ఆయుష్
యోగా బంధన్ నిర్వహించిన ఎమ్డీఎన్ఐవై: యోగాతో ప్రేరణ పొందిన జీవిత అనుభవాలను పంచుకున్న ప్రపంచ యోగా ప్రచారకర్తలు
ఐడీవై-2025కు ముందే భారత యోగా దౌత్యాన్ని ప్రదర్శించిన యోగా బంధన్
ప్రపంచమంతా యోగాను అనుసరిస్తోంది: ఆయుష్ కార్యదర్శి
శాంతి-సామరస్యాలకు గళం మీవంటి ప్రతినిధులే: డీజీ, ఐసీసీఆర్
Posted On:
17 JUN 2025 4:54PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2025 వేడుకల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎమ్డీఎన్ఐవై) ఈరోజు ప్రపంచ 'యోగా బంధన్' ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఐడీవై-2025 సందర్భంగా నిర్వహిస్తున్న 10 ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన ఈ కార్యక్రమం.. వివిధ సంస్థల మధ్య సహకార ఒప్పందాల ద్వారా యోగా రంగంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల భారత్ నిబద్ధతను స్పష్టం చేసింది.
‘యోగా బంధన్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ప్రచారకర్తలందరిని ఒకే వేదికకు చేర్చింది. సాంస్కృతిక మార్పిడి, విద్యాసంబంధ చర్చలకు, యోగా ద్వారా ప్రపంచ శ్రేయస్సును సాధించాలనే సమష్టి దార్శనికతను స్పష్టం చేసే చక్కని వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. 15 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగా గురువులు, అభ్యాసకులు, స్టూడియో నిర్వాహకులు, రచయితలు, ఆరోగ్య నిపుణులు సహా ప్రముఖ అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రారంభ సమావేశానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య చర్చలో యోగాను ముందంజలో ఉంచడంలో భారత్ దార్శనిక నాయకత్వాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) విడుదల చేసిన డేటాను ప్రస్తావిస్తూ, దేశంలోని గ్రామీణ, పట్టణ జనాభాలో దాదాపు 95 శాతం మందికి ఆయుష్ వ్యవస్థల గురించి అవగాహన ఉందన్నారు. వీరిలో దాదాపు 35 శాతం జనాభా ఏదో ఒక రూపంలో యోగాను ఉత్సాహంగా సాధన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వివిధ దేశాల్లో పర్యటించిన తన అనుభవాలను ప్రస్తావిస్తూ, యోగాను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారని శ్రీ కోటేచా వ్యాఖ్యానించారు. ఐడీవై-2025 సందర్భంగా నిర్వహిస్తున్న హరిత్ యోగా, యోగా కనెక్ట్, సమ్యోగా వంటి కీలక కార్యక్రమాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3.3 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. జూన్ 21న ఐడీవై-2025 ప్రధాన కార్యక్రమం జరిగే సమయానికి నిర్వహించిన ఈ మొత్తం కార్యక్రమాల సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలను ఆయన ప్రస్తావించారు.
***
(Release ID: 2137037)