమాన ప్రాధాన్యాన్ని ఇవ్వాలనేదే మన విశ్వాసం. ఏఐని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం తప్పక పాటుపడదాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పి తీరాలి. అవి డిజిటల్ కంటెంటు వాస్తవికతను సరిచూడగలగాలి. అదే జరిగితే, కంటెంటుకు మూలాన్ని మనం గుర్తించడం వీలుపడుతుంది. అంతేకాకుండా, దీని ద్వారా పారదర్శకత్వాన్ని నిలబెట్టుకొంటూ దుర్వినియోగాన్ని అరికట్టగలుగుతాం కూడా.

ఈ రోజున విడుదల చేస్తున్న ‘‘ఏఐ గ్లోబల్ గవర్నెన్సుపై నేతల ప్రకటన’’ ఈ దిశగా ఒక సానుకూల నిర్ణయం. అన్ని దేశాల మధ్య మెరుగైన సహకారానికి గాను వచ్చే ఏడాదిలో భారత్‌లో ‘‘ఏఐ ప్రభావం అంశంపై శిఖరాగ్ర సదస్సు’’ను మనం నిర్వహించుకొందాం. ఈ శిఖరాగ్ర సదస్సును గొప్పగా విజయవంతం చేయడానికి మీరు ఇందులో చురుకుగా పాలుపంచుకోవాలని మేం ఆశిస్తున్నాం.

మిత్రులారా,

అభివృద్ధి చెందుతున్న దేశాలు మనపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని తీర్చడానికి, మనం ‘‘ఒక ఉదాహరణగా నిలుస్తూ మార్గదర్శకత్వాన్ని అందించే’’ సూత్రాన్ని అనుసరించి తీరాలి.  మనందరి ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి భాగస్వామ్య దేశాలతో భుజం భుజం కలిపి పనిచేయడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి భావానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు. 

 

***


(Release ID: 2142887)