ఆయుష్
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా యోగా మహాకుంభ్ ఆవిష్కృతం


2025 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విస్తృత ప్రారంభం

Posted On: 18 JUN 2025 4:57PM by PIB Hyderabad

ఈనెల 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2025 కోసం కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన సందర్భంగా, యోగా మహా కుంభ్ పేరుతో దేశవ్యాప్తంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, మూడు రోజుల యోగా మహా కుంభ్ ఈరోజు న్యూఢిల్లీ ఆర్‌కె పురంలోని హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం సహకారంతో.. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (kaankaర్), మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎమ్‌డీఎన్ఐవై) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ధ్యానం, సమాజ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేలా రూపొందించిన వివిధ యోగా ప్రదర్శనలు, ఆరోగ్య సదస్సులు, మానసికోల్లాసాన్ని కలిగించే  సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగంగా ఉంటాయి.  
ఉత్సాహభరితమైన నుక్కడ్ నాటక ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాటకంలో భాగంగా యోగా ఔత్సాహికులు నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను ప్రేక్షకులకు వివరించారు. శారీరక సౌలభ్యం నుంచి మానసిక ప్రశాంతత వరకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా ప్రదర్శించారు. సమతుల జీవనశైలి కోసం యోగాను అభ్యసించేలా ప్రేక్షకులను ప్రేరేపించారు.

మరో ప్రధాన యోగా మహా కుంభ్ కార్యక్రమం ఈనెల 15న లదాఖ్‌లోని ఎత్తయిన కొండలపై స్వచ్ఛమైన వాతావరణంలో ప్రారంభమైంది. లదాఖ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ (ఐఎఫ్‌వైఎమ్)-2025 ఇప్పటికే పాంగోంగ్ లేక్ (13,000లకు పైగా అడుగుల ఎత్తు), నుబ్రా వ్యాలీ, సింధు ఘాట్, ఎమ్ఐఎమ్‌సీ దేవచన్ క్యాంపస్ వంటి అద్భుత ప్రదేశాలకు యోగాను పరిచయం చేయడం ద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సంవత్సరం "యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్" అనే శక్తిమంతమైన సందేశంతో.. ఆయుష్ మంత్రిత్వ శాఖ, మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం (ఎమ్ఐఎమ్‌సీ), యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లదాఖ్, ఎల్ఏహెచ్‌డీసీ లేహ్, అనుబంధ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవం విజయవంతమైంది.

రెండో యోగా మహా కుంభ్ కార్యక్రమం కూడా ఈనెల 15న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నోయిడాలోని సెక్టార్ 50లో అర్హమ్ ధ్యాన్ యోగ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత, కుటుంబాలకు సెక్టార్ 78లోని వేద్ వాన్ పార్కులో హరిత్ యోగా సమావేశాలు, వ్యాసరచన.. చర్చా పోటీలు, అందరూ కలిసి పాలుపంచుకునే పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 21న సెక్టార్ 33ఎలోని శివాలిక్ పార్కులో దేశవ్యాప్తంగా జరిగే యోగా సంగమ్ వేడుకలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐడీవై-2025 ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తూ.. ఇదే సమయంలో అర్హమ్ ధ్యాన్ యోగ్ ప్రపంచవ్యాప్తంగా సమావేశాలను కూడా నిర్వహిస్తోంది.

లదాఖ్‌లోని ఎత్తయిన శిఖరాల నుంచి ఢిల్లీలోని సాంస్కృతిక కేంద్రాలు, నోయిడాలోని ఆహ్లాదకరమైన స్థానిక ఉద్యానవనాల వరకు, యోగా మహా కుంభ్-2025.. భారత యోగ వారసత్వాన్ని శక్తిమంతమైన, సమ్మిళిత వేడుకగా ఆవిష్కృతం చేస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను శ్వాస - సమతుల్యతతో ఐక్యం చేయడం ద్వారా ఈ కార్యక్రమాలు.. యోగాకు గల సార్వత్రిక ఆకర్షణను, ఆరోగ్యకరమైన, మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని రూపొందించడంలో భారత్ నాయకత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు ప్రజలందరినీ ఆహ్వానిస్తూ.. పెద్దసంఖ్యలో పౌరులు పాల్గొనేలా, యోగాను వారి జీవన విధానంగా స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి.


 

****


(Release ID: 2137507) Visitor Counter : 4