నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దేశంలో మొట్టమొదటి సముద్ర రంగ ఎన్‌బీఎఫ్‌సీ- సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఎంఎఫ్‌సీఎల్)ను ప్రారంభించిన సర్బానంద సోనోవాల్
“సముద్ర రంగంలో ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఎస్ఎంఎఫ్‌సీఎల్...
ఆర్థికపరమైన అంతరాల తగ్గింపునకు అవకాశం: సర్బానంద సోనోవాల్
Posted On:
26 JUN 2025 5:58PM by PIB Hyderabad
భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను (ఎస్ఎంఎఫ్‌సీఎల్) ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖా మంత్రి (ఎంఓపీఎస్‌డబ్ల్యూ) శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎంఓపీఎస్‌డబ్ల్యూ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ కూడా పాల్గొన్నారు.
గతంలో సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌గా ఉన్న సంస్థే ఇప్పుడు ఎస్‌ఎంఎఫ్‌సీఎల్‌గా మారింది. భారత అమృత కాల దార్శనికతకు అనుగుణంగా నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎస్‌ఎంఎఫ్‌సీఎల్ కీలక పాత్ర పోషించనుంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్న ఒకటో విభాగంలో ఉంది. ఇది 2025 జూన్ 19న భారతీయ రిజర్వు బ్యాంకుతో (ఆర్‌బీఐ) వద్ద అధికారికంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా (ఎన్‌బీఎఫ్‌సీ) నమోదైంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “నౌకా వాణిజ్యం విషయంలో భారతదేశ ప్రయాణంలో సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ఎన్‌బీఎఫ్‌సీగా నమోదు కావటం ఒక కీలక పరిమాణం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభంగా నౌకా వాణిజ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానమైన ఆర్థిక అంతరాలను ఎస్‌ఎంఎఫ్‌సీఎల్ తగ్గిస్తుంది. ఈ రంగంలో నిర్దిష్ట ఆర్థిక పరిష్కారాలను అందిస్తూ ఓడరేవులు, ఎంఎస్‌ఎంఈలు, అంకురాలు, ఇతర సంస్థలను శక్తివంతం చేస్తుంది. సముద్రాల విషయంలో దేశంలో ఉన్న దీర్ఘకాల డిమాండ్‌ను ఇది నెరవేర్చింది. నౌకావాణిజ్యానికి సంబంధించి అమృత కాల దార్శనికత-2047, నౌకా వాణిజ్యంలో దేశాన్ని ప్రపంచ శక్తికేంద్రంగా మార్చటంతో పాటు అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం సాధించే ఈ సంస్థ ఉపయోగపడుతుంది” అని అన్నారు.
ఒక రంగంలో మాత్రమే పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీగా నౌకా వాణిజ్యంలో ఫైనాన్సింగ్ అంతరాలను తగ్గించేందుకు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఎస్‌ఎంఎఫ్‌సీఎల్ సిద్ధంగా ఉంది. నౌకాయాన ప్రాధికార సంస్థలు, సరుకు రవాణా కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, నౌకా వాణిజ్యానికి చెందిన విద్యా సంస్థలు వంటి విభిన్న శ్రేణి భాగస్వాములకు స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక నిధుల సరఫరాతో పాటు ప్రత్యేకమైన ఆర్థిక పరిష్కారాలను అందించనుంది.
నౌకా వాణిజ్యం విషయంలో విస్తృత శ్రేణిలో ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు ప్రస్తుతం ఎస్ఎంఎఫ్‌సీఎల్‌కు అనుమతి ఉంది. నౌకానిర్మాణం, పునరుత్పాదక ఇంధనం, నౌకాయాన టూరిజం, సముద్రాలకు సంబంధించిన విద్య వంటి వ్యూహాత్మక రంగాలకు కూడా ఇకమీదట ఈ సంస్థ మద్దతునివ్వనుంది. నౌకా వాణిజ్యంలో ప్రపంచ దేశాల నాయకత్వ స్థానానికి ఎదగాలనే భారతదేశ దార్శనికతను ఇది మరింత బలోపేతం చేయనుంది.
ఈ సందర్భంగా ఎంఓపీఎస్‌డబ్ల్యూ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ మాట్లాడుతూ.. “ ఇప్పుడు ఎస్ఎంఎఫ్‌సీఎల్ పూర్తి ఎన్‌బీఎఫ్‌సీగా మారినందున నౌకా వాణిజ్య రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు కావాల్సిన ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను తయారుచేస్తున్నాం. ఇది ఈ రంగంలో ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమగ్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను కల్పిస్తుంది” అని అన్నారు.
భారత నౌకా వాణిజ్య రంగ వృద్ధి విషయంలో మరింత కేంద్రీకృత, అందుబాటులో ఉన్న ఆర్థిక వ్యవస్థను అందించేందుకు ఎస్ఎంఎఫ్‌సీఎల్ సిద్ధంగా ఉంది. సుస్థిరాభివృద్ధి, ఆవిష్కరణలు, జాతీయ సరుకు రవాణా సామర్థ్యానికి దోహదపడే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇది వెసులుబాటు కల్పించనుంది.
(Release ID: 2140062)
Visitor Counter : 3